ఐఐఎం అహ్మదాబాద్‌లో ఎంబీఏ అడ్మిషన్.. ఎలా ప్రవేశం పొందాలి? అర్హతలేంటో ఇక్కడ తెలుసుకోండి
22 December 2024, 16:57 IST
- IIM Ahmedabad MBA : అహ్మదాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం) ఫుల్ టైమ్ ఎంబీఏ కోర్సులో ప్రవేశాల ప్రక్రియను విడుదల చేసింది. ఇక్కడ ప్రవేశం పొందాలంటే ఉండాల్సిన అర్హతలు ఏంటో తెలుసుకోండి..
ఐఐఎం అహ్మదాబాద్ ఎంబీఏ అడ్మిషన్
అహ్మదాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం) ఫుల్‌టైమ్ ఎంబీఏ ప్రోగ్రామ్ అడ్మిషన్ ప్రక్రియ సమాచారాన్ని విడుదల చేసింది. ప్రవేశ ప్రక్రియలో భారతీయ అభ్యర్థులకు కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్), ప్రవాస భారతీయ దరఖాస్తుదారులు, విదేశీ పౌరుల కోసం గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్ (జిమ్యాట్), తరువాత విశ్లేషణాత్మక రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఉంటాయి.
ఐఐఎం అహ్మదాబాద్ ఎంబీఏకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు కనీసం క్యాట్ స్కోరుతోపాటుగా 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ డిగ్రీ, 45 శాతం మార్కులతో ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు తత్సమాన గ్రేడ్ కలిగి ఉండాలి. హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ పూర్తయిన తర్వాత గ్రాడ్యుయేషన్ డిగ్రీ కోర్సు వ్యవధి మూడేళ్లు ఉండాలి. గ్రాడ్యుయేషన్ చివరి సంవత్సరం పరీక్షలకు హాజరై ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు కూడా ఎంబీఏకు దరఖాస్తు చేసుకోవచ్చు.
గ్రాడ్యుయేషన్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు ఐఐఎం అహ్మదాబాద్‌లో ఎంబీఏ కోర్సుకు దరఖాస్తు చేయడానికి వారి ప్రస్తుత సంస్థ లేదా కళాశాల జారీ చేసిన సర్టిఫికేట్‌ను సమర్పించాలి. దీనిలో అభ్యర్థి అందుబాటులో ఉన్న గ్రేడ్లు / మార్కుల ఆధారంగా 50 శాతం మార్కులు (రిజర్వ్డ్ కేటగిరీకి 45 శాతం) సాధించాడని లేదా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నాడని సంస్థ తెలియజేస్తుంది.
గ్రాడ్యుయేషన్ చివరి సంవత్సరం ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు ఎంపికైతే వారిని తాత్కాలికంగా చేరడానికి అనుమతిస్తారు. డిగ్రీ సర్టిఫికేట్, మార్క్ షీట్ సమర్పించిన తరువాత ప్రవేశం ధృవీకరిస్తారు. ఐఐఎం అహ్మదాబాద్ ఎంబీఏ అడ్మిషన్ కోసం భారతీయ అభ్యర్థులకు మొదటి దశ స్క్రీనింగ్ క్యాట్ 2024 స్కోరును ఉపయోగిస్తారు.
CAT 2024 పరీక్షను ఐఐఎం కోల్‌కతా 24 నవంబర్ 2024న దేశవ్యాప్తంగా వివిధ కేంద్రాలలో నిర్వహించింది. ఈసారి క్యాట్ పరీక్షలో 14 మంది అభ్యర్థులు 100 పర్సంటైల్ స్కోర్ సాధించారు. పరీక్షలో విజయం సాధించిన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న ఐఐఎంల రెగ్యులర్ ఎంబీఏ ప్రోగ్రామ్‌లలో ప్రవేశం పొందవచ్చు.
ఐఐఎం అహ్మదాబాద్‌లో ఎంబీఏలో ప్రవేశం కోసం ఇంటర్వ్యూలు, గ్రూప్ డిస్కషన్లు నిర్వహిస్తుంది. ఇందులో విజయం సాధించిన అభ్యర్థులకు వారి క్యాట్ స్కోర్ ఆధారంగా ప్రవేశం ఉంటుంది. NIRF 2024 ర్యాంకింగ్‌లో దేశవ్యాప్తంగా ఉన్న మేనేజ్‌మెంట్ కాలేజీల జాబితాలో ఈ సంస్థ మొదటి స్థానంలో ఉంది.
అభ్యర్థులు ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ అహ్మదాబాద్ (ఐఐఎం-ఏ) మెయిన్ క్యాంపస్, వస్త్రాపూర్, అహ్మదాబాద్, గుజరాత్ 380 015 797152 4630/4631/4633/4634లో సంప్రదించవచ్చు లేదా admission@iima.ac.in మెయిల్ చేయవచ్చు. అభ్యర్థులు మరింత సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌లో చూడటం మంచిది.