Samsung Galaxy A16: ఆరేళ్ల పాటు సాఫ్ట్ వేర్ సపోర్ట్ తో, బడ్జెట్ ధరలో శాంసంగ్ గెలాక్సీ ఏ16 5జీ స్మార్ట్ ఫోన్ లాంచ్
18 October 2024, 19:20 IST
Samsung Galaxy A16: 6 సంవత్సరాల ఎక్సెటెండెడ్ సాఫ్ట్ వేర్ సపోర్ట్, ఇతర ఆకర్షణీయమైన ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ ఎ16 5జీ స్మార్ట్ ఫోన్ ను బడ్జెట్ ధరలో భారతదేశంలో లాంచ్ చేశారు. ఈ స్మార్ట్ ఫోన్ లో 6.7 అంగుళాల అమోఎల్ఈడీ డిస్ప్లే ఉంటుంది. ధర, ఇతర స్పెసిఫికేషన్స్ కోసం కింద చదవండి..
శాంసంగ్ గెలాక్సీ ఏ16 5జీ స్మార్ట్ ఫోన్
Samsung Galaxy A16: బడ్జెట్ ధరలో అన్ని ఫీచర్స్ ఉన్న అడ్వాన్స్డ్ స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని శాంసంగ్ గెలాక్సీ ఏ16 5జీని భారత్ లో లాంచ్ చేశారు. ఈ స్మార్ట్ ఫోన్ వాల్యూ ఫర్ మనీ కోసం చూస్తున్న వినియోగదారులకు సరైన ఎంపిక అవుతుంది.
శాంసంగ్ గెలాక్సీ ఏ16 5జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
శాంసంగ్ గెలాక్సీ ఏ16 5జీ స్మార్ట్ ఫోన్ లో ఎఫ్ హెచ్ డీ+ రిజల్యూషన్ ను సపోర్ట్ చేసే 6.7 అంగుళాల అమోఎల్ఈడీ డిస్ ప్లే ఉంటుంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 256 జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. మైక్రో ఎస్ డీ కార్డ్ స్లాట్ ను ఉపయోగించడం ద్వారా వినియోగదారులు స్టోరేజ్ సామర్థ్యాన్ని 1.5 టీబీ వరకు పెంచుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ (smartphone) లో 25వాట్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేసే 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్లు
వన్ యుఐ 6.0 ఇంటర్ ఫేస్ తో ఆండ్రాయిడ్ 14 పై ఈ స్మార్ట్ ఫోన్ పనిచేస్తుంది. ఆరు ప్రధాన ఓఎస్ అప్ డేట్స్, ఆరేళ్ల సెక్యూరిటీ అప్ డేట్ లను అందుకున్న శాంసంగ్ మొట్ట మొదటి మిడ్-రేంజ్ మోడల్ ఇది. ఈ ఫోన్ తో అక్టోబర్ 31, 2030 వరకు సాఫ్ట్వేర్ సపోర్ట్ లభిస్తుంది.
ట్రిపుల్ కెమెరా సెటప్
శాంసంగ్ గెలాక్సీ ఎ 16 5 జీ స్మార్ట్ ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 5 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీ ప్రియులను ఆకట్టుకునేలా 13 మెగాపిక్సెల్ కెమెరాను ముందువైపు అందించారు. హైబ్రిడ్ డ్యూయల్ సిమ్ సపోర్ట్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కోసం ఐపీ54 రేటింగ్, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్సీ మొదలైన ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.
శాంసంగ్ గెలాక్సీ ఎ 16 5 జీ ధర, లభ్యత
శాంసంగ్ (samsung) గెలాక్సీ ఎ 16 5 జీ గోల్డ్, లైట్ గ్రీన్, బ్లూ బ్లాక్ అనే మూడు కలర్ వేరియంట్లలో లభిస్తుంది. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.18,999గానూ, 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.21,999గానూ నిర్ణయించారు. శాంసంగ్ అధికారిక వెబ్సైట్, అమెజాన్ (amazon), ఫ్లిప్ కార్ట్ (flipkart), వివిధ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ల ద్వారా వినియోగదారులు ఈ స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు. పరిమిత కాల ఆఫర్లో భాగంగా యాక్సిస్, ఎస్బీఐ క్రెడిట్ కార్డులపై రూ.1,000 వరకు క్యాష్ బ్యాక్, శాంసంగ్ వాలెట్ పై రూ.500 వోచర్ పొందొచ్చు.