Ola Electric scooter : ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు మంటలు.. కారణం చెప్పిన సంస్థ
30 October 2023, 10:29 IST
- Ola Electric scooter : మహారాష్ట్రలో ఓ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన ఓలా ఎలక్ట్రిక్ సంస్థ.. అగ్ని ప్రమాదానికి గల కారణాన్ని వెల్లడించింది.
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు మంటలు..
Ola Electric scooter : ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు మంటలు అంటుకున్న ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో వాహనం దగ్ధమైంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కారణం ఏంటి..?
పుణెలోని పింప్రి- చించ్వాడ్ ప్రాంతంలో ఈ నెల 28న ఈ ఘటన చోటుచేసుకుంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కాలిపోతుండగా.. స్థానికులు అనేక వీడియోలు తీశారు. అవి ఇప్పుడు వైరల్‌గా మారాయి. అగ్నిమాపక సిబ్బంది.. మంటలను ఆపడానికి చేసిన ప్రయత్నాలు కూడా కొన్ని వీడియోల్లో రికార్డు అయ్యాయి.
అయితే.. ఈ విషయంపై ఓలా ఎలక్ట్రిక్ సంస్థ స్పందించింది. వెహికిల్‌కి మంటలు అంటుకోవడానికి గల కారణాలను వెల్లడించింది.
Ola Electric scooter fire accident : "ఈ నెల 28న పుణెలోని డీవై పాటిల్ కాలేజ్ పార్కింగ్ లాట్లో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు మంటలు అంటుకున్నట్టు మా దృష్టికి వచ్చింది. కస్టమర్‌కు ఎలాంటి హానీ జరగలేదు. ఈ ఘటనపై మేము వెంటనే దర్యాప్తు చేపట్టాము. వెహికిల్ బ్యాటరీకి ఏం అవ్వలేదని, సరిగ్గానే పనిచేస్తోందని తేలింది. అయితే.. ఒరిజినల్ భాగాలను వాడకుండా.. బయట నుంచి వేరే పార్ట్స్ తీసుకొచ్చి వాడటమే.. ఈ ప్రమాదానికి కారణం," అని ఓలా ఎలక్ట్రిక్ సంస్థ ట్విట్టర్ వేదికగా వివరణ ఇచ్చింది.
కాగా ఈ ఘటనపై పీసీఎంసీ (పింప్రి చించ్వాడ్ మిన్సిపల్ కార్పొరేషన్) కూడా దర్యాప్తు చేపట్టింది. బ్యాటరీకి సంబంధించిన సమస్యతో ప్రమాదం చోటుచేసుకుని ఉండొచ్చని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడించింది.
Ola Electric latest news : ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లకు మంటలు అంటుకున్నట్టు వార్తలు రావడం ఇది కొత్త విషయమేమీ కాదు. గతంలో అనేకసార్లు ఇలాంటి వార్తలు వచ్చాయి. దేశవ్యాప్తంగా ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి.
భారత్ ఈవీ ఫెస్ట్..
Ola Bharat EV fest : భారతీయులకు క్రేజీ న్యూస్ ఇచ్చింది ఓలా ఎలక్ట్రిక్. సరికొత్త ఓలా ఎస్1 ఎక్స్+ మోడల్‌ను మీరు ఉచితంగా పొందే అవకాశాన్ని ఇస్తోంది ఓలా ఎలక్ట్రిక్.
పండుగ సీజన్లో కస్టమర్లను ఆకర్షించేందుకు.. ఆటోమొబైల్ సంస్థలు వివిధ మార్గాలు ఎంచుకుంటున్నాయి. కొన్ని సంస్థలు, తమ వాహనాలపై ఆఫర్స్, డిస్కౌంట్స్ ఇస్తుంటో.. ఓలా ఎలక్ట్రిక్ సంస్థ ఏకంగా ఓ పెద్ద క్యాంపైన్నే మొదలుపెట్టింది. అదే.. 'భారత్ ఈవీ ఫెస్ట్'. ఇందులో భాగంగా పలు క్రేజీ ఆఫర్స్ ఇస్తోంది సంస్థ.
భారత్ ఈవీ ఫెస్ట్‌లో భాగంగా.. ఎక్స్టెండెడ్ వారెంటీలపై 50శాతం వరకు డిస్కౌంట్ ఇస్తోంది ఓలా ఎలక్ట్రిక్. అంతేకాకుండా.. ఓలా ఎస్1 ప్రో సెకెండ్ జనరేషన్ ఈ-స్కూటర్‌ను టెస్ట్ డ్రైవ్ చేసే వారికి.. సరికొత్త ఓలా ఎస్1 ఎక్స్+ ఎలక్ట్రిక్ వెహికిల్‌ను దక్కించుకునే అవకాశాన్ని ఇవ్వాలని ఫిక్స్ అయ్యింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.