PM Modi : హుజురాబాద్ ఉపఎన్నికలో ట్రైలర్, ఈ ఎన్నికల్లో కేసీఆర్ ఖేల్ ఖతం- ప్రధాని మోదీ-karimnagar news in telugu pm modi says bjp shows trailer in huzurabad assembly elections brs finished ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Pm Modi : హుజురాబాద్ ఉపఎన్నికలో ట్రైలర్, ఈ ఎన్నికల్లో కేసీఆర్ ఖేల్ ఖతం- ప్రధాని మోదీ

PM Modi : హుజురాబాద్ ఉపఎన్నికలో ట్రైలర్, ఈ ఎన్నికల్లో కేసీఆర్ ఖేల్ ఖతం- ప్రధాని మోదీ

Bandaru Satyaprasad HT Telugu
Nov 27, 2023 06:57 PM IST

PM Modi : పదేళ్ల వయస్సున్న తెలంగాణకు వచ్చే ఐదేళ్లు ఎంతో కీలకమని ప్రధాని మోదీ అన్నారు. హుజురాబాద్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ కు ట్రైలర్ చూపించామని, ఈ ఎన్నికల్లో ఖేల్ ఖతమన్నారు.

ప్రధాని మోదీ
ప్రధాని మోదీ

PM Modi : హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కేసీఆర్ కు ట్రైలర్ చూపించాం, ఈ ఎన్నికల్లో ఖేల్ ఖతమని ప్రధాని మోదీ అన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని కరీంనగర్ లో జరిగిన సకల జనుల విజయసంకల్ప సభలో మోదీ భరోసా ఇచ్చారు. తెలంగాణలో తొలిసారి బీజేపీ ప్రభుత్వం రాబోతోందన్నారు. బీసీ వ్యక్తే ముఖ్యమంత్రి అవుతున్నారన్నారు. పదేళ్ల బాలుడి భవిష్యత్ కోసం అతడి తల్లిదండ్రులు ఎంతో ఆలోచిస్తారన్న మోదీ... పదేళ్ల వయసున్న తెలంగాణకు వచ్చే ఐదేళ్లు ఎంతో కీలకమన్నారు. ఈ ఐదేళ్లలో తెలంగాణ దేశంలోనే నంబర్‌ వన్‌ కావాలని ఆకాంక్షించారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తేనే అభివృద్ధి సాధ్యమన్నారు. తెలంగాణ మార్పు తథ్యమని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు.

కేసీఆర్ కు సినిమా చూపిస్తాం

నవంబర్ 30న తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కు సినిమా చూపిస్తారని ప్రధాని మోదీ అన్నారు. కేసీఆర్‌ పని అయిపోయిందన్న మోదీ...తెలంగాణలో తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడనుందని జోస్యం చెప్పారు. తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్నారు. బీజేపీ ప్రభుత్వంలో బీసీ వ్యక్తి సీఎం అవుతారని స్పష్టం చేశారు. దేశం కోసమే ఓటు వేయాలంటే బీజేపీకి మాత్రమే ఓటేయాలని మోదీ అన్నారు. తెలంగాణలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు. తెలంగాణ ఏర్పడి 10 ఏళ్లు గడుస్తున్నా రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి జరిగిందని ప్రధాని మోదీ ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే అది బీఆర్ఎస్ చేరుతుందని ప్రజలు గుర్తించాలన్నారు. కేసీఆర్‌ను వద్దనుకుంటే కాంగ్రెస్‌కు ఓటు వేయొద్దని కోరారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ పిల్లల భవిష్యత్‌ను నిర్లక్ష్యం చేశాయన్నారు. కరీంనగర్‌ను స్మార్ట్ సిటీని చేస్తామంటే కేసీఆర్‌ అడ్డుపడ్డారని మోదీ ఆరోపించారు.

రైతులకు ఇచ్చే నీళ్లలోనూ అవినీతి

కరీంనగర్ ను లండన్ చేస్తానని చెప్పిన కేసీఆర్ మాటలు ఏమయ్యాయని ప్రధాని మోదీ ప్రశ్నించారు. రైతులకు నీళ్లు ఇచ్చేందుకు కూడా కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. కుటుంబ పార్టీలు వారి పిల్లల భవిష్యత్ గురించే ఆలోచిస్తారు కానీ, ప్రజల పిల్లల గురించి ఆలోచించరన్నారు. ఫిలిగ్రి కళకు కరీంగనర్ పెట్టింది పేరన్న మోదీ.. అలాంటి కళలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం విశ్వ కర్మ యోజక పథకాన్ని తీసుకొచ్చిందన్నారు. తెలంగాణలో బీజేపీ సర్కార్‌ ఏర్పడబోతోందన్న మోదీ.. బీఆర్ఎస్ అవినీతిపరులను జైలుకు పంపిస్తామన్నారు. తెలంగాణను కాంగ్రెస్‌, బీఆర్ఎస్ పార్టీలు నాశనం చేశాయని మండిపడ్డారు. గతంలో కేసీఆర్‌ దిల్లీకి వచ్చి తన వారసుడిని సీఎంగా చేస్తే బీజేపీతో కలుస్తామన్నారని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు.

Whats_app_banner