Karimnagar Congress: కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థిపై సస్పెన్స్.. ప్రవీణ్ రెడ్డి వర్సెస్ రాజేందర్ రావు-suspense over karimnagar congress candidate praveen reddy vs rajender rao ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Karimnagar Congress: కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థిపై సస్పెన్స్.. ప్రవీణ్ రెడ్డి వర్సెస్ రాజేందర్ రావు

Karimnagar Congress: కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థిపై సస్పెన్స్.. ప్రవీణ్ రెడ్డి వర్సెస్ రాజేందర్ రావు

HT Telugu Desk HT Telugu
Apr 02, 2024 11:09 AM IST

Karimnagar Congress: లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ అభ్యర్థి ఎంపిక లో కాంగ్రెస్ సస్పెన్స్ కొనసాగిస్తుంది. మరోసారి అభ్యర్థి ఎంపిక వాయిదా పడడంతో పార్టీ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

కరీంనగర్‌లో తేలని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి...
కరీంనగర్‌లో తేలని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి...

Karimnagar Congress: అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని అధిపత్యాన్ని ప్రదర్శించిన కాంగ్రెస్ నుంచి Karimnagar కరీంనగర్‌ లోక్‌సభ  Loksabhaటిక్కెట్ కోసం 14 మంది టికెట్ ఆశించినా, ఇద్దరి మద్య ప్రధానంగా పోటీ నెలకొంది. హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ వెలిచాల జగపతి రావు తనయుడు రాజేందర్ రావు మద్య నువ్వా నేనా అన్నట్లు పోటీ ఉంది. మంత్రి పొన్నం ప్రభాకర్ Ponnam Prabhakar వైఖరితో అభ్యర్థి ఎంపికకు బ్రేక్ పడినట్లు తెలుస్తుంది.

కరీంనగర్ లో ఇప్పటికే బిజెపి BJP - బిఆర్ఎస్  BRs అభ్యర్థులను ప్రకటించి ప్రచారం ముమ్మరం చేయగా కాంగ్రెస్  Congress అభ్యర్థి ఎంపిక ఆలస్యం అవుతుండడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.

బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్, బీఆర్ఎస్ నుంచి మాజీ ఎంపీ బోయినిపల్లి వినోద్ కుమార్ పోటీ చేస్తుండగా కాంగ్రెస్ మాత్రం అందుకు భిన్నంగా అభ్యర్థి ఎంపికిలోనే తలమునకలవుతుండటం పట్ల పార్టీ శ్రేణులను అసంతృప్తికి గురి చేస్తుంది.

కరీంనగర్‌ అభ్యర్ధిని సోమవారం సాయంత్రం అధికారికంగా ప్రకటించాల్సి ఉండగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతల మధ్య ఏకాభిప్రాయం కొరవడటంతో మరోమారు వాయిదా తప్పలేదు. దీంతో అధికారిక ప్రకటన కోసం కాంగ్రెస్ శ్రేణులు మరి కొద్ది రోజులు ఎదురు చూడక తప్పడం లేదు.

మొదటి నుండి అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తారన్న ప్రచారం జరిగినప్పటికీ గత కొద్ది రోజులుగా సామాజిక సమీకరణాలు, స్థానిక నాయకత్వం అభ్యంతరాలు తెరపైకి వచ్చాయి. దీంతో ఇక్కడి నుండి టికెట్ ఆశిస్తున్న వెలిచాల రాజేందర్ రావు టికెట్ ఖాయమని అనుకున్నారు అంతా.

సీఈసీ భేటీలో ప్రవీణ్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపించడంతో స్థానిక నాయకత్వం ఖంగుతింది. వెంటనే అధిష్టానంతో పాటు సీఎం రేవంత్ రెడ్డితో చర్చలు జరపడంతో మళ్లీ కరీంనగర్ అభ్యర్థిని ప్రకటించే అంశాన్ని పెండింగ్‌లో పెట్టేశారు. దీంతో కరీంనగర్ ఎంపీ టికెట్ ఎవరికి ఇవ్వాలనే విషయంపై కాంగ్రెస్ పార్టీ మల్లాగుల్లాలు పడుతోంది.

కాంగ్రెస్‌లో వర్గపోరు కలకలం

కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై వర్గపోరు సాగుతున్నట్లు సమాచారం. పార్టీ ముఖ్య నేతలు తమ ఆదిపత్యం చాటుకునేందుకు అభ్యర్థి ఎంపికను పావుగా వాడుకున్నారనే ప్రచారం సాగుతోంది.

రాజేందర్ రావు పేరు దాదాపుగా ఖరారైందని రెండు రోజుల క్రితం సమాచారం ఇచ్చిన నేతలు, తీరా చివరి నిమిషంలో ప్రవీణ్ రెడ్డి పేరు తెరపైకి రావడం కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపింది. ఒకవైపు రాజేందర్ రావుకు మద్దతుగా సోమవారం సాయంత్రం సంబరాలు జరుపుకుంటున్న తరుణంలో అనూహ్యంగా ప్రవీణ్ రెడ్డి పేరు తెరపైకి రావడంతోకాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు షాక్ కు గురయ్యారు.

ఏం జరుగు తుందో తెలియడానికి ఢిల్లీకి, హైదరాబాద్ కు ఫోన్లు చేస్తూ సమాచారం తెలుసుకునేందుకు నానా తంటాలుపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీలో జరిగిన సీఈసీ సమావేశంలో పాలొని అనంతరం హైదరాబాద్ కు బయలు దేరడంతో కరీంనగర్ అభ్యర్థిత్వంపై ఉత్కంఠ మరింత పెరిగింది.

చివరకు రాత్రి 10 గంటలకు వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య అభ్యర్థిత్వాన్ని ఏఐసీసీ అధికారికంగా ప్రకటించి చేతులు దులుపుకోవడంతో కరీంనగర్ అభ్యర్థిని ఎప్పుడు ప్రకటిస్తారన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

మంత్రి పొన్నం ప్రభాకర్‌ కీ రోల్…

ఢిల్లీలో జరిగిన పరిణామాల పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర అసంతృప్తికి.. అసహనానికి లోనయ్యారని సమాచారం. లోక్ సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాల ఇన్ చార్జీలు ఏకతాటిపై రాజేందర్ రావు పేరును " ప్రతిపాదించిన తర్వాత చివరి నిముషంలో ప్రవీణ్ రెడ్డి పేరును తెరపైకి తీసుకురావడాన్ని ఆయన జీర్ణించుకోవడంలేదు.

హుస్నాబాద్ నియోజకవర్గ పర్యటనలో ఉన్న పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ తిరిగి రాగానే ఢిల్లీకి ఫోన్ చేసి ఏఐసీసీ నేతలతో మాట్లాడి పార్టీ శ్రేణుల మధ్య వివాదాన్ని లేవనీయవద్దని.. రాజేందర్ రావు పేరునే ప్రకటించాలంటూ ఒత్తిడి తీసుకువచ్చారని సమాచారం.

ఆయనతో పాటు ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, ఆది శ్రీనివాస్, నియోజకవర్గ ఇన్ చార్జీలు పురుమల్ల శ్రీనివాస్, ప్రణవ్ కూడా రాజేందర్ రావు అభ్యర్థిత్వం ప్రతిపాదనకు మొగ్గు చూపుతూ మరోమారు సమాచారం అందించారు.

ఉన్నట్టుండి సోమవారం సాయంత్రం చోటు చేసుకున్న ఈ పరిణామాలతో ఏఐసీసీ నేతలు కూడా కలవరపాటుకు లోనయ్యారని తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో ఏ నిర్ణయం తీసుకోలేక వాయిదా వేసి కేవలం వరంగల్ ఎంపీ అభ్యర్థిని మాత్రమే ప్రకటించారని పార్టీ నేతలు చెబుతున్నారు.

లోకల్ ప్రయారిటీ..?

అయితే లోక్ సభ స్థానల్లో అభ్యర్థుల ఎంపిక విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకున్నదే ఫైనల్ నిర్ణయంగా మారిపోతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. స్థానిక నాయకత్వం అభ్యంతరాలు వ్యక్తం చేసినా కూడా అధిష్టానం పరిగణనలోకి తీసుకోకుండా తాము డిసైడ్ చేసిన క్యాండెట్ వైపే మొగ్గు చూపుతోందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

తెలంగాణాలో ఇప్పటి వరకు ప్రకటించిన అభ్యర్థుల విషయంలో దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. పెద్దపల్లి అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ కు వ్యతిరేకంగా మెజార్టీ సెగ్మెంట్ల నుండి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అయితే అధిష్టానం మాత్రం ఆయనకే ప్రాధాన్యత ఇచ్చింది. కరీంనగర్ విషయంలోనూ ఇదే పరిస్థితి పునరావృతం అవుతోందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

(రిపోర్ట్‌ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ప్రతినిధి కేవీ.రెడ్డి)

సంబంధిత కథనం