MG Air EV India Launch : ఎంజీ మోటార్ నుంచి మరో ఈవీ.. లాంచ్ ఎప్పుడంటే!
30 October 2022, 12:58 IST
- MG Air EV India Launch : ఎంజీ మోటార్ నుంచి మరో ఈవీ వెహికిల్ లాంచ్‌కు సిద్ధంగా ఉంది. ఆ వివరాలు..
ఎంజీ ఎయిర్ ఈవీ.. ఇండియాలో లాంచ్ ఎప్పుడంటే
MG Air EV India Launch : భారత్ ఎలక్ట్రిక్ వెహికిల్ మార్కెట్‌పై అనేక ఆటో సంస్థలు కన్నేశాయి. ఇందుకు తగ్గట్టుగానే దేశంలో కొత్త ఎలక్ట్రిక్ కార్లు దూసుకెళుతున్నాయి. ఇక ఇప్పుడు ప్రముఖ ఆటోమేకర్ ఎంజీ మోటార్.. ఇండియాలో తమ రెండో ఎలక్ట్రిక్ వాహనాన్ని విడుదల చేసేందుకు సన్నద్ధమయ్యింది. సంస్థ నుంచి వస్తున్న అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ వాహనంగా ఇది నిలుస్తుందని సమాచారం. 2023 తొలినాళ్లల్లో ఈ ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేయనున్నట్టు ఎంజీ మోటార్ ప్రకటించింది.
ఎంజీ మోటార్‌కు 'వులింగ్' అనే సిస్టర్ బ్రాండ్ కూడా ఉంది. ఎంజీ ఎయిర్ ఈవీ అనే వాహనాన్ని అంతర్జాతీయ మార్కెట్లో ఈ వులింగ్ విక్రయిస్తోంది. త్వరలో ఇండియా మార్కెట్లోకి లాంచ్ అయ్యే వాహనం ఇదేనని తెలుస్తోంది. ప్రస్తుతానికైతే.. దీనికి ఈ230 అనే కోడ్‌నేమ్ ఇచ్చింది ఎంజీ మోటార్.
MG Air EV : ఈ ఎంజీ ఎయిర్ ఈవీని ఇండోనేషియాలో ఇప్పటికే ఆవిష్కరించారు. ఎంజీ మోటార్.. ఎయిర్ ఈవీ పేరున మార్చి ఇండియాలో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఇక ఇండియా ప్రమాణాలకు, ప్రజల ఆసక్తులకు తగ్గట్టుగానే.. ఈ వాహనంలో మార్పులు చేయోచ్చు. కాగా.. ఇండియా రోడ్లపై ఈ ఎంజీ ఎయిర్ ఈవీ టెస్ట్ డ్రైవ్‌లు కూడా మొదలైపోయాయి.
ఈ ఎంజీ ఎయిర్ ఈవీని జీఎస్ఈవీ(గ్లోబల్ స్మాల్ ఎలక్ట్రిక్ వెహికిల్స్) ప్లాట్‌ఫాంపై నిర్మించనున్నారు. వేసవిలో వేడి నుంచి బ్యాటరీకి రక్షణ కల్పించే విధంగా బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ కూడా ఉండొచ్చు. క్లైమేట్ కంట్రోల్ యూనిట్ కూడా మెరుగ్గా ఉండొచ్చు. ఇది హ్యాచ్‌బ్యాక్ మోడల్లో ఉంటుందని సమాచారం.
MG Air EV features : ఈ ఎంజీ ఎయిర్ ఈవీ చాలా చిన్నగా ఉంటుంది. ఫుల్ విడ్త్ లైట్ బార్, క్రోమ్ స్ట్రిప్‌లు.. వెహికిల్ ముందు భాగంలో కనిపిస్తాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఈ ఈవీకి స్టీల్ వీల్స్ ఉంటాయి. ఇండియా మార్కెట్లో ఎలాయ్ వీల్స్ ఉండొచ్చు.
ఎంజీ ఎయిర్ ఈవీ బ్యాటరీ సామర్థ్యంపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. అయితే.. 20-25కేడబ్ల్యూహెచ్ మధ్యలో బ్యాటరీ కెపాసిటీ ఉంటుందని అంచనాలు ఉన్నాయి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 150కి.మీల దూరం ఇది ప్రయాణించవచ్చు!
ఎంజీ ఎయిర్ ఈవీ పర్ఫార్మెన్స్ను చూస్తే.. నగరాల్లో నివసించే వారికి ఇది ఉపయోగకరంగా ఉంటుందని తెలుస్తోంది.