Zelio Ebikes: రూ.64,543 ధరతో జెలియో ఎక్స్ మెన్ ‘లో-స్పీడ్’ ఎలక్ట్రిక్ స్కూటర్ల లాంచ్; లైసెన్స్ అవసరం లేదు
13 June 2024, 17:02 IST
- Zelio Ebikes: ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ జెలియో కొత్తగా ఎక్స్ మెన్ సిరీస్ లో పలు ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లో లాంచ్ చేసింది. ఇవి తక్కువ వేగంతో ప్రయాణించే ఈ - స్కూటర్లు. వీటి ధర కూడా రూ. 64,543 నుంచి ప్రారంభమవుతుంది. అయితే, వీటికి ఎక్స్ మెన్ కామిక్ బుక్ సిరీస్ కు ఎలాంటి సంబంధం లేదు.
జెలియో ఎక్స్ మెన్ ‘లో-స్పీడ్’ ఎలక్ట్రిక్ స్కూటర్ల లాంచ్
Zelio new X Men Ebikes: దేశీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన స్టార్టప్ జెలియో ఈ బైక్స్ సంస్థ కొత్తగా ఎక్స్ మెన్ సిరీస్ లో తక్కువ వేగంతో ప్రయాణించగల ఎలక్ట్రిక్ స్కూటర్స్ దేశంలో విడుదల చేసింది. కొత్త జెలియో ఎక్స్ మెన్ ఇ-స్కూటర్లు (electric scooter) ప్రసిద్ధ కామిక్ బుక్ సిరీస్ తో ఎలాంటి సంబంధం కలిగి ఉండవు. వీటి ధర రూ .64,543 నుండి రూ. 87,573 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది.
లైసెన్స్ అవసరం లేదు
తక్కువ వేగంతో నడిచే ఈ-స్కూటర్లు కావడంతో వాటిని పబ్లిక్ రోడ్లపై నడపడానికి యజమానులకు డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. ఎంట్రీ లెవల్ ఎక్స్ మెన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ .64,543 గా నిర్ణయించారు. ఇది సింగిల్ చార్జింగ్ తో 55-60 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఇది ఫుల్ గా చార్జ్ కావడానికి 7-8 గంటల సమయం పడుతుంది. ఇందులో 60 వి / 32 ఎహెచ్ లెడ్-యాసిడ్ బ్యాటరీని ఉపయోగిస్తుంది.
హై ఎండ్ వేరియంట్ రేంజ్80 కిమీలు..
(Zelio new X Men Ebikes) ఎక్స్ మెన్ మిడ్ వేరియంట్ ధర రూ .67,073 గా నిర్ణయించారు. ఇందులో 72 వి / 32 ఎహెచ్ లెడ్-యాసిడ్ బ్యాటరీని ఉపయోగించారు. సింగిల్ చార్జింగ్ తో ఇది 70 కిమీలు ప్రయాణిస్తుంది. ఫుల్ గా చార్జ్ చేయడానికి ఈ బైక్ కు 7-9 గంటల సమయం పడుతుంది. ఎక్స్ మెన్ సిరీస్ టాప్ వేరియంట్ ధర రూ .87,673 గా నిర్ణయించారు. ఇందులో 60 వి / 32 ఎహెచ్ లిథియం-అయాన్ బ్యాటరీని వాడారు. సింగిల్ చార్జింగ్ తో ఇది 80 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఇది ఫుల్ గా చార్జ్ కావడానికి నాలుగు గంటల సమయం పడుతుంది.
గంటకు 25 కిమీలు మాత్రమే
ఈ-స్కూటర్లలో శక్తివంతమైన 60/72 వి బీఎల్డీసీ మోటర్ ను ఉపయోగించారు. స్లో-స్పీడ్ ఇ-స్కూటర్ కావడంతో, వీటి గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్లకు పరిమితం చేయబడింది. మోడళ్ల స్థూల బరువు 80 కిలోలు కాగా, పేలోడ్ సామర్థ్యం 180 కిలోలు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను హర్యానాలోని హిసార్ లో ఉన్న కంపెనీ ప్లాంట్లో తయారు చేస్తున్నారు. ఈ ప్లాంట్ లో ప్రతి షిఫ్ట్ కు 1.5 లక్షల వాహనాల ఉత్పత్తి సామర్థ్యం ఉంది.
ఎక్స్ మెన్ ఈ స్కూటర్స్ ఫీచర్స్
ఎక్స్ మెన్ ఈ స్కూటర్స్ ఫీచర్స్ విషయానికి వస్తే, జెలియో ఎక్స్ మెన్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో యాంటీ-థెఫ్ట్ అలారం, ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్, రియర్ డ్రమ్ బ్రేక్స్, ముందు భాగంలో అల్లాయ్ వీల్ ఉన్నాయి. ఈ మోడళ్లలో రివర్స్ గేర్, పార్కింగ్ స్విచ్, ఆటో రిపేర్ స్విచ్, యుఎస్బీ ఛార్జింగ్, హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్లు ఉన్నాయి. స్కూటర్లలో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, సెంట్రల్ లాకింగ్ కూడా ఉన్నాయి. బ్లాక్, వైట్, సీ గ్రీన్, రెడ్ అనే నాలుగు కలర్ ఆప్షన్లలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి.