Electric Scooter : మార్కెట్‌లోకి వచ్చిన మరో ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర తక్కువే.. ఛార్జింగ్ కాస్ట్ ఎక్కువ ఉండదు!
Electric Scooter : ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్. జెలియో ఈ బైక్స్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. అందుబాటు ధరలో మంచి రేంజ్‌తో ఈ స్కూటీ వస్తుంది.
ధర తక్కువలో ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం వెతుకుతున్న వారికి జెలియో ఈ బైక్స్ మంచి ఆప్షన్స్ ఇస్తుంది. వివిధ రకాల ఈవీలను విడుదల చేస్తోంది. ఇప్పుడు తాజాగా జెలియో ఎక్స్ మెన్ 2.0 అనే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేసింది. ఓలా, ఏథర్ వంటి కంపెనీలకు పోటీనిచ్చేందుకు సిద్ధమవుతోంది. కొత్తగా లాంచ్ చేసిన జెలియో ఎలక్ట్రిక్ స్కూటీ సిటీలో వాడేందుకు బాగుంటుంది.
జెలియో సరికొత్త ఎక్స్-మెన్ 2.0 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను వివిధ బ్యాటరీ ఆప్షన్స్, ధరలతో నాలుగు వేరియంట్‌లలో విడుదల చేసింది. ఇందులో రెండు బ్యాటరీ ఎంపికలను కలిగి ఉంది. అవి లెడ్-యాసిడ్, లిథియం-అయాన్. లీడ్ యాసిడ్ వేరియంట్‌లలో 60V 32AH వెర్షన్ ధర రూ.71,500 కాగా 72V 32AH వెర్షన్ ధర రూ.74,000గా నిర్ణయించారు.
జెలియో ఎక్స్-మెన్ 2.0 ఈవీ లిథియం అయాన్ వేరియంట్‌లలో 60V 30AH మోడల్ ధర రూ. 87,500, 74V 32AH మోడల్ ధర రూ. 91,500గా పెట్టారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటీ గంటకు 25 కి.మీ వేగాన్ని అందుకోగలదు. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 100 కి.మీ రేంజ్ వస్తుంది. ఇది 60/72V బీఎల్‌డీసీ మోటారుతో అమర్చి ఉంటుంది. ఇది ఒక ఛార్జీకి 1.5 యూనిట్ల విద్యుత్తును వినియోగిస్తుంది కాబట్టి ఖర్చు చాలా తక్కువ.
ఎక్స్-మెన్ 2.0 ఎలక్ట్రిక్ స్కూటర్ మొత్తం బరువు 90 కిలోలు, 180 కిలోల లోడింగ్ కెపాసిటీని కలిగి ఉందని కంపెనీ పేర్కొంది. ఛార్జింగ్ పెట్టేందుకు గంటల సమయం పడుతుందనే ఆలోచన ఉన్నవారికి జెలియో ఈ బైక్స్ సమాధానం ఇచ్చిందనే చెప్పవచ్చు.
ఎక్స్-మెన్ 2.0 ఈవీ లిథియం అయాన్ బ్యాటరీ వేరియంట్‌ల పూర్తి ఛార్జ్ 4 నుండి 5 గంటలు మాత్రమే పడుతుంది. స్కూటర్ లెడ్ యాసిడ్ రకాలు పూర్తిగా ఛార్జ్ చేయడానికి 8 నుండి 10 గంటల సమయం పడుతుంది. ఆకుపచ్చ, తెలుపు, సిల్వర్, ఎరుపు అనే నాలుగు కలర్ ఆప్షన్స్‌లో దొరుకుతుంది.
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ముందు, వెనుక డిస్క్ బ్రేక్‌లు, ముందువైపు అల్లాయ్ వీల్స్, వెనుకవైపు హబ్ మోటార్ వంటి ఫీచర్లో ఉంది. రైడర్ సౌలభ్యం కోసం సస్పెన్షన్ ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుకవైపు స్ప్రింగ్-లోడెడ్ షాక్ అబ్జార్బర్‌లతో వస్తుంది.
జెలియో ఎలక్ట్రిక్ స్కూటీ యాంటీ థెఫ్ట్ అలారం, సెంట్రల్ లాకింగ్, రివర్స్ గేర్, పార్కింగ్ స్విచ్, ఆటో రిపేర్ స్విచ్, యూఎస్‌బీ ఛార్జర్, డిజిటల్ డిస్‌ప్లే వంటి ఆధునిక ఫీచర్లతో కూడా అందిస్తుంది. రెండు బ్యాటరీ వేరియంట్‌లపై కంపెనీ ఒక సంవత్సరం లేదా 10,000 కిమీ వారంటీని అందిస్తోంది.
జెలియో ఈ బైక్స్ 2021లో స్థాపించారు. భారతీయ ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్లో వేగంగా ఈ కంపెనీ విస్తరిస్తోంది. కంపెనీకి ప్రస్తుతం భారతదేశం అంతటా 256 డీలర్‌షిప్‌లు, 200,000 మంది కస్టమర్‌లు ఉన్నారు. మార్చి 2025 నాటికి 400 డీలర్‌షిప్‌లకు విస్తరించే ఆలోచనలో కంపెనీ ఉంది.