500-crore crypto scam: రూ. 500 కోట్ల క్రిప్టో కరెన్సీ స్కామ్
30 December 2022, 22:22 IST
₹500-crore crypto scam: క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టడం ద్వారా పెద్ద ఎత్తున లాభాలు ఆర్జించవచ్చని ఆశ చూపి ఇన్వెస్టర్లను రూ. 500 కోట్లకు ముంచేశారు.
ప్రతీకాత్మక చిత్రం
₹500-crore crypto scam: క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టడం ద్వారా పెద్ద ఎత్తున లాభాలు ఆర్జించవచ్చని ఆశ చూపి ఇన్వెస్టర్లను రూ. 500 కోట్లకు ముంచేసిన ఘటన ఢిల్లీలో వెలుగు చూసింది.
₹500-crore crypto scam: ప్లాన్డ్ స్కామ్
తాము ప్రారంభించిన ఒక క్రిప్టో కరెన్సీలో ఇప్పుడే పెట్టుబడి పెట్టడం ద్వారా 200% వరకు రిటర్న్ వస్తుందని ఆశ చూపి బాధిత ఇన్వెస్టర్ల నుంచి సుమారు 500 కోట్ల రూపాయలను కొందరు వ్యక్తులు కొల్లగొట్టారు. వారు దేశం విడిచి పారిపోయిన తరువాత కానీ, తాము మోసపోయిన విషయాన్ని బాధితులు గుర్తించలేకపోయారు. దాంతో, వారు పోలీసులను ఆశ్రయించి, కేసు పెట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
₹500-crore crypto scam: గోవాలో గ్రాండ్ గా పార్టీ
తమ వలలో పడే అవకాశమున్న వారిని గుర్తించిన స్కామ్ స్టర్లు వారిని ముందుగా గోవాకు తీసుకువెళ్లేవారు. అక్కడ ఖరీదైన హోటెల్స్ లో బస ఏర్పాటు చేసేవారు. అన్ని రకాల వసతులు కల్పించేవారు. గ్రాండ్ గా పార్టీలు ఏర్పాటు చేసేవారు. వారితో సమావేశం ఏర్పాటు చేసి, తాము ప్రారంభించబోయే క్రిప్టో కరెన్సీ గురించి వివరించేవారు. పీపీటీ ప్రజెంటేషన్లతో ఆకట్టుకునేవారు. బ్లాక్ చెయిన్ టెక్నాలజీ గురించి వివరించేవారు. పెట్టిన పెట్టుబడికి ఆరు నెలల్లోనే కనీసం 200% లాభాలు గ్యారెంటీ అని నమ్మబలికేవారు. దాంతో, వారిని పూర్తిగా నమ్మేసి, కోట్ల రూపాయలను వారికి చెల్లించారు.
₹500-crore crypto scam: దేశం విడిచి పారిపోయారు..
కొన్ని దేశాల్లో ఇప్పటికే తమ క్రిప్టోను లాంచ్ చేశామని వారు చెప్పారని, ప్రస్తుతం తమ క్రిప్టో విలువ 2.5 డాలర్లుగా ఉందని, త్వరలో అది భారీగా పెరుగుతుందని చెప్పారని బాధితుల్లో రూ. 1.47 కోట్లు పోగొట్టుకున్న వ్యక్తి పోలీసులకు వివరించాడు. వివిధ దేశాల్లో తమ క్రిప్టో ఎలా ఎదుగుతుందో వివరించే, రెండు, మూడు వెబ్ సైట్లను కూడా తమకు చూపించారని తెలిపాడు. ఆ క్రిప్టోలో పెట్టుబడి పెట్టిన తరువాత, ఆ వెబ్ సైట్ల ద్వారా రిటర్న్స్ ను బిట్ కాయిన్స్ గా మార్చుకోవచ్చని, ఆన్ లైన్ లో విత్ డ్రా చేసుకోవచ్చని వివరించారని తెలిపాడు. అయితే, తాము విత్ డ్రా చేసుకోవడానికి ప్రయత్నిస్తే, వెబ్ సైట్ ఎర్రర్ చూపిస్తోందన్నారు. అయితే, ఆ నిందితులు ఇప్పటికే దేశం విడిచి పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు.