Twitter : “ఫోన్ నంబర్ లేకుండానే మాట్లాడవచ్చు”: ట్విట్టర్‌లో త్వరలో కాలింగ్ ఫీచర్: ప్రకటించిన మస్క్
10 May 2023, 12:31 IST
- Twitter: ట్విట్టర్‌లో త్వరలో వాయిస్, వీడియో చాటింగ్ అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని ఆ సంస్థ సీఈవో ఎలాన్ మస్క్ ప్రకటించారు.
Twitter: “ఫోన్ నంబర్ లేకుండానే మాట్లాడవచ్చు”: ‘ట్విట్టర్‌లో త్వరలో కాలింగ్ ఫీచర్: ప్రకటించిన మస్క్
Twitter: ప్రముఖ సోషల్ మీడియా మైక్రో బ్లాగింగ్ ప్లాట్‍పామ్ ‘ట్విట్టర్’ (Twitter)కు త్వరలో కాల్స్ ఫీచర్ యాడ్ కానుంది. ట్విట్టర్ హ్యాండిల్ ద్వారానే వేరే యూజర్లతో వాయిస్, వీడియో చాటింగ్ చేసే సదుపాయం అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్ (Elon Musk) ప్రకటించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. రేపటి నుంచి ఎన్‍క్రిప్టెడ్ డైరెక్ట్ మెసేజ్ (DMs) ఫీచర్ అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. త్వరలో కాలింగ్ ఫీచర్ వస్తుందని పేర్కొన్నారు. ట్విట్టర్ 2.0 ఎవ్రీథింగ్ యాప్‍ను తీసుకొస్తానని గతేడాది చెప్పిన మస్క్.. ఆ దిశగా ట్విట్టర్‌కు క్రమంగా కొత్తకొత్త ఫీచర్లను తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Twitter - Elon Musk : “త్వరలో ఈ ప్లాట్‍ఫామ్‍లో ఎవరితో అయినా మీ హ్యాండిల్ (ఐడీ) ద్వారానే వాయిస్, వీడియో చాట్స్ (కాల్స్) చేసుకోవచ్చు. అంటే మీరు వాళ్లకి ఫోన్ నంబర్ ఇవ్వకుండానే ప్రపంచంలో ఎక్కడ ఉన్న వారితో అయినా మాట్లాడవచ్చు” అని ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. ఇప్పటికే మెటాకు చెందిన ఫేస్‍బుక్ మెసెంజర్ వాయిస్, వీడియో కాల్స్ సదుపాయం ఉండగా.. ట్విట్టర్‌లోనూ అలాంటి ఫీచర్లే అందుబాటులోకి రానున్నాయి.
Twitter - Elon Musk : కాగా, ఎన్‍క్రిప్టెడ్ డైరెక్ట్ మెసేజ్‍ల సదుపాయం ట్విట్టర్‌లో రేపటి నుంచి అందుబాటులో ఉంటుందని చెప్పిన ఎలాన్ మస్క్.. కాల్స్ ఎన్‍క్రిప్టెడ్‍గా ఉంటాయో లేదో స్పష్టతనివ్వలేదు. “ఎన్‍క్రిప్టెడ్ డైరెక్ట్ మెసేజెస్ (DMs) రిలీజ్ రేపు జరుగుతుంది” అని మస్క్ పేర్కొన్నారు.
Twitter - Elon Musk : కాగా, చాలా కాలం నుంచి వినియోగించకుండా ఉన్న అకౌంట్లను తొలగించనున్నట్టు ట్విట్టర్ గత వారం ప్రకటించింది. దీంతో కొందరి ఫాలోవర్ల సంఖ్యలో తగ్గుదల కనిపించవచ్చని పేర్కొంది. “ఫాలోవర్ల సంఖ్య తక్కువవుతున్నట్టు కనిపించవచ్చు. ఎందుకంటే కొన్ని ఇన్‍యాక్టివ్ అకౌంట్లను తొలగిస్తున్నాం” అని ఎలాన్ మస్క్ తెలిపారు.
Twitter - Elon Musk : గతేడాది అక్టోబర్‌లో ట్విట్టర్‌ను టెస్లా బాస్ ఎలాన్ మస్క్ కైవసం చేసుకున్నారు. అప్పటి నుంచి ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. ట్విట్టర్ బ్లూ సబ్‍స్క్రిప్షన్ తీసుకున్న వారందరికీ బ్లూటిక్‍లు వచ్చేలా చేశారు. చాలా కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టారు. మొత్తంగా ట్విట్టర్‌ను ఎవ్రీథింగ్ యాప్‍గా మార్చాలనేది మస్క్ అభిప్రాయం. ఈ దిశగా ట్విట్టర్‌లో కాలింగ్ ఫీచర్ వస్తుందని ఇప్పుడు వెల్లడించారు. అలాగే పేమెంట్స్ సదుపాయాన్ని కూడా ప్లాట్‍ఫామ్‍లోకి తీసుకురావాలని మస్క్ యోచిస్తున్నారు.