ITR Refund : పాన్-ఆధార్ లింక్ లేక ఐటీఆర్ రిఫండ్ ఆగిపోయిందా? అయితే ఏం చేయాలి?
20 August 2024, 7:26 IST
- ITR Refund : పాన్-ఆధార్ లింక్ లేకపోవడం వల్ల చాలా రిఫండ్ క్లెయిమ్లు నిలిచిపోయాయి. అటువంటి పరిస్థితిలో డిపార్ట్‌మెంట్‌లో ఈ రిఫండ్ క్లెయిమ్‌లను వెరిఫికేషన్ ప్రక్రియలో ఉంచింది. ఇలా జరిగింతే ఏం చేయాలనే ప్రశ్న సహజంగానే ఉంటుంది. ఏమేం చేయాలో ఇక్కడ తెలుసుకోండి..
ఐటీఆర్ రిఫండ్
ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేసిన చాలా కాలం తర్వాత కూడా రిఫండ్ రాకపోతే, మీరు ఆదాయపు పన్ను శాఖ ఇ-ఫైలింగ్ పోర్టల్‌ను సందర్శించడం ద్వారా రిఫండ్ స్థితిని తనిఖీ చేయాలి. అలాగే మీ పాన్ కార్డు ఆధార్ నెంబర్‌తో లింక్ అయిందో లేదో చెక్ చేసుకోండి. పాన్-ఆధార్ లింక్ లేకపోవడం వల్ల చాలా రిఫండ్ క్లెయిమ్‌లు నిలిచిపోయాయని ఆదాయపు పన్ను శాఖ చెబుతోంది. అటువంటి పరిస్థితిలో, డిపార్ట్‌మెంట్ ఈ రీఫండ్ క్లెయిమ్‌లను వెరిఫికేషన్ ప్రక్రియలో ఉంచింది.
ఈ-ఫైలింగ్ పోర్టల్లోని సర్వీస్ కాలమ్‌కు వెళ్లి 'నౌ యువర్ రిఫండ్'పై క్లిక్ చేయడం ద్వారా ఆదాయపు పన్ను చెల్లింపుదారుడు మొత్తం స్థితిని చూడవచ్చు. ఏదైనా సాంకేతిక కారణాల వల్ల రిఫండ్ ఆగిపోతే అది స్పష్టంగా చెబుతారు. పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయకపోవడం, బ్యాంకు ఖాతాను అప్ డేట్ చేయకపోవడం వంటి అనేక కారణాల వల్ల రిఫండ్స్ పొందడంలో జాప్యం జరుగుతోంది. పాన్‌తో ఆధార్ లింక్ చేయకపోతే ముందుగా ఆన్‌లైన్ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఈసారి చాలా మంది రిఫండ్స్ గురించి ఫిర్యాదు చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో రిఫండ్స్ త్వరగా అందుతున్నాయి. కానీ ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసి ఒకటి, రెండు నెలలు గడిచినా రిఫండ్స్ అందని సందర్భాలు చాలానే ఉన్నాయి. దీనిపై ప్రజలు కూడా సోషల్ మీడియాలో ఫిర్యాదులు చేస్తున్నారు. సరైన సమయంలో పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేయకపోవడం కూడా పెద్ద కారణం అని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు సకాలంలో రిఫండ్ రాకపోతే అపరాధ రుసుము చెల్లించి ఆధార్‌ను పాన్‌తో లింక్ చేస్తున్నారు.
పాన్‌ను ఆధార్‌తో లింక్ చేసే గడువును ఆదాయపు పన్ను శాఖ పలుమార్లు పొడిగించింది. చివరి తేదీ ముగియడంతో ఇప్పుడు ఈ పనికి వెయ్యి రూపాయల రుసుమును ఆ శాఖ నిర్ణయించింది. ప్రస్తుతం జూలై 1, 2017కు ముందు జారీ చేసిన అన్ని పాన్ కార్డులను ఆధార్‌తో లింక్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత జారీ చేసిన పాన్ కార్డును మినహాయింపు పరిధిలో ఉంచారు.
రిఫండ్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి
ఆదాయపు పన్ను శాఖ పోర్టల్ www.incometax.gov.in కు వెళ్లండి. యూజర్ ఐడీ (పాన్ నెంబర్), పాస్వర్డ్ ఎంటర్ చేసి, లాగిన్ అవ్వాలి.
మై అకౌంట్‌పై క్లిక్ చేసి రిఫండ్/డిమాండ్ స్టేటస్ ఓపెన్ చేయాలి. ఇక్కడ ఆదాయపు పన్ను రిటర్నులను ఎంచుకోండి.
ఇప్పుడు రసీదు నెంబరుపై క్లిక్ చేయండి. దీని తరువాత, కొత్త పేజీ ఓపెన్ అవుతుంది, అక్కడ ఐటీఆర్‌కు సంబంధించిన మొత్తం సమాచారం కనిపిస్తుంది.
ఆలస్యమైతే ఏం చేయాలి
ముందుగా మీ ఈ-మెయిల్ చెక్ చేసుకోండి. ఆదాయపు పన్ను శాఖ రిఫండ్ లేదా ఏదైనా అదనపు సమాచారం లేదా నోటీసును ఇ-మెయిల్ ద్వారా పంపుతుంది.
రిఫండ్ క్లెయిమ్ తిరస్కరించబడిందని ఐటీఆర్ స్థితి చూపిస్తే, పన్ను చెల్లింపుదారుడు తిరిగి రిఫండ్ జారీ చేయమని అభ్యర్థించవచ్చు.
స్టేటస్‌లో క్లెయిమ్ పెండింగ్‌లో ఉంటే, మీరు ఇ-ఫైలింగ్ పోర్టల్ / మదింపు అధికారిని సంప్రదించవచ్చు. దానిని త్వరగా పరిష్కరించాలని అభ్యర్థించవచ్చు.
1800-103-4455కు కాల్ చేయడం ద్వారా లేదా ask@incometax.gov.in ఇమెయిల్ చేయడం ద్వారా ఆదాయపు పన్ను శాఖ హెల్ప్‌లైన్‌ను సంప్రదించవచ్చు. వారు మీ రిఫండ్ స్థితికి సహాయపడగలరు.
ఆలస్యం కొనసాగితే రిఫండ్ స్థితి గురించి తెలుసుకోవడానికి నేరుగా స్థానిక ఆదాయపు పన్ను కార్యాలయానికి వెళ్లవచ్చు. మీకు సంబంధించిన అవసరమైన డాక్యుమెంట్లను తప్పకుండా తీసుకెళ్లండి.
టాపిక్