తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Cash In Atm's : ఏటీఎంలలో నగదు లేకపోతే బ్యాంకులకు జరిమానా… ఆర్‌బిఐ ఆదేశాలు

Cash In ATM'S : ఏటీఎంలలో నగదు లేకపోతే బ్యాంకులకు జరిమానా… ఆర్‌బిఐ ఆదేశాలు

HT Telugu Desk HT Telugu

13 December 2022, 15:52 IST

    • Cash In ATM'S ఏటీఎంలలో నగదు తీసుకోవడానికి ప్రయత్నించి విఫలమవ్వడం ప్రతి ఒక్కరికి అనుభవంలోకి వచ్చే ఉంటుంది. వరుస సెలవులు, వారాంతాపు రోజుల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటోంది. నెలాఖరి రోజులు, సెలవులతో కలిసి వస్తే  జనాలకు చుక్కలు కనిపిస్తాయి.  బ్యాంకు ఏటీఎంలు తగినన్ని ఉన్నా, చాలా సందర్భాల్లో వాటిలో నగదు కొరత ఉంటుంది. నగదు అందుబాటులో లేకపోతే బ్యాంకులకు రిజర్వ్‌ బ్యాంక్ జరిమానా కూడా విధిస్తుంది. 
ఏటీఎంలలో నగదు లేకపోతే బ్యాంకులకు జరిమానా
ఏటీఎంలలో నగదు లేకపోతే బ్యాంకులకు జరిమానా (REUTERS)

ఏటీఎంలలో నగదు లేకపోతే బ్యాంకులకు జరిమానా

Cash In ATM'S ఏటీఎం కేంద్రాల నిర్వహణ విషయంలో బ్యాంకులు చాలా సందర్భాల్లో ఉదాసీనంగా వ్యవహరిస్తుంటాయి. బ్యాంకు బ్రాంచీకి అనుబంధంగా ఉన్న ఏటీఎం కేంద్రాలలో కొంత వెలుసుబాటు ఉన్నా, బ్యాంకు బ్రాంచిలతో సంబంధం లేకుండా ఉన్న ఏటిఎం కేంద్రాలలో నగదు లేకపోతే మరో ఏటిఎం కేంద్రానికి వెళ్లాల్సిందే. అయితే ఇక్కడే ఓ సమస్య ఉంది. ఏటిఎం కేంద్రాలలో నగదు లావాదేవీలు ఇప్పుడు ఉచితం కాదు.

పట్టణ ప్రాంతాల్లో ఐదారుకు మించి లావాదేవీలు నిర్వహించడానికి వీల్లేదు. ఆ తర్వాత ప్రతి లావాదేవీకి నిర్ణీత మొత్తం మన ఖాతా నుంచి బ్యాంకు మినహాయించుకుంటుంది. ఇలా బ్యాంకు ఖాతా ఉన్న ఏటిఎంలకు ఓ రకమైన ఛార్జీ, ఇతర బ్యాంకుల ఏటిఎంలకు మరో రకమైన ఛార్జీలను వసూలు చేస్తారు. సాధారణంగా ఈ ఏటిఎం లావాదేవీలకు రూ.11 నుంచి రూ.23 వరకు వసూలు చేస్తారు. ఖాతాదారుడికి ఏటిఎంలో నగదు లభించింది, లేదు అనే వివరాలతో సంబంధం లేకుండా ఈ చార్జీలు ఖాతా నుంచి వెళ్లిపోతూనే ఉంటాయి. చాలా సందర్భాల్లో ఆ వివరాలు ఖాతాదారుడికి తెలిసే అవకాశం కూడా ఉండదు.

మరోవైపు ఏటిఎంలలో నగదు లభ్యత విషయంలో బ్యాంకు బ్రాంచీల్లో బాధ్యతను పెంచడానికి ఆర్‌బిఐ చర్యలు చేపట్టింది. నగదు ఉపసంహరణ విషయంలో ప్రజల జేబులకు చిల్లు పడుతుండటంతో నగదు లేని ఏటిఎంలకు జరిమానాలు విధించాలని నిర్ణయించింది. ప్రతి ఏటిఎం కేంద్రంలో నగదు లావాదేవీలపై ఆర్‌బిఐ పర్యవేక్షణ ఉంచారు. ఈ మేరకు ఆర్‌బిఐ అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ప్రైవేట్ బ్యాంకులకు కూడా కొద్ది నెలల క్రితం సర్క్యూలర్ పంపింది.

ప్రజలను ఇబ్బంది పెట్టే నగదు కొరతకు బ్యాంకులు బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆర్‌బిఐ స్పష్టం చేసింది. నగదు కొరత కారణంగా చెల్లింపులు చేయలేకపోతే సంబంధిత బ్యాంకుపై ఆర్‌బిఐ చర్యలు తీసుకుంటుంది. బ్యాంకు ఏటిఎంలలో నగదు లభ్యతపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉంచుకోవాల్సిన బాద్యత అయా బ్యాంకులపై ఉంటుంది. ఏటిఎంలలో ఎప్పటికప్పుడు నగదు జమ చేస్తూ ఉండాలని బ్యాంకులకు ఆర్‌బిఐ సర్క్యులర‌్‌లో స్పష్టం చేసింది. 2021 అక్టోబర్‌ 1 నుంచి దేశ వ్యాప్తంగా ఈ నిబంధన అమల్లోకి వచ్చింది. ఈ మేరకు అన్ని బ్యాంకుల సర్కిల్ కార్యాలయాలు, రీజినల్ కార్యాలయాలు చర్యలు తీసుకోవాలని ఆర్‌బిఐ స్పష్టం చేసింది.

ఏదైనా ఏటిఎంలో ప్రజలు నగదును విత్‌ డ్రా చేసుకోలేకపోతే వాటిని ఆర్‌బిఐ మానిటరింగ్‌ విభాగం లెక్కిస్తుంది. ఏటిఎంలో గరిష్టంగా పది గంటల కంటే ఎక్కువ సమయం నగదు అందుబాటులో లేకపోతే సంబంధిత బ్యాంకుకు ఆర్‌బిఐ గరిష్టంగా 10వేల రుపాయల జరిమానా విధిస్తుంది. జరిమానాలు పడకుండా ఉండాలంటే ప్రతి బ్యాంకు ఆర్వో, సర్కిల్ కార్యాలయాల నుంచి ఏటిఎం కేంద్రాలను నిరంతరం పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేసుకోవాలని ఆర్‌బిఐ ఆదేశించింది. ఈ క్రమంలో పదేపదే నిబంధనల ఉల్లంఘన జరిగితే సంబంధిత సిబ్బందిపై చర్యలు ఉంటాయని కూడా ఆర్‌బిఐ స్పష్టం చేసింది.

టాపిక్