Heath Streak: హీత్ స్ట్రీక్ బతికే ఉన్నాడు: చనిపోయాడని ట్వీట్ చేసిన ఒలాంగా మరో ట్వీట్
23 August 2023, 11:25 IST
- Heath Streak: హీత్ స్ట్రీక్ బతికే ఉన్నాడట. అతడు చనిపోయాడని ట్వీట్ చేసిన మాజీ క్రికెటర్ ఒలాంగా.. కాసేపటికే మరో ట్వీట్ చేయడం విశేషం. ఈ సందర్భంగా స్ట్రీక్ తో తాను చేసిన వాట్సాప్ చాట్ స్క్రీన్‌షాట్ కూడా షేర్ చేశాడు.
జింబాబ్వే మాజీ కెప్టెన్ హీత్ స్ట్రీక్
Heath Streak: జింబాబ్వే మాజీ కెప్టెన్ హీత్ స్ట్రీక్ బతికే ఉన్నాడంటూ ఆ టీమ్ మాజీ బౌలర్ హెన్రీ ఒలాంగా మరో ట్వీట్ చేశాడు. అతడు చనిపోయాడని ట్వీట్ చేసిన కొద్ది సేపటికే ఆ ట్వీట్ డిలీట్ చేసి మరో ట్వీట్ చేయడం విశేషం. కాసేపటి కిందటే తాను అతనితో మాట్లాడినట్లు కూడా ఒలాంగా చెప్పాడు. దీంతో క్రికెట్ ప్రపంచం ఊపిరి పీల్చుకుంది.
"హీత్ స్ట్రీక్ చనిపోయాడన్న పుకార్లు మరీ ఎక్కువగా వ్యాపించాయి. నేను ఇప్పుడే అతనితో చాట్ చేశాను. మూడో అంపైర్ అతన్ని మళ్లీ వెనక్కి పిలిచాడు. అతడు బతికే ఉన్నాడు" అని ఒలాంగా ట్వీట్ చేశాడు. తాను స్ట్రీక్ తో చేసిన వాట్సాప్ చాట్ ను కూడా ఈ ట్వీట్ కు జత చేశాడు. ఒలాంగా చేసిన ఈ ట్వీట్ తో స్ట్రీక్ బతికే ఉన్నాడంటూ సోషల్ మీడియాలో మరోసారి మెసేజ్ లు వెల్లువెత్తాయి.
జింబాబ్వే తరఫున ఆడిన ఆల్ టైమ్ గ్రేట్ ఆల్ రౌండర్ స్ట్రీక్ చనిపోయాడంటూ బుధవారం (ఆగస్ట్ 23) ఉదయం ఒలాంగా ట్వీట్ చేశాడు. స్ట్రీక్ కొంతకాలంగా క్యాన్సర్ తో పోరాడుతున్నాడు. ఈ ఏడాది మే నెలలో అతని ఆరోగ్యం బాగా క్షీణించిందని కూడా ఒలాంగా అప్పట్లో ట్వీట్ చేశాడు. అయితే తాజాగా అతని మరణ వార్తలు మాత్రం అభిమానులను ఎంతగానో బాధించాయి.
బతికే ఉన్న వ్యక్తి మరణించాడంటూ వార్తలు రావడం ఈ మధ్య కాలంలో తరచూ జరుగుతోంది. సినీ ప్రముఖుల విషయంలోనూ గతంలో ఇలాంటి తప్పిదాలు జరిగాయి. జింబాబ్వే తరఫున ఆడిన గ్రేటెస్ట్ ప్లేయర్స్ లో స్ట్రీక్ కూడా ఒకడు. అతడు 2000 నుంచి 2004 వరకు కెప్టెన్ గానూ ఉన్నాడు. ఆ టీమ్ తరఫున మొత్తం 65 టెస్టులు, 189 వన్డేలు ఆడాడు.
2005లో రిటైర్మెంట్ ప్రకటించిన అతడు.. టెస్టుల్లో 216 వికెట్లు తీయడంతోపాటు 1990 రన్స్ చేశాడు. ఇక వన్డేల్లో 239 వికెట్లు తీయడంతోపాటు 2943 రన్స్ చేయడం విశేషం.