World Cup tickets: మరీ ఇంత చెత్తగానా.. వరల్డ్ కప్ టికెట్ల అమ్మకంపై బుక్ మై షో, బీసీసీఐపై ఫ్యాన్స్ సీరియస్
29 August 2023, 22:07 IST
World Cup tickets: మరీ ఇంత చెత్తగానా అంటూ వరల్డ్ కప్ టికెట్ల అమ్మకంపై బుక్ మై షో, బీసీసీఐపై ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. ఈ మెగా టోర్నీ కోసం ఆగస్ట్ 25 నుంచి టికెట్ల అమ్మకాలు ప్రారంభమైన విషయం తెలిసిందే.
ఐసీసీ వరల్డ్ కప్ ట్రోఫీ
World Cup tickets: ఇండియాలో 12 ఏళ్ల తర్వాత జరగబోతున్న వరల్డ్ కప్ కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీంతో టికెట్ల అమ్మకాలు ప్రారంభం కాగానే కొనుగోలు చేయడానికి ఎగబడుతున్నారు. ఆగస్ట్ 25 నుంచే వరల్డ్ కప్ టికెట్ల అమ్మకాలు ప్రారంభం కాగా.. ఇండియా మ్యాచ్ ల టికెట్లు బుధవారం (ఆగస్ట్ 30) నుంచి అందుబాటులోకి రానున్నాయి.
అయితే వరల్డ్ కప్ టికెట్ల అమ్మకం తీరుపై ఫ్యాన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు. బీసీసీఐ, బుక్ మై షోలను ఏకిపారేస్తున్నారు. చాలా దారుణమైన అనుభవం అంటూ సోషల్ మీడియా ద్వారా అసహనం వ్యక్తం చేస్తున్నారు. మొదట ఈ టికెట్లు కొనుగోలు కోసం వరల్డ్ కప్ వెబ్‌సైట్లో రిజిస్టర్ చేసుకోవాలని చెప్పారు. ఇక ఆగస్ట్ 25 నుంచి ఇండియా కాకుండా ఇతర టీమ్స్ ఆడే మ్యాచ్ ల టికెట్ల అమ్మకాలు ప్రారంభించారు.
అయితే ఇండియా మ్యాచ్ ల టికెట్లు బుధవారం (ఆగస్ట్ 30) నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా.. మాస్టర్ కార్డ్ యూజర్లకు మాత్రం మంగళవారం (ఆగస్ట్ 29) సాయంత్రం నుంచే ప్రారంభమైంది. అయితే టికెట్లు బుక్ చేసుకోవడానికి ప్రయత్నించిన యూజర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బుక్ మై షో యాప్ తరచూ క్రాష్ అవడం, చాలా ఎక్కువ సేపు వేచి చూడాల్సి రావడం అభిమానుల సహనాన్ని పరీక్షించాయి.
ఇండియాలోని అభిమానులు టికెట్లు బుక్ చేసుకోవడం కోసం బీసీసీఐ బుక్ మై షోతో ఒప్పందం కుదుర్చుకుంది. మొదట మాస్టర్ కార్డ్ యూజర్లకు టికెట్ల కొనుగోలు అవకాశం కల్పించిన ఈ యాప్.. వాళ్లకు దారుణమైన అనుభవాన్ని మిగిల్చింది. కొందరికి మరీ 3 గంటల సమయం వేచి చూడాల్సి రావడం గమనార్హం. ఇక ఇండియా సెప్టెంబర్ 30, అక్టోబర్ 3న ఆడబోయే వామప్ మ్యాచ్ ల టికెట్ల అమ్మకాలు బుధవారం (ఆగస్ట్ 30) రాత్రి 8 గంటల నుంచి ప్రారంభం కానున్నట్లు ఐసీసీ తెలిపింది.
సెప్టెంబర్ 15 వరకూ టికెట్ల అమ్మకాలు జరగనున్నాయి. బుధవారం (ఆగస్ట్ 30) ఇండియా ఆడే వామప్ మ్యాచ్ ల టికెట్లు, గురువారం (ఆగస్ట్ 31) చెన్నై, ఢిల్లీ, పుణెల్లో ఇండియా ఆడబోయే మ్యాచ్ ల టికెట్లు.. శుక్రవారం (సెప్టెంబర్ 1) ధర్మశాల, లక్నో, ముంబైలలో ఇండియా ఆడే మ్యాచ్ ల టికెట్లు.. శనివారం (సెప్టెంబర్ 2) బెంగళూరు, కోల్‌కతాలలో ఆడే మ్యాచ్ ల టికెట్లు.. సెప్టెంబర్ 3న అహ్మదాబాద్ లో ఆడే టికెట్లను కొనుగోలు చేయవచ్చు. సెప్టెంబర్ 15న సెమీ ఫైనల్స్, ఫైనల్ టికెట్లు అందుబాటులోకి వస్తాయి.