Australia vs New Zealand: న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా క్లీన్ స్వీప్.. డబ్ల్యూటీసీ పాయింట్ల టేబుల్లో టాప్ 2 టీమ్స్ ఇవే
11 March 2024, 10:25 IST
- Australia vs New Zealand: న్యూజిలాండ్ పై రెండు టెస్టుల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది ఆస్ట్రేలియా. సోమవారం (మార్చి 11) రెండో టెస్టులోనూ 3 వికెట్లతో ఆ టీమ్ విజయం సాధించింది.
న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా క్లీన్ స్వీప్.. డబ్ల్యూటీసీ పాయింట్ల టేబుల్లో టాప్ 2 టీమ్స్ ఇవే
Australia vs New Zealand: న్యూజిలాండ్ పై రెండో టెస్టులోనూ మూడు వికెట్లతో గెలిచింది ఆస్ట్రేలియా. వికెట్ కీపర్ అలెక్స్ కేరీ 98 పరుగులతో అజేయంగా నిలవడంతో 281 పరుగుల లక్ష్యాన్ని ఆ టీమ్ 7 వికెట్లు కోల్పోయి చేజ్ చేసింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇది 14వ అత్యధిక చేజింగ్ కావడం గమనార్హం. ఆస్ట్రేలియా విజయం తర్వాత డబ్ల్యూటీసీ పాయింట్ల టేబుల్లోనూ మార్పులు చోటు చేసుకున్నాయి.
ఆస్ట్రేలియా క్లీన్‌స్వీప్
న్యూజిలాండ్ ను తొలి టెస్టులో చిత్తు చేసిన ఆస్ట్రేలియా రెండో టెస్టులోనూ విజయం సాధించింది. అయితే రెండో టెస్టులో 281 పరుగుల చేజింగ్ ఆసీస్ కు అంత సులువుగా జరగలేదు. నాలుగో రోజు బౌలింగ్ కు అనుకూలిస్తున్న పిచ్ పై న్యూజిలాండ్ బౌలర్లు కూడా ఆస్ట్రేలియా బ్యాటర్లకు చుక్కలు చూపించారు. దీంతో ఒక దశలో ఆ టీమ్ 80 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది.
స్టీవ్ స్మిత్ (9), ఖవాజా (11), లబుషేన్ (6), గ్రీన్ (5), ట్రావిస్ హెడ్ (18) దారుణంగా విఫలమయ్యారు. ఈ దశలో అలెక్స్ కేరీ, మిచెల్ మార్ష్ ఆస్ట్రేలియాను ఆదుకున్నారు. ఆరో వికెట్ కు ఏకంగా 140 పరుగులు జోడించడంతో ఆసీస్ కు విజయంపై ఆశలు రేగాయి. ఈ క్రమంలో 80 పరుగులు చేసిన మార్ష్ ఔటయ్యాడు. అప్పటికి ఆస్ట్రేలియా విజయానికి మరో మరో 61 పరుగులు అవసరమయ్యాయి.
ఆ వెంటేనే మిచెల్ స్టార్క్ కూడా అదే స్కోరు దగ్గర డకౌటయ్యాడు. దీంతో మ్యాచ్ మరోసారి మలుపు తిరిగినట్లు అనిపించింది. అయితే అప్పటికే క్రీజులో నిలదొక్కుకున్న అలెక్స్ కేరీ.. కెప్టెన్ కమిన్స్ తో కలిసి మరో వికెట్ పడకుండానే మ్యాచ్ గెలిపించాడు. చివరికి అతడు 98 పరుగులతో అజేయంగా నిలిచాడు. కమిన్స్ 32 పరుగులు చేశాడు.
ఈ మ్యాచ్ లో విన్నింగ్ రన్స్ ను కమిన్సే చేశాడు. అయితే కేరీ 98 పరుగుల దగ్గర ఉన్న విషయం తెలియక తాను ఇలా చేసినట్లు మ్యాచ్ తర్వాత కమిన్స్ చెప్పడం విశేషం. ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్ ను ఆస్ట్రేలియా 2-0తో క్లీన్ స్వీప్ చేసింది.
డబ్ల్యూటీసీ పాయింట్ల టేబుల్
ఈ విజయంతో డబ్ల్యూటీసీ పాయింట్ల టేబుల్లో ఆస్ట్రేలియా తన రెండో స్థానాన్ని మరింత మెరుగుపరచుకుంది. తొలి స్థానంలో ఉన్న టీమిండియాకు మరింత చేరువైంది. ఆస్ట్రేలియా ఈ డబ్ల్యూటీసీ సైకిల్లో 12 మ్యాచ్ లలో 8 విజయాలు, 3 ఓటములతో 90 పాయింట్లు సాధించింది. వాళ్ల విజయాల పాయింట్ల పర్సెంటేజ్ 62.50గా ఉంది.
మరోవైపు టీమిండియా ఈ సైకిల్లో 9 టెస్టుల్లో 6 విజయాలు, 2 ఓటములు, ఒక డ్రాతో టాప్ లో కొనసాగుతోంది. ప్రస్తుతం టీమిండియా ఖాతాలో 74 పాయింట్లు, 68.51 పాయింట్ల పర్సెంటేజ్ ఉన్నాయి. న్యూజిలాండ్ 6 మ్యాచ్ లలో 3 విజయాలు, 3 ఓటములతో మూడో స్థానానికి పడిపోయింది. 4, 5 స్థానాల్లో బంగ్లాదేశ్, పాకిస్థాన్ కొనసాగుతున్నాయి.