Smartphones: స్మార్ట్ ఫోన్స్ మార్కెట్లో భారత్ రికార్డుల జోరు; చైనా తరువాత మనమే..-smartphones now fourth largest export item from india ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Smartphones: స్మార్ట్ ఫోన్స్ మార్కెట్లో భారత్ రికార్డుల జోరు; చైనా తరువాత మనమే..

Smartphones: స్మార్ట్ ఫోన్స్ మార్కెట్లో భారత్ రికార్డుల జోరు; చైనా తరువాత మనమే..

HT Telugu Desk HT Telugu
May 23, 2024 12:08 PM IST

భారత దేశం నుంచి ఎగుమతి అవుతున్న వస్తువుల్లో స్మార్ట్ ఫోన్స్ నాలుగో స్థానానికి చేరుకున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఈ రంగం 42% వృద్ధి సాధించింది. మొత్తంగా ఆ సంవత్సరం 15.6 బిలియన్ డాలర్ల విలువైన స్మార్ట్ ఫోన్స్ ను భారత్ ఎగుమతి చేసింది. ముఖ్యంగా యూఎస్, యూఏఈ, నెదర్లాండ్స్, యూకేలకు ఎగుమతులు పెరిగాయి.

స్మార్ట్ ఫోన్స్ ఎగుమతుల్లో భారత్ రికార్డు
స్మార్ట్ ఫోన్స్ ఎగుమతుల్లో భారత్ రికార్డు

Smartphones: బిజినెస్ స్టాండర్డ్ నివేదిక ప్రకారం, 2024 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ స్మార్ట్ ఫోన్ల ఎగుమతి రంగం 42 శాతం వృద్ధిని సాధించి, 15.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది. 2022 ఏప్రిల్ నుంచి స్మార్ట్ ఫోన్ల ఎగుమతి డేటాను ప్రత్యేకంగా ట్రాక్ చేయడం ప్రారంభించారు. భారతదేశ ఎగుమతుల్లో, విలువ పరంగా పెట్రోలియం ఉత్పత్తులే ప్రధమ స్థానంలో ఉన్నాయి.

యూఎస్ కే ఎక్కువ..

ఇండియా (India) నుంచి స్మార్ట్ ఫోన్స్ ప్రధానంగా అమెరికాకు ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో భారత్ అమెరికాకు 5.6 బిలియన్ డాలర్ల విలువైన స్మార్ట్ ఫోన్స్ ను ఎగుమతి చేసింది. ఇది అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే, సంవత్సరానికి 158 శాతం పెరుగుదల అని వాణిజ్య శాఖ డేటా వెల్లడించింది. ఆ తర్వాతి స్థానాల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, యూకే ఉన్నాయి. భారత్ నుంచి యూఏఈకి 2.6 బిలియన్ డాలర్ల విలువైన స్మార్ట్ ఫోన్లు, నెదర్లాండ్స్ కు 1.2 బిలియన్ డాలర్ల విలువైన స్మార్ట్ ఫోన్స్ (smart phones), యూకే కు 1.1 బిలియన్ డాలర్ల విలువైన స్మార్ట్ ఫోనలు ఎగుమతి అయ్యాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో భారత్ లో, ఎగుమతి అవసరాలకు, దేశీయ అవసరాలకు కలిపి మొత్తంగా రూ. 4.1 లక్షల కోట్ల (49.16 బిలియన్ డాలర్లు) మొబైల్స్ ఉత్పత్తి అయ్యాయి.

పీఎల్ఐ పథకం ప్రభావమే..

ఈ రంగానికి ప్రభుత్వం అమలు చేసిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకం వల్లనే ఈ వృద్ధి సాధ్యమైంది. పీఎల్ఐ వల్ల స్మార్ట్ ఫోన్ల ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలోనే రెండో స్థానానికి చేరుకుంది. తొలి స్థానంలో చైనా ఉంది. చైనాతో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా అమెరికా తన స్మార్ట్ ఫోన్ మార్కెట్ కార్యకలాపాలను భారతదేశాన్ని కేంద్రంగా మార్చుకోవాలనుకుంది. మరోవైపు, చైనాలో ఉత్పత్తి చేసే కంపెనీలను, భారత్ లో పెట్టుబడులు పెట్టేలా ఆకర్షించడానికి ఉద్దేశించిన చైనా-ప్లస్-వన్ వ్యూహంలో కూడా ఈ పథకం కీలక పాత్ర పోషించింది. పీఎల్ఐ పథకం కింద అర్హత కలిగిన సంస్థలలో ఫాక్స్కాన్ (Foxconn), విస్ట్రాన్ ఇండియా (ఇప్పుడు టాటా ఎలక్ట్రానిక్స్), పెగాట్రాన్, శామ్సంగ్ (samsung) మొదలైనవి ఉన్నాయి.

ఆపిల్ తొలి స్థానంలో..

భారత్ నుంచి ఎగుమతి అవుతున్న స్మార్ట్ ఫోన్స్ బ్రాండ్స్ లో ఆపిల్ ప్రథమ స్థానంలో ఉంది. ఆపిల్ (apple) సంస్థ అవుట్ బౌండ్ మొబైల్ పరికరాల ఎగుమతుల విలువ 2024 ఆర్థిక సంవత్సరంలో రూ .1.2 ట్రిలియన్లు (14.39 బిలియన్ డాలర్లు) దాటుతుందని భావిస్తున్నారు. ఇది 2023 ఆర్థిక సంవత్సరంలో రూ .90,000 కోట్ల నుండి 33 శాతం అధికం. 2023 ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు 25 శాతంగా ఉండగా, 2024 ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు దాదాపు 30 శాతానికి పెరిగాయని ప్రారంభ అంచనాలు సూచిస్తున్నాయి.

Whats_app_banner