Paytm shares down: 10 శాతం పడిపోయిన పేటీఎం షేర్ ధర.. కారణం ఇదే
17 November 2022, 9:55 IST
- Paytm shares down: పేటీఎం షేరు ధర ఈ ఉదయం 10 శాతం వరకు పడిపోయింది.
గురువారం ప్రారంభ డీల్స్‌లో 10 శాతం వరకు పడిపోయిన పేటీఎం
జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్ పేటీఎం నుంచి తన వాటాను తగ్గించుకోవడానికి నిర్ణయించుకోవడంతో గురువారం ప్రారంభ డీల్స్‌లో One 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (పేటీఎం) షేర్లు బీఎస్ఈలో దాదాపు 10% పడిపోయి రూ. 541కి చేరుకున్నాయి.
కంపెనీ ఈక్విటీ క్యాపిటల్‌లో 4.5%కి సమానమైన దాదాపు 29.5 మిలియన్ షేర్లు ఎన్‌ఎస్ఈలో బ్లాక్ డీల్‌గా ట్రేడయ్యాయని బ్లూమ్‌బెర్గ్ సంకలనం చేసిన డేటా వెల్లడించింది.
జూలై 29 నుండి పేటీఎం షేర్లలో భారీ పతనం మొదలైంది. జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్ పేటీఎం చెల్లింపుల యాప్ మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ నుంచి తన వాటాలో మూడో వంతు అంటే 200 మిలియన్ డాలర్ల మేర బ్లాక్ డీల్ ద్వారా విక్రయిస్తుందని బుధవారం వార్తలు వెలువడ్డాయి.
సంస్థాగత పెట్టుబడిదారులకు రూ. 555-601.45 వద్ద షేర్లను ఆఫర్ చేస్తన్నట్టు సమాచారం. ఈ విక్రయం పూర్తయితే సాఫ్ట్‌బ్యాంక్‌కు కనీసం రూ. 1,628.9 కోట్లు లేదా 200 మిలియన్ డాలర్లు లభిస్తాయని నివేదిక పేర్కొంది.
పేటీఎంలో ప్రీ-ఐపీఓ ఇన్వెస్టర్ల కోసం ఒక సంవత్సరం తప్పనిసరి లాక్-ఇన్ పీరియడ్ ముగిసిన తర్వాత ఈ అమ్మకాలు జరుగుతున్నాయి. లాక్-ఇన్ గడువు ముగిసిన తర్వాత స్టాక్స్ తరచుగా పడిపోతాయి. పెట్టుబడిదారులు తమ షేర్లను అమ్మడం మొదలుపెడితే ఆ ప్రభావం షేర్ ధరపై పడుతుంది.
పేటీఎం షేర్లు గత ఏడాది నవంబర్‌లో స్టాక్ మార్కెట్‌లో లిస్టయ్యాయి. గత సంవత్సరం ప్రారంభమైన గ్లోబల్ టెక్ మందగమనం కారణంగా లిస్టింగ్ సమయం నుండి ఈ స్క్రిప్ దాదాపు 65 శాతం క్షీణించింది. జొమాటో, నైకా, పీబీ ఫిన్‌టెక్‌తో సహా న్యూ ఏజ్ టెక్ స్టాక్స్ గత సంవత్సరం స్టాక్ మార్కెట్‌లో లిస్టయి ఇష్యూ ధర కంటే తక్కువకు పడిపోయాయి.