33 కి.మీ మైలేజీతో 3.99 లక్షలకే వచ్చే ఈ మారుతి కారుకు విదేశాల్లోనూ క్రేజ్.. భారీగా ఎగుమతులు
Maruti Suzuki Alto K10 : మారుతి సుజుకి కార్లకు ఇండియాలోనే కాదు విదేశాల్లోనూ క్రేజ్ ఎక్కువే ఉంటుంది. మారుతి ఆల్టో కె10 కార్లు ఎగుమతులు భారీగా అవుతూ ఉంటాయి. సెప్టెంబర్ నెలలో సుమారు వెయ్యి శాతం వరకూ పెరుగుదల ఉంది.
మారుతి సుజుకి ఆల్టో కె10 దశాబ్దాలుగా ఫేమస్ కారు. దేశీయ విపణిలో అందుబాటు ధరలో లభిస్తుండడంతో చాలా మంది వినియోగదారులు దీనిపై ఆసక్తి చూపిస్తారు. మన దగ్గరే కాదు.. ఇది భారీ సంఖ్యలో విదేశీయులను కూడా ఆకర్షించింది. అందుకు ఉదాహరణ సెప్టెంబర్ 2024లో విదేశాలకు ఆల్టో కార్లు పెద్దఎత్తున ఎగుమతి అయ్యాయి.
మారుతి సుజుకి ఆల్టో కె10 దాదాపు 442 యూనిట్లు సెప్టెంబర్‌లో ఎగుమతి అయ్యాయి. 2023 అదే కాలంలో ఎగుమతి చేసిన 43 యూనిట్లతో పోలిస్తే సంవత్సరానికి వృద్ధి 927.91 శాతంగా ఉంది. మారుతి సుజుకి ఆల్టో కె10 హ్యాచ్‌బ్యాక్‌లు దేశీయ మార్కెట్‌లోనూ మంచి సంఖ్యలో అమ్ముడవుతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో మొత్తం 8,655 యూనిట్లు, ఆగస్టులో 8,546 యూనిట్లు, జూలైలో 7,353 యూనిట్లు, జూన్‌లో 7,775 యూనిట్లు అమ్ముడయ్యాయి.
సరికొత్త మారుతి ఆల్టో కె10 హ్యాచ్‌బ్యాక్ కొనుగోలు చేయడానికి అందుబాటు ధరలో ఉంది. ఎక్స్-షోరూమ్ ధర కనిష్టంగా రూ.3.99 లక్షలు, గరిష్టంగా రూ.5.96 లక్షలుగా ఉంది. ఇది LXI, VXI, VXI ప్లస్‌తో సహా అనేక వేరియంట్‌లలో దొరుకుతుంది. మెటాలిక్ సిజ్లింగ్ రెడ్, మెటాలిక్ గ్రానైట్ గ్రేతో సహా అనేక రంగులలో లభిస్తుంది.
ఈ ఆల్టో కె10 చిన్న హ్యాచ్‌బ్యాక్ అయినప్పటికీ 4 నుండి 5 మంది సుదూర ప్రయాణాలకు హాయిగా వెళ్లవచ్చు. అంతేకాదు 214-లీటర్ సామర్థ్యం గల బూట్ స్పేస్‌ను కలిగి ఉంది. ఇది పట్టణ ప్రాంతాల్లో మరింత అనుకూలంగా ఉంటుంది. సులభంగా పార్క్ చేసేందుకు అవకాశం ఉంటుంది.
కొత్త మారుతి సుజుకి ఆల్టో కె10 పెట్రోల్, సీఎన్జీ ఇంజన్ ఎంపికలతో వస్తుంది. ఇందులో 5-స్పీడ్ మాన్యువల్/ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉంటుంది. పెట్రోల్ మాన్యువల్ లీటరుకు 27.39 కి.మీ, ఆటోమేటిక్ వేరియంట్ లీటరు పెట్రోల్‌కు 27.90 కి.మీ మైలేజీని అందిస్తుంది. సీఎన్జీ చూసుకుంటే అధిక మైలేజీని అందిస్తుంది. కిలో సీఎన్జీకి 33.85 కిలో మీటర్ల మైలేజీ అందిస్తుంది. అందుకే దీనికి క్రేజ్ కూడా ఎక్కువే ఉంది.
కొత్త ఆల్టో కె10 హ్యాచ్‌బ్యాక్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, కీలెస్ ఎంట్రీ వంటి వివిధ ఫీచర్లతో వస్తుంది. ప్రయాణికుల సేఫ్టీ కోసం ఇందులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, రివర్సింగ్ కెమెరా ఉన్నాయి. దేశీయ మార్కెట్లో చాలా కార్లు ఉన్నా.. మారుతి సుజుకి ఆల్టో కె10కు మాత్రం సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఒక దశలో అమ్మకాలు తగ్గినా.. తర్వాత మెల్లగా పైకి లేచింది.