Karimnagar Election Fight : పరస్పరం ఫిర్యాదులు, నేతలపై కేసులు - కరీంనగర్ లో మరింత హీటెక్కిన రాజకీయం..!
Karimnagar Lok Sabha Election 2024: పార్లమెంట్ ఎన్నికల వేళ కరీంనగర్ రాజకీయం హాట్ హాట్ గా సాగుతుంది. బరిలో ఉన్న నేతల ఫిర్యాదులతో పలువురిపై పోలీసు కేసులు నమోదయ్యాయి.
Karimnagar Lok Sabha Election Fight 2024 : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. పోలింగ్ కు గడువు దగ్గరపడుతుండడంతో ముఖ్యనేతల సుడిగాలి పర్యటనలతో ప్రచారం ముమ్మరం చేశారు. నేతల మద్య మాటల యుద్దం సాగిస్తున్నారు. పరస్పరం విమర్శలు ఆరోపణలతో ఠాణా మెట్లు ఎక్కేవరకు చేరింది.
కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో(Karimnagar Lok Sabha constituency) కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్(Velichala Rajendar) రావుతోపాటు బిఆర్ఎస్ కు చెందిన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Kaushik Reddy)పై కేసులు నమోదు అయ్యాయి. బిజేపి అభ్యర్థి బండి సంజయ్ పై ఇండిపెండెంట్ అభ్యర్థి మానస రెడ్డి పోలీసులకు పిర్యాదు చేశారు.
వెలిచాల రాజేందర్ రావుపై ఎఫ్ఐఆర్ నమోదు
కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు(Velichala Rajendar) తన సొంత ఫేస్ బుక్ ఐడీ నుంచి బిజేపి ఎంపి అభ్యర్థి సంజయ్ కుమార్(Bandi Sanjay) ను నిందిస్తూ పరువు పోయేలా తప్పుడు ప్రచారం చేస్తున్నాడని అతని పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని బిజేపికి చెందిన సీనియర్ నాయకులు కొట్టె మురళీకృష్ణ టూటౌ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.
బండి సంజయ్ గ్యారెంటీలు కాదు మోసాలు.. ఆయనకు ఓటు వేస్తే మత విద్వేషాలను రెచ్చగొడుతూ ప్రజల మధ్య చిచ్చు పెడుతాడని హిందూ ముస్లిం పేరుతో మరో ఐదేళ్లు పబ్బం గడుపుతాడని సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి బండి సంజయ్ పై అసత్యపు ప్రచారం చేస్తు పార్టీ ప్రతిష్టలు దెబ్బతినేలా పోస్ట్ లు పెడుతున్న వెలిచాల రాజేందర్ రావుపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదును స్వీకరించిన టూటౌన్ పోలీసులు ఐపీసీ 171F, 505 (1) సెక్షన్ లు క్రింద కేసు నమోదు చేసినట్లు టూటౌన్ సిఐ విజయ్ కుమార్ తెలిపారు.
పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు
బిఆర్ఎస్ కు చెందిన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Kaushik Reddy)పై జమ్మికుంట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ఎమ్మెల్యే రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఉన్న వీడియో ను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారని జమ్మికుంట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మెలుగూరు సదయ్య పోలీసులకు పిర్యాదు చేశారు.
ఏప్రిల్ 30న జమ్మికుంటకు సీఎం రేవంత్ రెడ్డి(CM REvanth Reddy) జనజాతరకు రాగ నాడు సుభీక్షం నేడు సంక్షోభం అంటు రైతు భీమా మహాలక్ష్మీ దళితబంధు, రైతు భరోసా, అడబిడ్డలకు తులం బంగారం గురించి నిలదీయాలని వీడియో ద్వారా కోరుతు ప్రజల్ని రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో వైరల్ చేశారని పిర్యాదులో పెర్కొన్నారు. సదయ్య పిర్యాదు ను స్వీకరించిన పోలీసులు… ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై ఐపిసి 504,153ఏ సెక్షన్ ల క్రింద కేసు నమోదు చేసినట్లు సిఐ వి.రవి తెలిపారు.
బండి సంజయ్ పై ఫిర్యాదు
బిజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ (Bandi Sanjay)ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి కుల మత రాజకీయాలు చేస్తూ మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగిస్తున్నారని అతనిపై చర్యలు తీసుకోవాలని స్వతంత్ర అభ్యర్థి పేరాల మానసరెడ్డి ఈసికి ఫిర్యాదు చేశారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్న బండి సంజయ్ ని ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్దంగా మాట్లాడితే సంజయ్ పై కేసు నమోదు చేయడానికి వెనుకాడబోమని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు.