Success Story : వాషింగ్ పౌడర్ నిర్మా సక్సెస్ స్టోరీ.. కేవలం రూ.15 వేల పెట్టుబడితో మెుదలై వేల కోట్లు
16 October 2024, 11:00 IST
- Washing Powder Nirma : వాషింగ్ పౌడర్ నిర్మా గురించి భారతీయులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నిర్మా వాషింగ్ పౌడర్ గురించి వచ్చిన యాడ్ ఇప్పటికీ ఎవరూ మరిచిపోలేరు. ప్రజల్లోకి అంతలా వెళ్లింది ఆ ప్రకటన. అయితే ఈ కంపెనీ కేవలం రూ.15వేలతో మెుదలైంది.
నిర్మా వాషింగ్ పౌడర్
వాషింగ్ పౌడర్ నిర్మా.. వాషింగ్ పౌడర్ నిర్మా.. అంటూ ఒకప్పుడు యాడ్ వచ్చేది. 90ల వారికి ఈ యాడ్ గురించి చాలా బాగా తెలుసు. తెల్లగౌను వేసుకున్న పాపతో యాడ్ ఉండేది. ఈ నిర్మా వాషింగ్ పౌడర్ సంస్థ యజమాని జీవితంలో వెనక ఓ విషాదం కూడా ఉంది. నిర్మా అనే పేరుకు ఓ కథ ఉంది. అంతేకాదు కేవలం రూ.15వేలతో మెుదలుపెట్టి వేల కోట్ల సంస్థగా మారింది. దీని స్థాపకుడు కర్సన్‌భాయ్ పటేల్.
తక్కువ ధరకు వాషింగ్ పౌడర్లను తయారు చేసి ప్రజలకు విక్రయించాలనే లక్ష్యంతో కర్సన్‌భాయ్ పటేల్ రూపొందించిన సంస్థ నిర్మా. కర్సన్‌భాయ్ పటేల్ 1945లో గుజరాత్‌లో జన్మించారు. ఆయన వ్యవసాయ కుటుంబానికి చెందినవారు. కెమిస్ట్రీలో గ్రాడ్యుయేట్ అయిన కర్సన్‌భాయ్ పటేల్ ఒక లేబొరేటరీలో టెక్నీషియన్‌గా పనిచేసేవారు. 1969లో అతనికి ఒక ఆలోచన వచ్చింది.
అదే నాణ్యమైన వాషింగ్ పౌడర్ ను తక్కువ ధరకు ప్రజలకు విక్రయించాలని ఆలోచన. అయితే దానికంటే ముందుగా ఆయన జీవితంలో ఓ విషాదగాథ ఉంది. కర్సన్‌భాయ్ పటేల్‌కు ఓ కూతురు ఉండేది. ఆమె పేరు నిరుపమ. ముద్దుగా నిర్మా అని పిలుచుకునేవారు. ఆమె ఓ ప్రమాదంలో మరణించింది. ఎంతో ఇష్టంగా చూసుకునే కుమార్తె చనిపోవడంతో కుంగిపోయారు. తర్వాత ఆమె పేరు మీద నిర్మా వాషింగ్ పౌడర్ మెదలుపెట్టారు.
అలా రూ.15వేల పెట్టుబడి పెట్టి సొంతంగా డిటర్జెంట్ పౌడర్ తయారు చేయడం మెుదలైంది. అప్పట్లో సర్ఫ్ సహా బట్టలు ఉతకడానికి ఉపయోగించే పౌడర్ల ధర ఎక్కువగా ఉండడంతో కిలో నిర్మాను కేవలం 13 రూపాయలుగా నిర్ణయించారు. దీని తర్వాత సైకిల్‌పై నిర్మా పౌడర్‌ను మెుదట్లో అమ్మేవారు. తర్వాత కొనుగోలు చేసి వాడే వారు ఇతరులకు చెప్పడంతో ఇక మార్కెట్‌లో నిర్మా వాషింగ్ పౌడర్‌కు తిరుగులేకుండా పోయింది.
దీని తర్వాత నిర్మా కంపెనీ వాషింగ్ పౌడర్ నిర్మా అనే ప్రకటనను రూపొందించి. ఇది దేశవ్యాప్తంగా ఫేమస్ అయింది. ఇప్పటికీ ఆ యాడ్‌లో వచ్చే లిరిక్స్ పాడుకుంటారు చాలా మంది. అందులో కనిపించే తెల్ల గౌను పాప నిరుపమనే.. అదే నిర్మా. తర్వాత నిర్మా అనే బ్రాండ్ ప్రజల మనసుల్లో స్థిరపడింది.
పెరిగిన డిమాండ్‌ను ఆధారంగా కర్సన్‌భాయ్ సబ్బు, ఇతర ఉత్పత్తులను తయారు చేయడం, విక్రయించడం ప్రారంభించారు. ప్రస్తుతం నిర్మా లిమిటెడ్ 18 వేల మందికి పైగా ఉద్యోగులను కలిగి ఉంది. ఈ కంపెనీ వార్షిక టర్నోవర్ దాదాపు 23 వేల కోట్ల రూపాయలు వరకు ఉంటుంది. కర్సన్ భాయ్ పటేల్ రూ.34,000 కోట్ల ఆస్తులను కలిగి ఉన్నారు.
భారతదేశంలోని అత్యంత సంపన్నుల జాబితాలో కూడా ఆయనకు చోటు దక్కింది. కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. కర్సన్‌భాయ్ పటేల్ తర్వాత ఆయన కుమారులు రాకేష్ పటేల్, కిరణ్‌భాయ్ పటేల్ ప్రస్తుతం నిర్మా సంస్థను చూసుకుంటున్నారు.
కేవలం రూ.15 వేల పెట్టుబడితో, కూతురి మీద ప్రేమతో మెుదలుపెట్టిన సంస్థ ఇప్పుడు వేల కోట్లకు ఎదిగింది. ఎంతో మందికి అన్నం పెడుతుంది. నిజంగా కర్సన్‌భాయ్ ఎంతో మందికి ఆదర్శం.