AUS vs NED: ప్రపంచకప్ చరిత్రలో అతిపెద్ద విజయాన్ని సాధించిన ఆస్ట్రేలియా: కుప్పకూలిన నెదర్లాండ్స్
25 October 2023, 21:46 IST
- AUS vs NED World Cup 2023 Match 24: నెదర్లాండ్స్‌ను ఆస్ట్రేలియా చిత్తుగా ఓడించింది. వన్డే ప్రపంచకప్ 2023 టోర్నీలో భారీ విజయంతో ఆసీస్ చరిత్ర సృష్టించింది.
AUS vs NED: ప్రపంచకప్ చరిత్రలో అతిపెద్ద విజయాన్ని సాధించిన ఆస్ట్రేలియా
AUS vs NED World Cup 2023 Match 24: వన్డే ప్రపంచకప్‍లో ఆస్ట్రేలియా భారీ విజయాన్ని సాధించింది. నెదర్లాండ్స్‌ను చిత్తుచిత్తుగా ఓడించిన ఆసీస్ చరిత్ర సృష్టించింది. ప్రపంచకప్‍లో భాగంగా ఢిల్లీలో నేడు (అక్టోబర్ 25) జరిగిన మ్యాచ్‍లో ఆస్ట్రేలియా ఏకంగా 309 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌పై విజయం సాధించింది. 48 సంవత్సరాల వన్డే ప్రపంచకప్ చరిత్రలో అతిపెద్ద గెలుపును నమోదు చేసుకొని.. ఆస్ట్రేలియా చరిత్ర సృష్టించింది.
ఆస్ట్రేలియా బౌలింగ్ ధాటికి.. 400 పరుగుల లక్ష్యఛేదనలో నెదర్లాండ్స్ 21 ఓవర్లలో కేవలం 90 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ స్పిన్నర్ ఆజమ్ జంపా నాలుగు వికెట్లతో సత్తాచాటగా.. మార్ష్ రెండు, స్టార్క్, హేజిల్ వుడ్, కమిన్స్ చెరో వికెట్ తీశారు. నెదర్లాండ్స్ బ్యాటర్లలో విక్రమ్‍జీత్ సింగ్ (25) మినహా మరెవరు కూడా కనీసం 20 పరుగులు కూడా చేయలేకపోయారు. అంతకు ముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 8 వికెట్లకు 399 పరుగుల భారీ స్కోరు చేసింది. గ్లెన్స్ మ్యాక్స్‌వెల్ (44 బంతులు 106 పరుగులు) మెరుపు రికార్డు శతకంతో చెలరేగగా.. డేవిడ్ వార్నర్ (104) కూడా సెంచరీ చేశాడు. ఈ వన్డే ప్రపంచకప్‍లో తొలి రెండు మ్యాచ్‍ల్లో ఓడిన ఆస్ట్రేలియా.. వరుసగా మూడు మ్యాచ్‍లు గెలిచి సెమీస్ రేసులోకి దూసుకొచ్చేసింది. ప్రస్తుతం 6 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది.
వెంటవెంటనే వికెట్లు..
భారీ లక్ష్యఛేదనలో ఆస్ట్రేలియా బౌలర్లను ఏ దశలోనూ దీటుగా ఆడలేకపోయారు నెదర్లాండ్స్ బ్యాటర్లు. మ్యాక్స్ ఐడౌడ్(6)ను ఆసీస్ పేసర్ స్టార్క్ ఔట్ చేయగా.. విక్రమ్‍జీత్ సింగ్ రనౌట్ అయ్యాడు. కోలిన్ అకెర్మాన్ (10), సిబ్రాండ్ ఎంజిల్‍బెచ్ (11), బాస్ డీ లీడ్ (4) ఎక్కువసేపు నిలువలేకపోయారు. దీంతో 62 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది నెదర్లాండ్స్. తేజ నిడమానూరు (14) కూడా త్వరగానే పెలియన్ చేరాడు. ఆ తర్వాత ఆసీస్ స్పిన్నర్ ఆడమ్ జంపా.. వెంటవెంటనే వికెట్లు తీసి.. నెదర్లాండ్స్‌ను వేగంగా కుప్పకూల్చాడు. వాన్ బీక్ (0), రూలఫ్ వాండర్ మెర్వ్ (0), ఆర్యన్ దత్ (1), పౌల్ వాన్ మీకీరన్ (0)ను రెండు ఓవర్ల వ్యవధిలో జంపా ఔట్ చేశాడు. దీంతో 21 ఓవర్లలో 90 పరుగులకే నెదర్లాండ్స్ ఆలౌటైంది. మరోవైపు, నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్ట్స్ (12 నాటౌట్) చివరి వరకు అలానే నిలిచాడు. మరో ఎండ్‍లో వికెట్లు టపటపా పడ్డాయి.
అంతకు ముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాకు డేవిడ్ వార్నర్ అదిరే ఆరంభాన్ని ఇచ్చాడు. మిచెల్ మార్ష్ (9) త్వరగానే ఔటయ్యాడు. అయితే వార్నర్ దూకుడు చూపాడు. సెంచరీతో సత్తాచాటాడు. స్టీవ్ స్మిత్ (71), మార్నస్ లబుషేన్ (62) అర్ధ శతకాలతో మెరిశారు. ఇక చివర్లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ సునామీనే సృష్టించాడు. భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఏకంగా 40 బంతుల్లోనే మ్యాక్సీ శతకానికి చేరుకున్నాడు. వన్డే ప్రపంచకప్ టోర్నీలో అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డును కైవసం చేసుకున్నాడు. మ్యాక్స్‌వెల్ దూకుడుతో ఆసీస్ ఏకంగా 399 పరుగులు చేసింది.