Skoda Kushaq Price Hike: ఈ పాపులర్ కార్ మరింత ప్రియం.. కొత్త ధరలు ఎలా ఉన్నాయంటే!
07 November 2022, 13:06 IST
- Skoda Kushaq Price Hike: స్కోడా కుషాక్ ఎస్‍యూవీ ధర మరోసారి పెరిగింది. దాదాపు అన్ని వేరియంట్ల ధరలు అధికమయ్యాయి.
Skoda Kushaq: కుషాక్‌పై ధర పెంచిన స్కోడా
Skoda Kushaq Price Hike: దేశంలో క్రమంగా చాలా వాహనాల ధరలు పెరుగుతున్నాయి. డిమాండ్ పెరుగుతుండటంతో చాలా కంపెనీలు ఈ బాటలో నడుస్తున్నాయి. తాజాగా స్కోడా కూడా ఈ జాబితాలో చేరింది. స్కోడా కుషాక్ ధర మరోసారి పెరిగింది. ఈ ఏడాదిలోనే మూడోసారి ఈ ఫ్లాగ్‍షిప్ కాంపాక్ట్ ఎస్ఈయూవీ కుషాక్ ధరలను అధికం చేసింది స్కోడా. ఈనెల నుంచే కొత్త ధరలు అమలులోకి వస్తున్నాయి. రూ. 20వేల నుంచి గరిష్టంగా రూ. 60వేల వరకు ఈ పెంపు ఉంది. వివిధ వేరియంట్లపై కొత్త ధరలు ఎలా ఉన్నాయంటే..
పెంపు తర్వాత స్కోడా కుషాక్ ప్రారంభ ధర రూ.11.59లక్షల (ఎక్స్-షోరూం)కు చేరుకుంది. టాప్ ఎండ్ మోంటో కార్లో ఆటోమేటిక్ (Monte Carlo AT) వెర్షన్ ధర రూ.18లక్షలు (ఎక్స్-షోరూం)గా ఉంది. స్కోడా ఇటీవల లాంచ్ చేసిన ఈ ఎస్‍యూవీ యానివర్సరీ ఎడిషన్ (Kushaq Anniversary Edition) ఎక్స్-షోరూం ధరలు రూ.15.59 లక్షల నుంచి రూ. 17.29లక్షల మధ్య ఉంది.
Skoda Kushaq Price Hike: ఈ వేరియంట్‍పై అధికంగా..
కుషాక్ అన్ని వేరియంట్లతో పోలిస్తే ధరల పెంపు ప్రభావం యాంబిషన్ క్లాసిక్ ఏటీ వెర్షన్ (Ambition Classic AT) పై ఎక్కువగా పడింది. రూ.14.09 లక్షల నుంచి దీని ధర రూ.14.69 (ఎక్స్-షోరూం)కు పెరిగింది. మిగతా వాటితో పోలిస్తే యాంబిషన్ మాన్యువల్ వేరియంట్ ధర కాస్త తక్కువగా అధికమైంది. ఈ మోడల్ ధరను స్కోడా రూ.20వేలు పెంచగా.. రూ.13.19లక్షలు (ఎక్స్-షోరూం)గా ఉంది.
కుషాక్ యాక్టివ్ మాన్యువల్ (Active MT), యాంబిషన్ క్లాసిక్ మాన్యువల్ (Ambition Classic MT) పై ధర రూ.30,000 పెరిగింది. 6 ఎయిర్ బ్యాగ్‍లతో కూడిన స్టైల్ ఆటోమేటిక్ (Style AT), మోంట్ కార్లో ఆటోమేటిక్ వేరియంట్లపై ధర కాస్త తక్కువగానే ఎక్కువైంది. ఇతర అన్ని కుషాక్ ఎస్‍యూవీ వేరియంట్లపై చెరో రూ. 40,000 ధర పెరిగింది.
Skoda Kushaq Price Hike: మూడోసారి
కుషాక్ ఎస్‍యూవీ ధరలను ఈ ఏడాది ఇదివరకే రెండుసార్లు పెంచింది స్కోడా. జనవరిలో తొలిసారి, మేలో మరోసారి పెంచింది. ఇది జరిగిన మరో ఐదు నెలల వ్యవధిలోనే మరోసారి ధరలు ప్రియమయ్యాయి. లాంచ్ అయిన సమయంలో కుషాక్ ఎస్‍యూవీ ప్రారంభ ధర రూ.10.49లక్షలు (ఎక్స్-షోరూం)గా ఉండేది. ఏడాదిలో ఆ బేస్ మోడల్ ధరను సుమారు రూ.లక్ష వరకు పెంచింది. మిగిలిన వేరియంట్ల ధరలు కూడా బాగానే అధికమయ్యాయి.