Nvidia surpasses Apple: మార్కెట్ క్యాప్ లో ఆపిల్ ను అధిగమించిన ఎన్ విడియా; తొలి స్థానంలోనే మైక్రోసాఫ్ట్
06 June 2024, 13:57 IST
Nvidia surpasses Apple: మార్కెట్ క్యాపిటలైజేషన్ లో ఎన్విడియా సంస్థ యాపిల్ ను అధిగమించింది. బుధవారం మార్కెట్ ముగిసే సమయానికి ఎన్విడియా మార్కెట్ విలువ 3.019 ట్రిలియన్ డాలర్లకు చేరుకోగా, ఆపిల్ మార్కెట్ విలువ 2.99 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. మార్కెట్ విలువలో మైక్రోసాఫ్ట్ తొలి స్థానంలో ఉంది.
ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్
Nvidia surpasses Apple: మార్కెట్ క్యాప్ లో ఆపిల్ ను అధిగమించిన ఎన్ విడియా ఇప్పుడు మైక్రోసాఫ్ట్ తరువాత రెండవ అత్యంత విలువైన పబ్లిక్ ట్రేడెడ్ కంపెనీగా ఉంది. ఎన్విడియా కంపెనీ షేర్లు 5 శాతానికి పైగా పెరగడంతో కంపెనీ విలువ 3 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ మైలురాయిని దాటేసింది. మార్కెట్ ముగిసే సమయానికి ఎన్విడియా మార్కెట్ విలువ 3.019 ట్రిలియన్ డాలర్లు కాగా, ఆపిల్ మార్కెట్ విలువ 2.99 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. మైక్రోసాఫ్ట్ 3.15 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ తో అత్యంత విలువైన పబ్లిక్ ట్రేడెడ్ కంపెనీగా ఉంది.
2002 తరువాత ఇప్పుడే..
మొదటి ఐఫోన్ విడుదల కావడానికి ఐదేళ్ల ముందు అంటే 2002లో చివరిసారిగా ఎన్విడియా మార్కెట్ విలువ ఆపిల్ కంటే ఎక్కువగా ఉంది. ఆ సమయంలో ఈ రెండు కంపెనీల విలువ 10 బిలియన్ డాలర్ల కంటే తక్కువే. 2023 మే లో మార్కెట్ క్యాపిటలైజేషన్ లో ఎన్విడియా తొలిసారి ట్రిలియన్ డాలర్లను దాటింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో తొలిసారి 2 ట్రిలియన్ డాలర్లను దాటింది.
ఏఐ అప్ గ్రేడేషన్
ప్రతి ఏటా ఏఐ యాక్సిలరేటర్లను అప్ గ్రేడ్ చేయాలని యోచిస్తున్నట్లు ఎన్విడియా కంపెనీ సీఈఓ జెన్సన్ హువాంగ్ తెలిపారు. బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, జెన్సెన్ హువాంగ్ సంపద 5 బిలియన్ డాలర్లకు పైగా పెరిగి 107.4 బిలియన్ డాలర్లకు చేరుకుంది. కాగా, 1 ట్రిలియన్ డాలర్లు, 2 ట్రిలియన్ డాలర్లు, 3 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ ను దాటిన మొదటి కంపెనీ ఆపిల్. ఇది చాలా కాలం పాటు అత్యంత విలువైన కంపెనీ టైటిల్ ను కూడా కలిగి ఉంది. ఈ ఏడాది యాపిల్ మార్కెట్ క్యాప్ ను మైక్రోసాఫ్ట్ అధిగమించింది. ఎన్వీడియా త్వరలోనే మైక్రోసాఫ్ట్ ను అధిగమించే దిశగా అడుగులు వేస్తోంది.