IndiGo flights: త్వరలో బిజీ రూట్లలో బిజినెస్ క్లాస్ ను ప్రవేశపెట్టనున్న ఇండిగో ఎయిర్ లైన్స్
Published May 23, 2024 07:45 PM IST
- Business class in IndiGo flights: ప్రస్తుతం ఎకానమీ క్లాస్ తో పలు మార్గాల్లో 360కి పైగా విమానాలను నడుపుతున్న ఇండిగో ఇకపై భారత్ లో అత్యంత రద్దీగా ఉండే మార్గాల్లో బిజినెస్ క్లాస్ ను ప్రారంభించాలని నిర్ణయించింది.
త్వరలో ఇండిగోలో బిజినెస్ క్లాస్
Business class in IndiGo flights: భారతదేశపు అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో. ప్రయాణికులకు మరిన్ని సేవలను అందించడానికి ఈ సంవత్సరం తన విమానాలలో బిజినెస్ క్లాస్ (Business class in IndiGo flights) సీటింగ్ ను ప్రవేశపెట్టనున్నట్లు గురువారం ప్రకటించింది. ఎయిర్ లైన్స్ 18వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టులో 'టైలర్ మేడ్ బిజినెస్ ప్రొడక్ట్ 'ను ఆవిష్కరించనుంది.
ఇండిగో అదిరిపోయే లాభాలు
ఇండిగో ఎయిర్లైన్స్ (IndiGo) ఆపరేటర్ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ 2023 -24 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలను ఆర్జించింది. ఇండిగో ఎయిర్లైన్స్ క్యూ4 స్టాండలోన్ లాభం సంవత్సరానికి రెట్టింపు అయి 18.94 బిలియన్ రూపాయలకు (227.6 మిలియన్ డాలర్లు) చేరుకుంది. ఇది సగటు విశ్లేషకుల అంచనా 17.17 బిలియన్ రూపాయల కంటే ఎక్కువ. అలాగే, ఇండిగో ఇటీవల 30 వైడ్-బాడీ విమానాలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రకటన వచ్చింది. ‘‘భారతదేశంలో బిజినెస్ ట్రావెల్ ను పునర్నిర్వచించడానికి, భారతీయులు అత్యంత ఇష్టపడే విమానయాన సంస్థ ఇండిగో భారతదేశంలోని అత్యంత రద్దీ మార్గాల కోసం తగిన బిజినెస్ ప్రొడక్ట్ ను ప్రారంభించే ప్రణాళికను ప్రకటించింది" అని ఇండిగో గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.
360 విమానాలతో..
ప్రస్తుతం ఇండిగో ఎయిర్ లైన్స్ దేశవ్యాప్తంగా 360 కి పైగా విమానాలను నడుపుతుంది. ఇది రోజుకు 2,000 విమానాలలో ఎకానమీ క్లాస్ ను మాత్రమే అందిస్తుంది. మార్కెట్ విలువ ప్రకారం ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఎయిర్ లైన్స్ సంస్థ ఇండిగో. బిజినెస్ క్లాస్ లో ట్రావెల్ చేయాలనుకునేవారికిి అందుబాటు ధరలో ఆ అవకాశం కల్పించనున్నట్లు తెలిపింది. తొలి దశలో భారత్ లో అత్యంత రద్దీగా ఉండే మార్గాల్లో ఈ ఏడాది చివరి నాటికి ఈ బిజినెస్ క్లాస్ ను అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించింది. ఈ ఆగస్టులో, ఇండిగో వార్షికోత్సవం సందర్భంగా, లాంచ్ తేదీ, మార్గాలకు సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడిస్తామని తెలిపింది.