Buying an electric car?: ఎలక్ట్రిక్ కారు కొంటున్నారా? ముందు ఈ ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి..
20 October 2023, 16:49 IST
Buying an electric car?: ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల (electric vehicle EV) కొనుగోలుపై ప్రజల్లో ఆసక్తి పెరిగింది. వివిధ వాహన తయారీ సంస్థలు కూడా ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిపై దృష్టి పెడుతున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ కార్స్ సేల్స్ ఇటీవల బాగా పెరిగాయి.
ప్రతీకాత్మక చిత్రం
Buying an electric car?: వాహన ఉత్పత్తి సంస్థలు ఎలక్ట్రిక్ కార్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ పై ప్రధానంగా దృష్టి పెడుతున్నాయి. బ్యాటరీ పవర్ ను పెంచడం నుంచి వాహనాన్ని తక్కువ బరువుతో ధృఢంగా రూపొందించే వరకు.. వివిధ అంశాలపై దృష్టి పెడుతున్నాయి.
ఈవీ కొనాలా? వద్దా?
ఈ పండుగ సీజన్ లో ఎలక్ట్రిక్ కారు (electric car) కొనాలనే ఆలోచనలో చాలా మంది ఉంటారు. అయితే, ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేసే ముందు ఈ 5 ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకోండి. ముఖ్యంగా ఇండియాలో విద్యుత్ వాహనాల (electric vehicle EV) నిర్వహణపై అవగాహన పెంచుకోండి. వాటిలో ఈ అంశాలు ప్రధానమైనవి..
public charging infrastructure: చార్జింగ్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి?
ఇండియాలో పెట్రోలు బంక్ లు ఎక్కడైనా కనిపిస్తాయి. ఏ మారు మూల ప్రాంతంలోకి వెళ్లినా, పెట్రోలు, లేదా డీజిల్ లభిస్తుంది. దశాబ్దాలుగా రూపొందిన ఇన్ఫ్రా స్ట్రక్చర్ అది. కానీ, ఎలక్ట్రిక్ వాహనాల విషయానికి వస్తే, ఇంకా బహిరంగ చార్జింగ్ స్టేషన్ల సంఖ్య తక్కువగానే ఉంది. ప్రధాన రహదారుల్లో కూడా పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లు అంతంతమాత్రంగానే ఉన్నాయి. సింగిల్ చార్జ్ తో ప్రయాణం చేయగలిగేంత దూరంలో గమ్య స్థానం ఉంటే పర్లేదు కానీ, సుదూర ప్రయాణాల్లో, అదీ రిమోట్ ప్లేసెస్ ల్లో ఎలక్ట్రిక్ వాహనం తీసుకువెళ్లడం ఇబ్బందికరమే. మరోవైపు, ఎలక్ట్రిక్ కార్లు ఫుల్ గా చార్జ్ కావడానికి కొన్ని గంటల సమయం పడుతుంది. పెట్రోలు, డీజిల్ వాహనాల మాదిరిగా బంక్ కు వెళ్లి, క్షణాల్లో ఫ్యుయెల్ ఫిల్ చేసుకుని వెళ్లడం ఎలక్ట్రిక్ వాహనాలతో సాధ్యం కాదు.
cost of acquisition?: ధర ఎక్కువ
డీజిల్, పెట్రోలు వాహనాల కన్నా ఎలక్ట్రిక్ కార్ల (electric car) ధర ఎక్కువగా ఉంది. ప్రభుత్వాలు అనేక ప్రోత్సాహకాలు, రాయితీలను అందిస్తున్నప్పటికీ, వాటి ధర ఎక్కువగానే ఉంటోంది. అదీకాక, కొంత కాలం వినియోగించిన తరువాత బ్యాటరీ ప్యాక్ ను మార్చాల్సి వస్తే, అది మరింత ఖరీదైన వ్యవహారంగా తెలుస్తోంది. ఈవీని కొనుగోలు చేసే ముందు.. రోజువారీగా లేదా వారానికి లేదా నెలవారీ ప్రయాణ దూరాన్ని పరిశీలించి, నిర్వహణ ఖర్చును గణించి, నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.
another car at home: వేరే కారు కూడా ఉందా?
ఇప్పటికే మీ వద్ధ ఒక పెట్రోలు, లేదా డీజిల్ కారు ఉందా? సిటీలో రెగ్యులర్ గా ఆఫీస్ లేదా ఇతర ప్రయాణాల కోసం ఈవీని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అలాంటప్పుడు, మీరు దూర ప్రయాణాలకు మీ వద్ద ఇప్పటికే ఉన్న డీజిల్, లేదా పెట్రోలు వాహనాన్ని ఉపయోగించవచ్చు. సమీప గమ్యస్థానాలకు ఈవీని ఉపయోగించవచ్చు. కానీ, అందుకు మీ బడ్జెట్ సహకరిస్తుందో? లేదో? పరిశీలించండి.
resale value: రీ సేల్ వ్యాల్యూ
ఎలక్ట్రిక్ కార్లు (electric car) ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతున్నాయి. అందువల్ల మీరు తీసుకున్న ఈవీ తిరిగి అమ్మేయాలనుకుంటే ఎంత మొత్తం మీకు రీసేల్ వ్యాల్యూగా లభిస్తుందో అధ్యయనం చేయండి. ప్రి ఓన్డ్ కార్లలో ఈవీల సంఖ్య చాలా తక్కువగా ఉంది. బ్యాటరీ లైఫ్ పై అనుమానాలతో చాలామంది యూజ్డ్ ఈవీలను కొనుగోలు చేయాలనుకోరు. అందువల్ల, రీ సేల్ వ్యాల్యూని కూడా దృష్టిలో పెట్టుకుని ఈవీ కొనుగోలుపై నిర్ణయం తీసుకోండి.