World Cup Warm-up Matches: పాకిస్థాన్‍పై భారీ టార్గెట్ ఛేదించిన న్యూజిలాండ్.. లంకకు షాకిచ్చిన బంగ్లా
29 September 2023, 23:01 IST
- World Cup Warm-up Matches: వన్డే ప్రపంచకప్ వామప్ మ్యాచ్‍లు తొలి రోజు రసవత్తరంగా జరిగాయి. పాకిస్థాన్‍పై భారీ లక్ష్యాన్ని ఛేదించి గెలిచింది న్యూజిలాండ్. శ్రీలంకకు బంగ్లాదేశ్ షాకిచ్చింది.
World Cup Warm-up Matches: పాకిస్థాన్‍పై భారీ టార్గెట్ ఛేదించిన న్యూజిలాండ్.. లంకకు షాకిచ్చిన బంగ్లా
World Cup Warm-up Matches: భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ అక్టోబర్ 5న మొదలుకానుండగా.. టోర్నీ ముందు వామప్ మ్యాచ్‍లు నేడు (సెప్టెంబర్ 29) షురూ అయ్యాయి. నేటి వామప్ మ్యాచ్‍ల్లో పాకిస్థాన్‍పై న్యూజిలాండ్, శ్రీలంకపై బంగ్లాదేశ్ విజయం సాధించాయి. అఫ్గానిస్థాన్, దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ వాన కారణంగా రద్దయింది. హైదరాబాద్ వేదికగా జరిగిన వామప్ మ్యాచ్‍లో పాకిస్థాన్‍పై న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గవహటిలో జరిగిన వామప్ పోరులో శ్రీలంకపై 7 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ గెలిచింది. వివరాలివే..
భారీ లక్ష్యాన్ని ఊదేసిన న్యూజిలాండ్
హైదరాబాద్‍లో జరిగిన తొలి వామప్ మ్యాచ్‍లో పాకిస్థాన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. మహమ్మద్ రిజ్వాన్ (103 పరుగులు) శతకంతో సత్తాచాటగా.. బాబర్ ఆజమ్ (80), సౌద్ షకీల్ (75) రాణించటంతో పాకిస్థాన్ 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 345 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బౌలర్లలో మిచెల్ శాంట్నర్ రెండు, హెన్రీ, నీషమ్, ఫెర్గ్యూసన్ చెరో వికెట్ తీశారు.
భారీ లక్ష్యఛేదనలో న్యూజిలాండ్ అదరగొట్టింది. భారత సంతతి ఆటగాడు, కివీస్ ఓపెనర్ రచిన్ రవీంద్ర (97 పరుగులు) అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. సెంచరీకి 3 పరుగుల దూరంలో ఔటయ్యాడు. కేన్ విలియమ్సన్ (54), డారిల్ మిచెల్ (59) అర్ధ శతకాలతో రాణించగా.. చివర్లో మార్క్ చాంప్‍మన్ (65 నాటౌట్) మెరుపు హాఫ్ సెంచరీ చేశాడు. దీంతో 43.4 ఓవర్లలో 5 వికెట్లకు 346 రన్స్ చేసి గెలిచింది న్యూజిలాండ్. భారీ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. పాకిస్థాన్ బౌలర్లలో ఉసామా మిర్, హసన్ అలీ, అఘ సల్మాన్, మహమ్మద్ వాసిమ్ చెరో వికెట్ తీశారు.
లంకపై బంగ్లా భారీ గెలుపు
గవహటి వేదికగా జరిగిన ప్రపంచకప్ వామప్ మ్యాచ్‍లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49.1 ఓవర్లలో 263 పరుగులు చేసింది. పాతుమ్ నిస్సంక (68), ధనుంజయ డిసిల్వ (55) రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో మెహదీ హసన్ మూడు వికెట్లతో సత్తాచాటగా.. తన్‍జీమ్ హసన్, షఫియుల్ ఇస్లాం, నసుమ్ అహ్మద్, హసన్ మిరాజ్ చెరో వికెట్ తీశారు.
బంగ్లాదేశ్ టాపార్డర్ బ్యాటర్లు తన్‍జిద్ హసన్ (84), లిటన్ దాస్ (61), మెహదీ హసన్ మిరాజ్ (67) అర్ధ శతకాలతో సత్తాచాటారు. దీంతో 42 ఓవర్లలోనే కేవలం 3 వికెట్లు కోల్పోయి 264 పరుగులు చేసి గెలిచింది బంగ్లాదేశ్. లంక బౌలర్లలో లహిరు కుమార, దునిత్ వెల్లలాగే, దసున్ హేమంత చెరో వికెట్ తీశారు.
భారత్, ఇంగ్లండ్ మధ్య రేపు (సెప్టెంబర్ 30) గువహటిలో వామప్ మ్యాచ్ జరగనుంది.