Revolt RV1 Electric Bike : 160 కి.మీ రేంజ్‌తో ఆర్‌వి1 ఎలక్ట్రిక్ బైక్.. ఇంకా అమేజింగ్ ఫీచర్లు
18 September 2024, 13:30 IST
- Revolt RV1 Electric Bike : భారతదేశంలో ఎలక్ట్రిక్ బైకులకు డిమాండ్ పెరుగుతుంది. దీంతో కంపెనీలు సైతం కొత్త కొత్త మోడళ్లను మార్కెట్లోకి వదులుతున్నాయి. కొత్తగా రివోల్ట్ ఆర్‌వి1 బైక్ విడుదలైంది. ఈ బైక్ ధర, ఫీచర్లు ఏంటో చూడండి..
ఆర్‌వి1 ఎలక్ట్రిక్ బైక్
భారతదేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ కంపెనీ రివోల్ట్ మోటార్స్ తన కొత్త రివోల్ట్ ఆర్‌వి1 ఎలక్ట్రిక్ బైక్‌ను విడుదల చేసింది. ఈ కొత్త రివోల్ట్ RV1 బైక్‌తో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగంలో ఆధిపత్యం చెలాయించే ప్లాన్ వేసింది కంపెనీ. ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్లో మంచి అమ్మకాలను చూస్తున్నాయి. మొత్తం 1.25 కోట్లలో ఏటా 80 లక్షలకు పైగా మోటార్‌సైకిళ్లు అమ్ముడవుతున్నాయి. దీంతో కంపెనీలు కూడా వీటి వైపు మెుగ్గుచూపుతున్నాయి. తాజాగా రివోల్ట్ ఎలక్ట్రిక్ బైక్ మార్కెట్‌లోకి వచ్చింది.
రివోల్ట్ ఆర్‌వి1 ఎలక్ట్రిక్ బైక్ ప్రారంభ ధర రూ.84,990గా ఉంది. ఈ బైక్ ప్రీమియం వెర్షన్ ఆర్‌వి1+ మోడల్ ధర రూ.99,990. ఈ మోడల్‌లు పెట్రోల్ మోటార్‌సైకిళ్ల కంటే మూడు రెట్లు తక్కువ ఖర్చును అందిస్తాయి. దీంతో ఎలక్ట్రిక్ బైక్‌లు ఎక్కువ మందిని ఆకర్షిస్తున్నాయి. రివోల్ట్ RV1 ఓలా రోడ్‌స్టర్ Xకి ప్రత్యర్థిగా ఉంటుంది.
రివోల్ట్ RV1 ఎలక్ట్రిక్ బైక్ మిడ్-మోటార్, చైన్ డ్రైవ్ సిస్టమ్‌తో ఆధారితమైనది. RV1 రెండు బ్యాటరీ ఎంపికలను కలిగి ఉంది. వీటిలో 2.2 kWh బ్యాటరీ ప్యాక్ 100 కి.మీ. మరో 3.24 kWh బ్యాటరీ 160 కి.మీ పరిధిని ఇస్తుంది. ఈ రెండు బ్యాటరీ ఎంపికలు నీటి నిరోధకత కోసం IP67-రేటింగ్‌ను కలిగి ఉన్నాయని కంపెనీ పేర్కొంది. ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితుల్లో కూడా మంచి పనితీరును కనబరుస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ RV1+ని కేవలం 1.5 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయడానికి అనుమతిస్తుంది. దీంతో కస్టమర్‌కు చాలా సమయం ఆదా అవుతుంది.
రివోల్ట్ ఆర్‌వి1 250కిలోల పేలోడ్ కెపాసిటీని కలిగి ఉంటుంది. ఫీచర్ల పరంగా ఎల్ఈడీ హెడ్‌లైట్లు, ఆరు అంగుళాల డిజిటల్ ఎల్‌సీడీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లు, మల్టిపుల్ స్పీడ్ మోడ్‌లు, రివర్స్ మోడ్‌ను పొందుతుంది.
బైక్‌లో విశాలమైన టైర్లు కూడా ఉన్నాయి. ఇది బైక్‌కు మరింత స్థిరమైన రైడ్‌ని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లతో భద్రత మరింత మెరుగుపరిచారు. ఇతర కమ్యూటర్ మోటార్‌సైకిళ్లలో సాధారణంగా కనిపించని అత్యుత్తమ స్టాపింగ్ పవర్‌ను అందిస్తుంది. రైడింగ్ అనుభవాల కోసం స్పీడ్ మోడ్‌లను కూడా అందిస్తుంది. రివర్స్ మోడ్‌ను పరిచయం చేస్తుంది.
కొత్త బైక్ లాంచ్‌తో పాటుగా రివోల్ట్ దాని ఫ్లాగ్‌షిప్ మోడల్ ఆర్‌వి400కి కొన్ని అప్‌డేట్‌లను చేసింది. ఇది ఇప్పుడు వేగవంతమైన ఛార్జర్‌ను పొందుతుంది. ఇది 90 నిమిషాల్లో బైక్‌ను పూర్తిగా ఛార్జ్ చేస్తుంది. అదనంగా రివోల్ట్ ఆర్‌వి400 రివర్స్ మోడ్, మెరుగైన డిజిటల్ డిస్‌ప్లే, 160 కి.మీ విస్తరించిన పరిధితో వస్తుంది.