Ransomware Attack : ర్యాన్సమ్‌వేర్ అటాక్.. 300 భారతీయ బ్యాంకులపై ప్రభావం.. పేమెంట్స్‌కు అంతరాయం
01 August 2024, 7:44 IST
- Ransomware Attack In Telugu : చిన్న బ్యాంకులకు సర్వీస్ ప్రొవైడర్ అయిన సీ-ఎడ్జ్ టెక్నాలజీస్‌పై సైబర్ దాడి జరిగింది. దీంతో 300 భారతీయ బ్యాంకులపై ప్రభావం పడింది.
సైబర్ దాడి
చిన్న బ్యాంకులకు సర్వీస్ ప్రొవైడ్ చేసే సీ-ఎడ్జ్ టెక్నాలజీస్ మీద ర్యాన్సమ్‌వేర్ అటాక్ జరిగింది. ఈ సైబర్ దాడితో 300 ఇండియన్ బ్యాంకులపై ప్రభావం పడింది. భారతదేశంలోని ఈ చిన్న బ్యాంకుల చెల్లింపు నెట్‌వర్క్ తాత్కాలికంగా నిలిపివేశారు.
సైబర్ దాడి భారతదేశంలోని అనేక చిన్న బ్యాంకులకు బ్యాంకింగ్ టెక్నాలజీ సిస్టమ్‌లను అందించే కీలకమైన సి-ఎడ్జ్ టెక్నాలజీస్‌ను లక్ష్యంగా చేసుకుంది. ఈ దాడి వల్ల చెల్లింపు వ్యవస్థలు ఆగిపోయాయి. సాంకేతిక మౌలిక సదుపాయాల కోసం C-Edgeపై ఆధారపడే చిన్న బ్యాంకులు చాలా ఉన్నాయి. దీంతో వాటిపై ప్రభావం పడింది.
మరోవైపు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) ఈ విషయంపై వేగంగా చర్యలు చేపట్టింది. రిటైల్ చెల్లింపుల వ్యవస్థను యాక్సెస్ చేయకుండా C-Edge టెక్నాలజీలను తాత్కాలికంగా వేరుచేసింది. బ్యాంకింగ్ నెట్‌వర్క్‌లోని ఇతర భాగాలకు ransomware వ్యాప్తి చెందకుండా నిరోధించేందుకు ఈ చర్యలు తీసుకుంది.
ర్యాన్సమ్‌వేర్ అటాక్ కారణంగా ప్రభావిత బ్యాంకుల కస్టమర్‌లు ప్రస్తుతం చెల్లింపు వ్యవస్థలను యాక్సెస్ చేయలేకపోతున్నారు. అయితే ఈ అంతరాయం వెంటనే పరిష్కారం అవుతుందని అంటున్నారు. రెగ్యులేటరీ అథారిటీ నుండి వచ్చిన మూలాల ప్రకారం దేశంలోని ఈ చిన్న బ్యాంకుల డిజిటల్ చెల్లింపుల వాటా 0.5శాతం మాత్రమే ఉన్నాయి. దీని ప్రభావం ఈ బ్యాంకుల ద్వారా పేమెంట్స్ జరిపే వారిపై పడుతుంది. పెద్ద బ్యాంకింగ్ వ్యవస్థలో విస్తృత అంతరాయాన్ని కలిగించే అవకాశం లేదు.
సైబర్ దాడి.. చెల్లింపుల నెట్‌వర్క్‌లోని ఇతర భాగాలకు వ్యాపించకుండా చూసేందుకు NPCI ప్రస్తుతం ఆడిట్‌ను నిర్వహిస్తోంది. ఇంకోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), ఇతర సైబర్ అధికారులు హై అలర్ట్‌గా ఉన్నారు. కొన్ని వారాల కిందటే సైబర్ దాడులు జరిగే అవకాశం ఉందని బ్యాంకులకు హెచ్చరికలు జారీ చేశారు.
ఇండియాలో 1500 కోఆపరేటివ్, ప్రాంతీయ బ్యాంకులు సేవలు ఇస్తున్నాయి. వీటిలో కొన్నింటిపై ర్యాన్సమ్‌వేర్ ప్రభావం పడినట్టుగా తెలుస్తోంది. సమస్య మరింత కఠినంగా అవ్వకుండా NPCI సమీక్షిస్తోంది.