Market Outlook in 2024: వచ్చే సంవత్సరం ఇన్వెస్టర్లు దృష్టి పెట్టాల్సిన 5 సెక్టార్లు ఇవే..
22 December 2023, 15:17 IST
Market Outlook in 2024: ఓమ్నిసైన్స్ క్యాపిటల్ శుక్రవారం ‘‘2024 మార్కెట్ ఔట్‌లుక్’’ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికలో భారత ఆర్థిక వ్యవస్థలోని కీలక రంగాలను హైలైట్ చేసింది. ముఖ్యంగా, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్‌లో రూ. 100 లక్షల కోట్ల వృద్ధికి అవకాశం ఉంటుందని నివేదిక అంచనా వేసింది.
ప్రతీకాత్మక చిత్రం
Market Outlook in 2024: అంచనాలను అధిగమించి, ఈ సంవత్సరం భారతీయ మార్కెట్ అసాధారణ పనితీరును కనబరిచింది. ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాలలో ముఖ్యమైన ప్రాజెక్ట్‌లు ప్రారంభమయ్యాయి. ఈ సంవత్సరం మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్‌లలో అద్భుతమైన ర్యాలీ కొనసాగింది. అలాగే, చారిత్రాత్మక సంఖ్యలో IPO లు వచ్చాయి. మొత్తంమీద, ఈ సంవత్సరంలో ఇప్పటివరకు నిఫ్టీ 50 17.40%, BSE సెన్సెక్స్ 16.48% లాభపడ్డాయి.
2024 లో పరిస్థితి ఏంటి?
2023 ముగుస్తున్నందున, పెట్టుబడిదారులు 2024 పై దృష్టి పెడ్తున్నారు. 2024 లో అత్యధిక వృద్ధికి అవకాశమున్న రంగాలను అణ్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో, రిజిస్టర్డ్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్ అయిన ఓమ్నిసైన్స్ క్యాపిటల్ తాజాగా, 2024 మార్కెట్ ఔట్‌లుక్ నివేదికను విడుదల చేసింది. 2024ను శాసించగల కీలక రంగాలపై ఈ నివేదిక విశ్లేషణ చేసింది. వచ్చే సంవత్సరం ఏయే రంగాల్లో ఏయే మార్పులు చోటు చేసుకోనున్నాయో వివరించింది.
Banking and Finance: బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్
బ్యాంకింగ్‌లో రూ. 100 లక్షల కోట్ల అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. ఫిన్‌టెక్, చెల్లింపులు, రేటింగ్ ఏజెన్సీలు, డిజిటల్ బ్యాంకింగ్, ఎక్స్ఛేంజ్ సిస్టమ్‌లు, HFC, NBCలలో పెట్టుబడుల ద్వారా ఈ ఈ వృద్ధి సాధ్యమవుతుంది.
Digital Transformation: డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్
డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ రానున్న మరికొన్ని సంవత్సరాల పాటు కొనసాగుతుంది. ఈ రంగంలో కృత్రిమ మేథ (AI), క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, 5G ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, మెటావర్స్ అభివృద్ధి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బ్లాక్‌చెయిన్ మొదలైనవి ప్రధానమైనవి.
Power and Energy: పవర్ అండ్ ఎనర్జీ
భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో ఈ సెక్టార్ మరొక ప్రధానమైన చోదక శక్తిగా నిలుస్తుంది. పవర్ అండ్ ఎనర్జీ సెక్టార్ లో, 2030 నాటికి విద్యుత్ వినియోగం 4 ట్రిలియన్ యూనిట్లకు చేరుతుంది. ఈ సెక్టార్ సీఏజీఆర్ (compound annual growth rate CAGR) 13 శాతానికి చేరుతుంది. ఈ సెక్టార్లో ఇన్వెస్ట్ చేయడానికి క్లీన్ ఎనర్జీ, జనరేషన్ అండ్ ట్రాన్స్‌మిషన్, సోలార్/హైడ్రో, రిసోర్స్ అండ్ ఎక్విప్‌మెంట్ తయారీ, ట్రేడింగ్ & ఎక్స్ఛేంజ్ ల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు.
Railway Infrastructure: రైల్వే మౌలిక వసతులు
8 హై స్పీడ్ బుల్లెట్ రైళ్ల కొనుగోలు, 1,300 కంటే ఎక్కువ స్టేషన్ల అభివృద్ధితో సహా వివిధ ప్రాజెక్టులతో రాబోయే సంవత్సరాల్లో రైల్వే మౌలిక సదుపాయాలను కొత్త స్థాయికి పెంచాలని భారతదేశం యోచిస్తోంది. వచ్చే ఐదేళ్లలో 400 వందే భారత్ రైళ్లు, 3000 కొత్త ప్యాసింజర్ రైళ్లను కూడా ప్రారంభించాలని భావిస్తోంది. మరోవైపు, డెడికేటెడ్ ఫ్రీట్ కారిడార్ ను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని భావిస్తోంది. దేశంలోని మొత్తం సరుకు రవాణాలో 45% రైల్ రవాణా ద్వారా జరగాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ రైల్వే ప్రాజెక్టుల్లో మొత్తం రూ. 50 లక్షల కోట్ల మూలధన వ్యయం (CAPEX) జరుగుతుంది.
Defence Sector: రక్షణ రంగం
2023 సంవత్సరంలో రక్షణ రంగంలో భారత్ 81 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. ఇది ప్రపంచంలో 4వ అత్యధిక వ్యయం. 84 దేశాలకు భారత్ రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. జలాంతర్గాములు, టార్పెడోలు, విమాన వాహక నౌకలను కొనుగోలు చేయనుంది. ఫైటర్ జెట్‌లు, క్షిపణులు, 2 డిఫెన్స్ కారిడార్లు, 150 రక్షణ వ్యవస్థలు, రాడార్ సిస్టమ్‌లలో దేశీయంగా 70% ఉత్పత్తి చేయనుంది.