Union Budget 2024 : ‘ప్రతి నెల 300 యూనిట్ల విద్యుత్ ఉచితం..’
01 February 2024, 12:33 IST
- Union Budget 2024 : 2024 బడ్జెట్‌ని లోక్‌సభలో ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.
నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం..
Union Budget 2024 in Telugu : కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్.. 2024 బడ్జెట్‌ని గురువారం ఉదయం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్లో భాగంగా కీలక ప్రకటనలు చేశారు. ఇందులో భాగంగా.. 1 కోటి గృహాలకు ప్రతి నెల 300 యూనిట్ల విద్యుత్‌ని ఉచితంగా ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
"రూఫ్ టాప్ సోలరైజేషన్ని వేగంగా అమలు చేయాలని చూస్తున్నాము. ఫలితంగా.. ప్రతి నెల 1 కోటి గృహాలకు నెలకు 300 యూనిట్ల విద్యుత్ సరఫరా ఉచితంగా అందుతుంది. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం అనంతరం మోదీ తీసుకున్న నిర్ణయంలో ఇది ఒ భాగం. ప్రభుత్వ నిర్ణయంతో ప్రజలకు ఏటా రూ. 15వేల నుంచి రూ. 18వల వరకు ఆదా అవుతుంది," అని తన బడ్జెట్ ప్రసంగంలో వివరించారు నిర్మల.
అన్ని వర్గాల అభివద్ధే ధ్యేయంగా..
Nirmala Sitharaman Budget speech : 2014లో ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన సమయంలో.. దేశంలో అనేక సవాళ్లు ఉండేవని నిర్మలా సీతారామన్ అన్నారు. రెండో దఫా గెలిచినప్పుడు.. అభివృద్ధిపై ఫోకస్ చేశామని స్పష్టం చేశారు. కరోనా సంక్షోభం వచ్చినా, దానిని శక్తివంతంగా ఎదుర్కొన్నామని వెల్లడించారు.
"అన్ని వర్గాల అభివృద్ధి కోసం కృషిచేస్తున్నాము. వనరుల పంపిణీలో లోపం లేకుండా చూసుకుంటున్నాము. మేము చేపట్టిన అన్ని పథకాలు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉన్నాయి,” అని నిర్మల అన్నారు.
2047 నాటికి దేశం.. వికసిత్ భారత్‌గా ఆవిర్భవించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు కేంద్ర మంత్రి. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా వికాస్ నినాదంతో ముందుకెళుతున్నామని స్పష్టం చేశారు. పేదలు, రైతులు, మహిళలు, యువతను దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకుంటున్నామన్నారు
అనంతరం.. బీజేపీ పాలనలో సాధించిన ప్రగతి, పురోగతిని వివరించారు ఆర్థిక మంత్రి
బడ్జెట్ 2024 ఇతర ముఖ్యంశాలు..
ఈవీ ఛార్జింగ్:- ఎలక్ట్రిక్ వాహనాల నిర్వహణ, ఇన్స్టాలేషన్, మేన్యుఫ్యాక్చరింగ్ కోసం నైపుణ్యం కలిగిన యువ, వెండర్స్‌కి వ్యవస్థాపకత అవకాశాలను కల్పిస్తామని బడ్జెట్ 2024 నేపథ్యంలో నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.
పంట కోత అనంతర కార్యకలాపాలు:- పోస్ట్ హార్వేస్ట్ కార్యకలాపాల్లో పాల్గొనే విధంగా.. ప్రైవేట్, పబ్లిక్ పెట్టుబడులను ప్రోత్సహించనున్నట్టు.. ఇందులో అగ్రిగేషన్, మాడర్న్ స్టోరేజ్, సప్లై చెయిన్స్, ప్రాసెసింగ్, మార్కెటింగ్, బ్రాండింగ్ వంటివి ఉంటాయని కేంద్ర మంత్రి తెలిపారు.
నానో డీఏపీ అప్లికేషన్ విస్తరణ:- నానో యూరియా విజయవంతమైందన్న నిర్మలా సీతారామన్.. వివిధ పంటలకు కూడా నానో డీఏపీ అప్లికేషన్‌ను విస్తరిస్తున్నట్టు తెలిపారు.
మధ్య తరగతి ప్రజల ఇళ్లు:- రెంటు, స్లమ్‌లో నివాసముంటున్న మధ్య తరగతి ప్రజల కోసం కొత్త పథకాన్ని తీసుకోస్తామని బడ్జెట్ 2024లో భాగంగా వ్యాఖ్యానించారు నిర్మల. పథకం ద్వారా.. ప్రజలు సొంతంగా ఇల్లు కొనుక్కోవచ్చని, లేదా సొంత ఇంటిని నిర్మించుకోవచ్చని స్పష్టం చేశారు.
వైద్య కళాశాలలు:- హాస్పిటల్స్ మౌలిక వసతులను వినియోగించుకుని, దేశవ్యాప్తంగా మరిన్ని వైద్య కళాశాలలను ప్రారంభించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు నిర్మల తెలిపారు. ఇందుకోసం ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.
బాలికలకు టీకాలు:- 9-14ఏళ్ల మధ్యలో ఉన్న బాలికల్లో సెర్వికల్ కేన్సర్‌ని నివారించేందుకు.. వ్యాక్సినేషన్ని ప్రోత్సహించనున్నట్టు తెలిపారు నిర్మల.
సామాజిక మార్పులను ఎదుర్కొనేందుకు:- జనాభా వృద్ధి, భౌగోళిక మార్పులతో వస్తున్న సమస్యలను ఎదుర్కొనేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు, 2024 బడ్జెట్ ప్రసంగంలో భాగంగా నిర్మలా సీతారామన్ చెప్పారు. కమిటీ ద్వారా.. సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
డైరీ ఫార్మింగ్ అభివృద్ధి:- డైరీ రైతులకు సాయం చేసేందుకు, ఉత్పత్తిని పెంచేందుకు, ప్రస్తుతం ఉన్న పథకాల ద్వారా మరింత సమగ్ర, శక్తివంతమైన కార్యక్రమాలను చేపడతామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.