SBI news: ఎస్బీఐ డెబిట్ కార్డుల వార్షిక మెయింటెనెన్స్ ఛార్జీల పెంపు; ఈ కార్డులపై మాత్రమే..
27 March 2024, 15:55 IST
పలు డెబిట్ కార్డుల వార్షిక నిర్వహణ చార్జీలను పెంచుతున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఈ వార్షిక మెయింటెనెన్స్ చార్జీలు పెరుగుతున్న డెబిట్ కార్డుల్లో క్లాసిక్, సిల్వర్, గ్లోబల్, కాంటాక్ట్ లెస్ డెబిట్ కార్డులున్నాయి. ఈ చార్జీల పెంపు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది.
ప్రతీకాత్మక చిత్రం
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కొన్ని డెబిట్ కార్డులకు సంబంధించిన వార్షిక నిర్వహణ ఛార్జీ (annual maintenance charges - AMC) లను సవరించింది. ఈ ఏఎంసీల పెంపు ఎస్బీఐ వెబ్సైట్ ప్రకారం ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వస్తుంది. ఎస్బీఐ వెబ్సైట్లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం క్లాసిక్, సిల్వర్, గ్లోబల్, కాంటాక్ట్ లెస్ డెబిట్ కార్డుల ప్రస్తుత వార్షిక నిర్వహణ ఛార్జీలు ఏప్రిల్ 1 నుండి పెంచుతున్నారు. అలాగే, యువ, గోల్డ్, కాంబో డెబిట్ కార్డుల ఛార్జీలను కూడా పెంచనున్నారు. ఏప్రిల్ 1 నుంచి ప్లాటినం డెబిట్ కార్డు వార్షిక మెయింటెనెన్స్ ఫీజును కూడా పెంచనున్నారు. వార్షిక నిర్వహణ ఛార్జీలతో పాటు, డెబిట్ కార్డుల జారీకి సంబంధించిన ఫీజులను కూడా మారుస్తామని ఎస్బీఐ (State Bank of India) తెలిపింది.
ఈ డెబిట్ కార్డుల చార్జీల్లో మార్పులు
- క్లాసిక్, సిల్వర్, గ్లోబల్, కాంటాక్ట్ లెస్ డెబిట్ కార్డుల వార్షిక మెయింటెనెన్స్ చార్జీలను రూ.125 +జీఎస్టీ నుంచి రూ.200 + జీఎస్టీకి పెంచారు.
- యువ, గోల్డ్, కాంబో డెబిట్ కార్డు, మై కార్డ్ (ఇమేజ్ కార్డ్) వంటి డెబిట్ కార్డుల వార్షిక మెయింటెనెన్స్ ప్రస్తుతం ఉన్న రూ.175+ జీఎస్టీ నుండి రూ.250+ జీఎస్టీకి పెరుగుతుంది.
- ఎస్బీఐ ప్లాటినం డెబిట్ కార్డుపై వార్షిక మెయింటెనెన్స్ చార్జీగా రూ.325+ జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం అది రూ.250 +జీఎస్టీగా ఉంది.
- ప్రైడ్ ప్రీమియం బిజినెస్ డెబిట్ కార్డు వంటి ఎస్బీఐ డెబిట్ కార్డులకు వార్షిక నిర్వహణ ఛార్జీలు రూ.425+ జీఎస్టీకి పెరిగాయి. ప్రస్తుతం ఇది రూ.350 + జీఎస్టీగా ఉంది.
- ఏప్రిల్ 1 నుంచి కొన్ని క్రెడిట్ కార్డులకు అద్దె చెల్లింపు లావాదేవీలపై రివార్డు పాయింట్లు ఇవ్వడాన్ని నిలిపివేస్తున్నట్లు ఎస్బీఐ (SBI) వెల్లడించింది.