తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Government Scheme : మీ సొంత వ్యాపారాన్ని అభివృద్ధి చేసేందుకు రూ.10 లక్షల లోన్.. ఇలా అప్లై చేయాలి?

Government Scheme : మీ సొంత వ్యాపారాన్ని అభివృద్ధి చేసేందుకు రూ.10 లక్షల లోన్.. ఇలా అప్లై చేయాలి?

Anand Sai HT Telugu

20 October 2024, 21:45 IST

google News
    • Government Scheme : సూక్ష్మ, చిన్న తరహా సంస్థలకు రుణాలు అందించడానికి కేంద్ర ప్రభుత్వం ముద్ర యోజన పథకాన్ని తీసుకొచ్చింది. అయితే రూ.50 వేల నుంచి రూ.10 లక్షల వరకూ దీని కింద రుణం పొందవచ్చు. ఎవరు అర్హులు? ఎలా రుణం పొందాలో తెలుసుకుందాం..
ముద్ర యోజన పథకం
ముద్ర యోజన పథకం

ముద్ర యోజన పథకం

స్వయం ఉపాధిని సృష్టించడంలో సహాయపడటానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రధాన మంత్రి ముద్ర పథకాన్ని అమలు చేస్తుంది. దీని కింద సొంత వ్యాపారాలను ప్రారంభించేలా ప్రోత్సహిస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం దీని కోసం రుణ సౌకర్యం కూడా కల్పిస్తోంది. అర్హులైన వారు దీనిని సద్వినియోగం చేసుకోవాలి. ప్రధాన మంత్రి ముద్ర యోజన కింద రుణాలు అందిస్తారు. ఈ స్కీమ్ కింద మూడు రకాల రుణాలు ఉంటాయి.

మీరు మీ స్వంత వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే కేంద్ర ప్రభుత్వం మీకు సహాయం చేస్తుంది. వ్యాపారం ప్రారంభించేందుకు ప్రభుత్వం 10 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం అందిస్తుంది. భారతదేశ పౌరులు ఎవరైనా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. స్వయం ఉపాధి పొందుతున్న వారికి ఆర్థిక సహాయం అందించేందుకు 2015లో ప్రధాన మంత్రి ముద్ర యోజనను ప్రారంభించారు. మీరు దీని కింద వ్యాపారం ప్రారంభించాలనుకుంటే ఈ పథకం ద్వారా రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రధాన మంత్రి ముద్ర యోజన కింద ప్రభుత్వం మూడు కేటగిరీల కింద రుణాలను అందజేస్తుంది. మొదటిది శిశు లోన్, రెండవది కిశోర్ లోన్, మూడోది తరుణ్ లోన్. శిశు లోన్ ద్వారా 50 వేల రూపాయల వరకు రుణం తీసుకొని మీ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. కిశోర్ రుణం ద్వారా మీరు 50 వేల నుండి 5 లక్షల రూపాయల వరకు రుణం పొందవచ్చు. తరుణ్ లోన్ కింద మీరు 5 లక్షల నుండి 10 లక్షల రూపాయల వరకు రుణం తీసుకొని వ్యాపారం ప్రారంభించవచ్చు.

పథకం కింద ముద్ర లోన్ పొందుతున్న వ్యక్తులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ముద్ర రుణంపై వడ్డీ రేటు మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్ (MCLR) ఆధారంగా నిర్ణయిస్తారు. ఎంసీఎల్ఆర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం లెక్కిస్తారు. హార్టికల్చర్, చేపల పెంపకం వంటి వ్యవసాయ సంబంధిత కార్యకలాపాలలో నిమగ్నమైన వ్యక్తులు కూడా ఈ పథకం కింద రుణం పొందవచ్చు.

సాధారణంగా దాదాపు అన్ని ఆర్థిక సంస్థలు రుణాలు ఇస్తాయి. అయితే అధిక వడ్డీల వల్ల ప్రజలు ఇబ్బందులు పడటం సహజం. ఇప్పుడు మీరు ప్రధాన్ మంత్రి శిశు ముద్ర యోజన కింద రుణం కోసం దరఖాస్తు చేస్తే ఎటువంటి పూచీకత్తు అవసరం లేదు. ఈ రకమైన లోన్ ప్రాసెసింగ్ కోసం ఎటువంటి రుసుం కూడా వసూలు చేయరు. కానీ వివిధ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు మారవచ్చు. ఈ పథకం కింద వడ్డీ రేటు 9 నుంచి 12 శాతం వరకు ఉండే అవకాశం ఉంది.

18 ఏళ్లు పైబడిన భారత పౌరులు ఎవరైనా ఈ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారుకు బ్యాంక్ డిఫాల్ట్ చరిత్ర ఉండకూడదు. రుణం పొందడానికి బ్యాంకు ఖాతా అవసరం. రుణం పొందేందుకు ఇవ్వాల్సిన డాక్యుమెంట్ల విషయానికి వస్తే ఆధార్ కార్డు, పాన్ కార్డ్, నివాస ధృవీకరణ పత్రం, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, బిజినెస్ ప్లాన్, కేవైసీ డాక్యుమెంట్, ఆదాయ రుజువు వంటి పత్రాలు ఉండాలి.

మీరు సమీపంలోని బ్యాంకుకు వెళ్లడం ద్వారా ముద్ర స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేయవచ్చు. మరింత సమాచారం కోసం https://www.mudra.org.in/ని సందర్శించండి. ఈ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు,

టాపిక్

తదుపరి వ్యాసం