India vs Pakistan: బాబర్ ఆజమ్‍ను ఆ టీమిండియా బౌలర్ తిప్పలు పెడతాడు: బుమ్రా కాకుండా వేరే పేరు చెప్పిన మాజీ స్టార్
31 August 2023, 16:06 IST
- India vs Pakistan: ఆసియాకప్‍లో టీమిండియా, పాకిస్థాన్ మధ్య మ్యాచ్‍పై చాలా మంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్‍ను అడ్డుకునేందుకు భారత్ వ్యూహాలు ఎలా ఉంటాయన్న దానిపై కొందరు మాట్లాడుతున్నారు.
టీమిండియా
India vs Pakistan: ఆసియాకప్ 2023 టోర్నీలో చిరకాల ప్రత్యర్థులు ఇండియా, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 2న పాక్‍తో టీమిండియా మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‍తోనే ఆసియాకప్ పోరును మొదలుపెట్టనుంది రోహిత్ సేన. శ్రీలంకలోని పల్లెకెలె వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఆసియాకప్ టోర్నీ బుధవారం (ఆగస్టు 30) మొదలుకాగా.. తొలి మ్యాచ్‍లో నేపాల్‍పై పాకిస్థాన్ భారీ విజయం సాధించింది. పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ (151 పరుగులు) సెంచరీతో అదరగొట్టాడు. ఇండియాతో మ్యాచ్‍కు ముందు అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. పాకిస్థాన్‍పై భారత్ ఆధిపత్యం చెలాయించాలంటే ఆజమ్‍ను అడ్డుకోవాల్సిందే. అయితే, బాబర్ ఆజమ్ ఏ టీమిండియా బౌలర్ బంతులకు ఇబ్బందులు పడతాడో భారత మాజీ స్టార్ ప్లేయర్ మహమ్మద్ కైఫ్ చెప్పారు.
బాబర్ ఆజమ్‍ను భారత స్టార్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా అడ్డుకుంటాడని కొందరు అభిప్రాయపడుతున్నారు. భారత స్పిన్నర్ కుల్‍దీప్ యాదవ్ బౌలింగ్‍లోనూ బాబర్ ఇబ్బందులు పడతాడని మరికొందరు అంచనా వేస్తున్నారు. అయితే, మహమ్మద్ కైఫ్ మాత్రం ఆ ఇద్దరూ కాకుండా మరో పేసర్ పేరు చెప్పారు. భారత పేసర్ మహమ్మద్ షమీ బౌలింగ్‍లో బాబర్ ఆజమ్ ఇబ్బందులను ఎదుర్కొంటాడని కైఫ్ అన్నారు. స్టార్ స్పోర్ట్స్ కార్యక్రమంలో ఈ విషయాన్ని చెప్పారు.
“మహమ్మద్ షమీ అద్భుతమైన బౌలర్. అతడు మంచి ఫామ్‍లో కూడా ఉన్నాడు. బుమ్రా లేని సమయంలోనూ అతడు చాలా బాగా బౌలింగ్ చేశాడు. ఐపీఎల్‍లోనూ అద్భుతంగా రాణించాడు. అతడికి చాలా టాలెంట్ ఉంది. నా అభిప్రాయం ప్రకారం.. అతడి బౌలింగ్‍లో బాబర్ ఆజమ్ చాలా ఇబ్బందులను ఎదుర్కొంటాడు” అని కైఫ్ చెప్పారు.
గాయం, సర్జరీ వల్ల సుమారు 11 నెలల పాటు భారత జట్టుకు దూరమైన జస్‍ప్రీత్ బుమ్రా.. ఐర్లాండ్‍తో సిరీస్‍లో రీ-ఎంట్రీ ఇచ్చాడు. ఆసియాకప్‍లో టీమిండియా పేస్ దళాన్ని బుమ్రా నడిపించనున్నాడు. సీనియర్ పేసర్ షమీ కూడా కీలకంగా ఉన్నాడు.
మరోవైపు, ఆసియాకప్‍లో సెప్టెంబర్ 2న ఇండియా, పాకిస్థాన్ తలపడనుండగా.. ఈ మ్యాచ్‍కు వర్షం ఆకంటం కలిగించే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాది ఆసియకప్ టోర్నీకి పాకిస్థాన్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. టీమిండియా తన అన్ని మ్యాచ్‍లు శ్రీలంకలోనే ఆడనుంది.