Infosys Q3 Earnings: ఇన్ఫోసిస్ క్యూ 3 నికర లాభాలు 6,106 కోట్లు..
11 January 2024, 18:32 IST
Infosys Q3 earnings: ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (Q3FY24) ఫలితాలను ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ గురువారం విడుదల చేసింది. ఈ క్యూ 3 లో సంస్థ నికర లాభం రూ. 6,106 కోట్లను నమోదు చేసింది. ఇది క్రితం సంవత్సరం క్యూ 3 తో పోలిస్తే 7 శాతం తగ్గింది.
ప్రతీకాత్మక చిత్రం
Infosys Q3 earnings: 2024 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (Q3FY24) లో ఇన్ఫోసిస్ (Infosys) పన్ను అనంతర లాభాలు (PAT) 7 శాతం క్షీణించి రూ. 6,106 కోట్లకు చేరాయి. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ డిసెంబర్ త్రైమాసికం (Q3FY24) ఫలితాలను జనవరి 11న ప్రకటించింది. కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.6,586 కోట్ల నుంచి 7 శాతం తగ్గి రూ.6,106 కోట్లుగా నమోదైంది. కన్సాలిడేటెడ్ ఆదాయం రూ.38,318 కోట్ల నుంచి 1.3 శాతం పెరిగి రూ.38,821 కోట్లకు చేరింది.
నిరాశాజనకం..
ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (Q2FY24) లో ఇన్ఫోసిస్ (Infosys) రూ. 6,212 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. కానీ, ఈ క్యూ 3 (Q3FY24) కి వచ్చేసరికి సంస్థ నికర లాభాలు 1.7% తగ్గి, రూ. .6,106 కోట్లకు చేరుకున్నాయి. క్యూ 2 లో సంస్థ ఆదాయం రూ .38,994 కోట్లు కాగా, క్యూ 3 లో అది 0.4 శాతం తగ్గి, రూ. 38,821 కోట్లకు చేరింది. క్యూ 3 ఫలితాల నేపథ్యంలో 2024 ఆర్థిక సంవత్సరం సంస్థ ఆదాయ అంచనాలను 1-2.5 శాతం నుంచి 1.5-2.0 శాతానికి సవరించింది. అదే సమయంలో ఆపరేటింగ్ మార్జిన్ గైడెన్స్ ను 20-22 శాతం వద్ద యథాతథంగా ఉంచింది. ఈ క్యూ 3 లో బేసిక్ ఈపీఎస్ నికర లాభం 6.1 శాతం క్షీణతతో రూ.14.76 వద్ద ముగిసింది. అలాగే ఇన్ఫోసిస్ ఫ్రీ క్యాష్ ఫ్లో (ఎఫ్సీఎఫ్) 17 శాతం పెరిగి రూ.5,548 కోట్లకు చేరింది.
ఐటి సేవలకు డిమాండ్
సవాళ్లతో కూడిన వాతావరణం ఉన్నప్పటికీ 'ప్రాజెక్ట్ మాక్సిమస్' కింద మెరుగైన కార్యాచరణతో ఉత్తమ ఫలితాలను సాధించామని ఇన్ఫోసిస్ ప్రకటించింది. ఊహించని విధంగా అధిక ద్రవ్యోల్బణం కారణంగా ఐటి సేవల డిమాండ్లో కొనసాగుతున్న బలహీనత తీవ్రతరం కావడంతో మొత్తం భారత ఐటి రంగం 2024 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో తక్కువ రాబడులను నివేదించవచ్చని భావిస్తున్నారు.
మొత్తం 9 నెలల్లో..
ఈ ఆర్థిక సంవత్సరంలో 2023 డిసెంబర్ 31తో ముగిసిన తొమ్మిది నెలల కాలానికి ఇన్ఫోసిస్ నికర లాభం రూ.18,264 కోట్లకు చేరుకుంది. ఆదాయం రూ.1,15,748 కోట్లకు చేరింది. కాగా, బీఎస్ ఈ లో ఇన్ఫోసిస్ షేర్ విలువ గురువారం 1.62 శాతం నష్టంతో రూ.1,495 వద్ద ముగిసింది. ఈ ఐటీ స్టాక్ గత ఆరు నెలల్లో 12 శాతం లాభపడగా, గత ఏడాదిలో కేవలం 1 శాతం మాత్రమే లాభపడింది.