Maruti Suzuki Electric Car : మారుతి సుజుకి నుంచి ఎలక్ట్రిక్ కారు.. ఈ విటారాతో ప్రత్యర్థులకు టెన్షనే!
14 November 2024, 12:30 IST
- Maruti Suzuki Electric Car : భారతదేశంలో మారుతి సుజుకికి తిరుగులేదు. ఈ కంపెనీలు కార్లు అమ్మకాల్లో టాప్‌లో ఉంటాయి. ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్‌లోనూ మరింత దూసుకెళ్లేందుకు మారుతి ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా ఈవీ విటారాను తీసుకురానుంది.
మారుతి సుజుకి ఈ విటారా
మారుతి సుజుకీ దేశంలోనే అతిపెద్ద వాహన తయారీ సంస్థ. ఇతర కంపెనీలు అమ్మకాల్లో మారుతిని కొట్టలేవు. జనాలకు ఈ కారుపై నమ్మకం ఎక్కువే. ఇటీవలే కొత్త డిజైర్ విడుదల చేసింది. ఇక ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లోనూ తన ఉనికిని చాటుకునేందుకు రెడీ అవుతోంది. ఈవీ అమ్మకాల్లో టాప్‌లో ఉన్న టాటాకు పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. అందులో భాగంగా ఈవీ విటారాను లాంచ్ చేయనుంది.
ఇటలీలోని మిలన్‌లో జరిగిన అంతర్జాతీయ కార్యక్రమంలో ఈ ఎలక్ట్రిక్ కారు ఆవిష్కరించారు. ఈవీ రంగంలో కంపెనీ ప్రవేశం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ విటారా 2023 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించారు. ఈవీఎక్స్ కాన్సెప్ట్ ఆధారంగా దీనిని రూపొందించారు.
ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం.. ఏప్రిల్ లేదా మే 2025లో గుజరాత్‌లోని సుజుకి ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కేంద్రంలో ఈ కారు ఉత్పత్తి ప్రారంభమవుతుంది. ఈ విటారా ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ వాహనాల కోసం రూపొందించిన Hartect-E ప్లాట్‌ఫారమ్‌పై తయారుచేస్తారు. పనితీరు, శక్తి సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఇది ఉపయోగపడుతుంది.
మారుతి ఎలక్ట్రిక్ కారు డిజైన్‌లోనూ తగ్గట్టుగా రెడీ అవుతుందని తెలుస్తోంది. ఎల్ఈడీ హెడ్‌లైట్‌లు, ట్రై-స్లాష్ ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లు, ఫ్రంట్ ఛార్జింగ్ పోర్ట్‌లు, వెనుక వీల్ ఆర్చ్‌లు.. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో ఆకర్శణియంగా ఉంటాయి. మారుతి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 18-అంగుళాల లేదా 19-అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో వస్తుంది.
మారుతి ఈ విటారా 4,275 మిమీ పొడవు, 1,800 మిమీ వెడల్పు, 1,635 మిమీ ఎత్తు, 2,700 మిమీ వీల్‌బేస్, 180 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్‌తో రానుంది. ఎక్ట్సీరియర్ లాగానే ఇంటీరియర్ స్టైలిష్ గా డిజైన్ ఉంటుందని తెలుస్తోంది. వన్-పీస్ డిస్‌ప్లే, సెంటర్ కన్సోల్ కోసం కొత్త డిజైన్, వర్టికల్ ఎయిర్ వెంట్స్, ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ అట్రాక్టివ్‌గా ఉంటాయి.
బ్యాటరీ చూసుకుంటే.. మారుతి సుజుకి ఈ విటారా రెండు ఆప్షన్స్‌లో వస్తుంది. 49 kWh, 61 kWhగా రానుంది. పూర్తి ఛార్జింగ్‌పై 500 కి.మీ వరకు రేంజ్ ఇస్తుందని చెబుతున్నారు. సింగిల్ మోటార్ 49kWh బ్యాటరీ ప్యాక్ 144 బీహెచ్‌పీ శక్తిని, 189 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 61 kWh బ్యాటరీ 174 బీహెచ్‌పీ శక్తిని, 189 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఈ మోడల్ వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, విభిన్న డ్రైవ్ మోడ్‌లు, హిల్ డిసెంట్ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఆటో హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లు, హీటెడ్ మిర్రర్స్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్, ఏడీఏఎస్ ఫీచర్లను కూడా పొందుతుంది.