తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Aus Vs Afg: హ్యాట్సాఫ్ మ్యాక్స్‌వెల్.. గాయమైనా వీరోచిత డబుల్ సెంచరీ.. ఆస్ట్రేలియాను గెలిపించిన స్టార్.. సెమీస్‍కు ఆసీస్

AUS vs AFG: హ్యాట్సాఫ్ మ్యాక్స్‌వెల్.. గాయమైనా వీరోచిత డబుల్ సెంచరీ.. ఆస్ట్రేలియాను గెలిపించిన స్టార్.. సెమీస్‍కు ఆసీస్

07 November 2023, 23:58 IST

google News
    • AUS vs AFG - Cricket World Cup 2023: మ్యాక్స్‌వెల్ అద్భుత డబుల్ సెంచరీ చేయటంతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. గాయమైనా వీరోచిత పోరాటంతో మ్యాక్సీ అదరగొట్టటంతో అఫ్గానిస్థాన్‍పై ఆసీస్ గెలిచింది.
AUS vs AFG: హాట్సాఫ్ మ్యాక్స్‌వెల్..
AUS vs AFG: హాట్సాఫ్ మ్యాక్స్‌వెల్.. (REUTERS)

AUS vs AFG: హాట్సాఫ్ మ్యాక్స్‌వెల్..

AUS vs AFG - Cricket World Cup 2023: ఆస్ట్రేలియా స్టార్ ఆల్‍రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ అద్భుతం చేశాడు. క్రికెట్ చరిత్రలోనే ఒకానొక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కాలికి గాయమైనా డబుల్ సెంచరీతో కదం తొక్కాడు. అఫ్గానిస్థాన్ చేతిలో ఓటమి పాలవుతుందనుకున్న ఆస్ట్రేలియాను గట్టెక్కించి.. గెలిపించాడు. అనన్య సామాన్యమైన పోరాటంతో క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. 128 బంతుల్లో 10 సిక్సర్లు, 21 ఫోర్లతో 201 పరుగులు చేశాడు మ్యాక్స్‌వెల్. తన కెరీర్లో తొలి వన్డే డబుల్ సెంచరీ చేశాడు. అద్భుత అజేయ ద్విశతకంతో సత్తాచాటాడు. మ్యాక్స్‌వెల్ వీరోచిత పోరాటంతో వన్డే ప్రపంచకప్‍‍లో భాగంగా ముంబై వాంఖడే స్టేడియంలో నేడు (నవంబర్ 7) జరిగిన మ్యాచ్‍లో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో అఫ్గానిస్థాన్‍పై విజయం సాధించింది. ప్రపంచకప్ సెమీ ఫైనల్‍కు ఆస్ట్రేలియా అర్హత సాధించింది.

ఓ దశలో 91 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా.. ఓటమి తప్పదనే స్థితికి చేరుకుంది. అప్పుడే గ్లెన్ మ్యాక్స్‌వెల్ అద్భుత పోరాటం చేశాడు. యోధుడిలా నిలిచాడు. కాలికి గాయమై నడవలేకపోయినా.. నిలబడే హిట్టింగ్‍తో విధ్వంసం సృష్టించాడు. సిక్సర్లు, బౌండరీల వర్షం కురిపించాడు. అతడికి ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (68 బంతుల్లో 12 పరుగులు; నాటౌట్) చివరి తోడుగా నిలిచాడు. 46.5 ఓవర్లలో 7 వికెట్లకు 293 పరుగులు చేసిన ఆసీస్ విజయం సాధించింది. మ్యాక్స్‌వెల్, కమిన్స్ ఎనిమిదో వికెట్‍కు 202 పరుగుల అజేయ భాగస్వామ్యం జోడించారు. ఇందులో 179 పరుగులు మ్యాక్స్‌వెల్ చేశాడు. అఫ్గానిస్థాన్ బౌలర్లలో నవీనుల్ హక్, అజ్మతుల్లా ఒమర్ జాయ్, రషీద్ ఖాన్ చెరో రెండు వికెట్లు తీశారు. 

అంతకు ముందు తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ 50 ఓవర్లలో 5 వికెట్లకు 291 రన్స్ చేసింది. ఇబ్రహీం జర్దాన్ (129 పరుగులు నాటౌట్) అజేయ శకతంతో రాణించాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో హేజిల్‍వుడ్ రెండు, స్టార్క్, మ్యాక్స్‌వెల్, జంపా చెరో వికెట్ తీసుకున్నారు.

ట్రావిస్ హెడ్ (0), డేవిడ్ వార్నర్ (18), మిచెల్ మార్ష్ (24) మార్నస్ లబుషేన్ (14), జోస్ ఇంగ్లిస్ (0), మార్కస్ స్టొయినిస్ (6), మిచెల్ స్టార్క్ (3) త్వరగా ఔటవటంతో ఓ దశలో ఆస్ట్రేలియా 91 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. దీంతో అఫ్గానిస్థాన్ తప్పక గెలిచేలా కనిపించింది. ఆ సమయంలోనే మ్యాక్స్‌వెల్ విధ్వంసం సృష్టించాడు. 33 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మ్యాక్స్‌వెల్ క్యాచ్‍ను అఫ్గాన్ ఫీల్డర్ ముజీబ్ వదిలేశాడు. ఆ తర్వాత మ్యాక్సీ వెనుతిరిగి చూసుకోలేదు. అసాధ్యమనుకున్న దాన్ని సుసాధ్యం చేశాడు. కాలి గాయం ఇబ్బంది పెడుతున్నా.. నడవలేని స్థితి ఉన్నా.. బాధనంతా భరిస్తూ అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును మ్యాడ్ మ్యాక్స్ గట్టెక్కించాడు. తన మార్క్ భీకర హిట్టింగ్‍తో ఆస్ట్రేలియాను ఒంటి చేత్తో.. గెలిపించాడు.  

సెమీస్‍కు ఆసీస్

ఆ గెలుపుతో ప్రపంచకప్ సెమీ ఫైనల్‍కు అర్హత సాధించింది ఆస్ట్రేలియా. టోర్నీలో వరుసగా ఆరో విజయాన్ని నమోదు చేసుకుంది. 8 మ్యాచ్‍ల్లో ఆరు గెలిచి 12 పాయింట్లతో పట్టికలో మూడో స్థానాన్ని పదిలం చేసుకుంది. గ్రూప్ దశలో ఇంకో మ్యాచ్ ఉండగానే.. సెమీస్ బెర్తును ఆస్ట్రేలియా ఖరారు చేసుకుంది. అఫ్గానిస్థాన్‍ 8 మ్యాచ్‍ల్లో నాలుగు గెలిచి 8 పాయింట్లతో ప్రస్తుతం ఆరో స్థానంలో ఉంది. ఈ ఓటమితో ఆ జట్టు సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి.

తదుపరి వ్యాసం