36 నెలల్లో 1 మిలియన్ మందికి పైగా కొనుగోలు చేసిన పాపులర్ బైక్.. ఇప్పుడు కొత్తగా వచ్చేసింది
27 October 2024, 14:30 IST
- TVS Bikes : టీవీఎస్ బైకులకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. చాలా మంది వీటిని కొంటారు. కంపెనీ కూడా ఎప్పటికప్పుడు కస్టమర్ల ఇష్టానికి తగ్గట్టుగా అప్‌డేట్ చేస్తూ ఉంటుంది. 1 మిలియన్‌కు పైగా అమ్మకాలతో రికార్డు సృష్టించిన టీవీఎస్ రైడర్ 125.. ఇప్పుడు కొత్త వెర్షన్‌లో వచ్చింది.
టీవీఎస్ రైడర్ 125
టీవీఎస్ మోటార్ ఒక ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ. దేశీయ మార్కెట్‌లో వివిధ బైక్‌లు, స్కూటర్‌లను విక్రయిస్తోంది. ప్రస్తుతం కంపెనీ విక్రయిస్తున్న రైడర్ 125 పాపులర్ బైక్‌గా పేరు తెచ్చుకుంది. అధిక సంఖ్యలో కస్టమర్లు కొనుగోలు చేస్తున్నారు. ఈ మోటార్‌సైకిల్ విక్రయంలో టీవీఎస్ కంపెనీ సరికొత్త చరిత్ర సృష్టించింది. సెప్టెంబర్ 2021లో ప్రారంభించినప్పటి నుండి అంటే 36 నెలల్లో రైడర్ 125.. 10 లక్షల (1 మిలియన్) యూనిట్ల బైక్‌లను విక్రయించింది.
టీవీఎస్ మోటార్ చారిత్రాత్మక రికార్డు సృష్టించేందుకు రైడర్ 125 మోటార్‌సైకిల్‌లో సరికొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. దీనికి రైడర్ ఐగో అని పేరు పెట్టారు. చాలా సరసమైన ధరలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. దీనిని 98,389 ఎక్స్-షోరూమ్ ధరగా నిర్ణయించారు.
కొత్త టీవీఎస్ రైడర్ ఐగో బైక్ బూస్ట్ మోడ్ అనే ప్రత్యేక ఫీచర్లతో విడుదలైంది. ఇది 0.55 Nm గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇంధన సామర్థ్యం కూడా 10 శాతం మెరుగుపడిందని కంపెనీ పేర్కొంది. కొత్త బైక్ పాత వెర్షన్ కంటే ఎక్కువ మైలేజీని ఇస్తుంది. 5.8 సెకన్లలో 0-60 kmph స్పీడ్ అందుకుంటుంది.
ఈ టీవీఎస్ రైడర్ ఐగో మోటార్‌సైకిల్ 124.8సీసీ ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ 3V పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో వస్తుంది. ఇది 7,500 ఆర్‌పీఎమ్ వద్ద 11.22 బిహెచ్‌పీ హార్స్ పవర్, 6,000 ఆర్‌పీఎమ్ వద్ద 11.75 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ని కలిగి ఉంటుంది.
కొత్త రైడర్ ఐగో బైక్ రెడ్ కలర్ అల్లాయ్ వీల్స్‌తో నార్డో గ్రే కలర్ ఆప్షన్‌లో వస్తుంది. బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన ఎల్‌సీడీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ని కలిగి ఉంది. వాయిస్ అసిస్ట్, టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్ నోటిఫికేషన్‌కు మద్దతు ఇస్తుంది.
టీవీఎస్ రైడర్ ఐగో మోటార్‌సైకిల్‌లో ఫ్రంట్ టెలిస్కోపిక్ ఫోర్క్‌లు, వెనుక మోనోషాక్ సస్పెన్షన్ సెటప్ ఆప్షన్ ఉన్నాయి. సేఫ్టీ కోసం ప్రంట్ డిస్క్, వెనుక డ్రమ్ బ్రేక్ కలిగి ఉంది. ఈ బైక్ బరువు 123-కిలోలు, 10-లీటర్ ఇంధన ట్యాంక్‌ను పొందుతుంది.
ఇటీవల టీవీఎస్ రైడర్ 125 బైక్ డ్రమ్ బ్రేక్ వేరియంట్‌ను గ్రాండ్‌గా విడుదల చేశారు. ఇది చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. దీని ధర రూ. 84,469 ఎక్స్-షోరూమ్. ఈ మోటార్ సైకిల్ హ్యాండిల్ బార్ చివర్లలో డ్రమ్ బ్రేక్‌లను కలిగి ఉంటుంది.
భారతీయ మార్కెట్‌లో ఈ టీవీఎస్ రైడర్ 125 మోటార్‌సైకిల్‌కు హీరో ఎక్స్‌ట్రీమ్ 125ఆర్, హోండా షైన్ 125, బజాజ్ పల్సర్ ఎన్125, హీరో గ్లామర్ బైకులకు గట్టి పోటీ ఉంది. ఇప్పుడు కొత్త రైడర్ ఐగో అమ్మకానికి వచ్చింది. ఇది కూడా మంచి అమ్మకాలు సాధించే అవకాశం ఉంది.