విదేశీయులు ఈ కంపెనీ కార్లకు పెద్ద ఫ్యాన్స్.. భారత్ నుంచి 30 లక్షల యూనిట్ల ఎగుమతులు!
25 November 2024, 20:00 IST
Maruti Suzuki Cars : మారుతి సుజుకి కార్లకు విదేశీ మార్కెట్లో డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. మారుతి ఇటీవలే విదేశాల్లో 30 లక్షల యూనిట్లకు పైగా ఎగుమతులు పూర్తి చేసింది. ఆ వివరాలపై ఓ లుక్కేద్దాం..
మారుతి సుజుకి ఎగుమతులు
భారతదేశంలోని తమ తయారీ ప్లాంట్ నుండి ఇప్పటివరకు 30 లక్షలకు పైగా యూనిట్లను విదేశీ మార్కెట్లకు రవాణా చేసినట్లు మారుతి సుజుకి ప్రకటించింది. సెలెరియో, ఫ్రాంక్స్, బాలెనో, సియాజ్, డిజైర్, ఎస్-ప్రెస్సో వంటి మోడళ్లతో సహా వివిధ కార్లను ఎగుమతి చేసింది. మెుత్తం 3 మిలియన్ల కార్లను విదేశాలకు పంపింది. ఈ సంస్థ భారతదేశంలో అతిపెద్ద ఆటోమొబైల్ ఎగుమతిదారుగా ఉంది.
మారుతి సుజుకి 1986లో దేశం నుండి తన కార్ మోడళ్లను ఎగుమతి చేయడం ప్రారంభించింది. 500 యూనిట్ల మొదటి మార్క్‌ను యురప్‌లోని హంగేరికి పంపించి చేరుకుంది. ఆ తర్వాత 2012-13 ఆర్థిక సంవత్సరంలో ఎగుమతుల్లో తొలి మైలురాయి రూ.10 లక్షలను కంపెనీ సాధించింది. అదే సమయంలో 2020-21 ఆర్థిక సంవత్సరం వరకు కంపెనీ తదుపరి 10 లక్షల యూనిట్ల ఎగుమతిని సాధించింది. ఎగుమతుల్లో ఇటీవలి 10 లక్షల యూనిట్ల మైలురాయిని దాటింది. దీంతో మెుత్తం 30 లక్షల యూనిట్ల అమ్మకాలు చేసిన మైలురాయిని సాధించింది. కంపెనీ అత్యంత వేగవంతమైన అమ్మకాల గురించి ఇది చెబుతుంది.
మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ ఎండీ, సీఈఓ హిసాషి టెకుచి మాట్లాడుతూ.. 'ప్రోత్సాహక విధానాలను తీసుకువచ్చినందుకు భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నాం. ఎగుమతి వృద్ధిని పెంచే వాణిజ్య ఒప్పందాలను అనుమతించినందుకు ధన్యవాదాలు.' అని తెలిపారు.
దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి అతిపెద్ద వాహన ఎగుమతిదారుగా ఉంది. ఇది ప్రస్తుతం ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికా, మధ్యప్రాచ్యంలోని మార్కెట్లకు రవాణా చేస్తుంది. ముఖ్యంగా దక్షిణాఫ్రికా, సౌదీ అరేబియా, చిలీ వంటి దేశాల్లో సుజుకి బ్యాడ్జ్ కింద మోడళ్లను విక్రయిస్తున్నారు.
గ్రాండ్ విటారా, జిమ్నీ వంటి కంపెనీ కొన్ని కొత్త కార్లను కూడా ఎగుమతి జాబితాలో ఉన్నాయి. కంపెనీ ఇటీవల ఫ్రాంక్స్ క్రాసోవర్ ఎస్‌యూవీని సుజుకి సొంత గడ్డ అయిన జపాన్‌కు కూడా రవాణా చేయడం ప్రారంభించింది. నాలుగేళ్ల క్రితంతో పోలిస్తే భారత్ నుంచి మన ఎగుమతులు మూడు రెట్లు పెరిగాయి. 2030-31 నాటికి వాహనాల ఎగుమతులను 7.5 లక్షల యూనిట్లకు పెంచాలని మారుతి సుజుకి ప్రణాళికలు చేస్తోంది.