ITR Filing Extension : ఐటీఆర్ ఫైలింగ్ తేదీని పొడిగించారా? ఇందులో నిజమెంత?
31 July 2024, 19:00 IST
- ITR Filing 2024 Fact Check : ఐటీఆర్ ఫైలింగ్‌కు జులై 31 చివరి తేదీ. అయితే ఐటీఆర్ ఫైలింగ్ తేదీ పొడిగించారని వార్తలు వస్తున్నాయి. నిజంగానే ఆదాయపు పన్ను రిటర్న్ గడువు పొడిగించారా?
ఐటీఆర్ ఫైలింగ్ చివరి తేదీ
ఆదాయపు పన్ను రిటర్నుల(ITR) 2024 సమర్పణ తేదీని పొడిగించినట్లు వార్తలు వస్తున్నాయి. జులై 31తో ఐటీఆర్ ఫైలింగ్ చివరి తేదీగా ఉంది. ఆదాయపు పన్ను రిటర్న్‌ల సమర్పణ గడువును పొడిగించాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. నిజంగానే తేదీని పొడిగించారా? కాదా అనే సమాచారం కచ్చితంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.
2023-24 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి జులై 31 చివరి రోజు. పెనాల్టీని నివారించడానికి పన్ను చెల్లింపుదారులు రాత్రిలోగా తమ ఐటీఆర్‌ను ఫైల్ చేయాలి. అయితే కొన్ని రోజుల క్రితం గుజరాత్‌లోని ఒక వార్తాపత్రిక చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐటీఆర్ దాఖలు చేయడానికి చివరి తేదీని పొడిగించడం గురించి అందులో ఉంది. ఇప్పుడు అదే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ స్పందించింది. అది నకిలీదని ప్రకటించింది.
సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నప్పటికీ ఆదాయపు పన్ను శాఖ ఇచ్చిన గడువు పొడిగింపుపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇదే విషయాన్ని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ఐటీఆర్ జులై 31 వరకే ఉంది. ఇది మిస్ అయితే తర్వాత నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరూ నడుచుకోవాల్సిందే.
అంటే పెనాల్టీలను నివారించడానికి మీరు జులై 31లోపు ఐటీ రిటర్న్‌లను ఫైల్ చేయాలి. అనివార్యమై అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప పన్ను శాఖ ఐటీఆర్ ఫైలింగ్ గడువును పొడిగించే అవకాశం లేదు. ఈసారి ఐటీఆర్ గడువు తేదీ పెంచే అవకాశమే లేదు అని మెుదటి నుంచి వార్తలు వస్తున్నాయి.
ఫైలింగ్ ప్రక్రియలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యల కారణంగా గడువు సమీపిస్తున్న కొద్దీ సాధారణంగా గడువు పొడిగింపుల డిమాండ్లు తలెత్తుతాయని ఆర్థిక నిపుణులు అంటున్నారు. గడువును పొడిగించడం పన్ను రిటర్న్‌ల ప్రాసెసింగ్‌తో సహా మొత్తం ప్రక్రియపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
ఆలస్యంగా దాఖలు చేసినందుకు జరిమానాను నివారించడానికి పన్ను చెల్లింపుదారులు తమ ఐటీఆర్ దాఖలును జూలై 31 గడువులోగా పూర్తి చేయాలని ఐటీ శాఖ కోరింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటివరకు దాదాపు 6 కోట్ల ఐటీఆర్‌లు దాఖలయ్యాయి. ప్రతి ముగ్గురిలో ఇద్దరు అంటే.. సుమారు డెబ్బై శాతం మంది కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్నారని తెలుస్తోంది.