ఈ యాప్‌తో సంపాదనలో 100 శాతం డ్రైవర్లకే.. తక్కువ ధరకే ప్రయాణికులకు క్యాబ్ బుకింగ్!
02 September 2024, 22:27 IST
- Mana Yatri App : హైదరాబాద్‌కు చెందిన క్యాబ్, ఆటో బుకింగ్ యాప్ మన యాత్రి ప్రాచుర్యం పొందుతోంది. పీపుల్ ఫస్ట్ విధానంతో మన యాత్రి 35,000 ఆటోలు, 25,000 క్యాబ్ సర్వీసులతో కనెక్ట్ అయి ఉంది. అయితే ఈ యాప్ ఇటు ప్రయాణికులకు, అటు డ్రైవర్లకు మేలు చేస్తుంది.
మన యాత్రి యాప్
మన యాత్రి క్యాబ్ బుకింగ్ యాప్ హైదరాబాద్‌లో విస్తరిస్తోంది. ఆటోలకు సగటున 30 సెకన్లు, క్యాబ్ లకు 40 సెకన్ల సమయంతో వేగవంతమైన బుకింగ్‌లను అందిస్తున్నట్టుగా తెలిపింది. ప్రభుత్వ మద్దతుతో టి-హబ్, ఓఎన్డీసీలో భాగమైన మన యాత్రి.. నమ్మయాత్రి అనే యాప్ సంస్థకు చెందినది.
ఇతర యాప్‌లతో పోలిస్తే మన యాత్రిలో తక్కువ డ్రైవర్ క్యాన్సిలేషన్ రేట్లు, మెరుగైన సర్వీస్ క్వాలిటీ ఉన్నాయి. జీరో కమీషన్ మోడల్లో పనిచేసే ఈ యాప్‌తో డ్రైవర్లు తమ సంపాదనలో 100 శాతం తమవద్దే ఉంచుకోవచ్చు. ఇది వారికి ఆర్థికంగా ప్రయోజనం చేకూర్చడమే కాకుండా, తక్కువ క్యాన్సిలేషన్ల లాంటి మెరుగైన సేవలను అందిస్తోంది.
ఈ సందర్భంగా టి-హబ్ సీఈఓ మహంకాళి శ్రీనివాసరావు మాట్లాడుతూ, 'మన యాత్రి విధానం హైదరాబాద్‌లో మొబిలిటీని చూసే విధానంలో గణనీయమైన మార్పును సూచిస్తుంది. ప్రయాణికులకు, డ్రైవర్లకు ప్రయోజనం చేకూర్చే నమూనాను రూపొందించేందుకు తెలంగాణ ఇన్నోవేషన్ సెంటర్ టీ-హబ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. బుకింగ్ ఆలస్యాలు, క్యాన్సిలేషన్లను తగ్గిస్తోంది.' అని చెప్పారు.
ప్రయాణ ఖర్చులను తగ్గించి, మెరుగైన సేవలను అందించడానికి యాప్‌కు సానుకూల ఫీడ్ బ్యాక్ వస్తోంది. 28 ఏళ్ల సాఫ్ట్ వేర్ ఉద్యోగిని మౌనిక మాట్లాడుతూ.. 'క్యాబ్‌ల విషయంలో నాకు బాగా నచ్చినది మనయాత్రి యాప్. ఇతర యాప్‌లతో పోలిస్తే ధరలు చౌకగా ఉంటాయి. డ్రైవర్లు మొత్తం డబ్బులు తీసుకుంటున్నందుకు సంతోషంగా ఉంటారు. బుకింగ్స్ త్వరగా బుకింగ్ కావడం, తక్కువ క్యాన్సిలేషన్ల వల్ల ప్రయాణాల్లో ఒత్తిడి తగ్గుతోంది.' అని అన్నారు.
'మనయాత్రి అనేది మన యాప్. కమీషన్ కట్‌లు ఏమీ లేకపోవడంతో నేను సంపాదించే ప్రతీ రూపాయి నాకే వస్తుంది.' అని మియాపూర్‌కు చెందిన రాజు నాయక్ అనే క్యాబ్ డ్రైవర్ చెప్పారు.