ITR e-verify: ఐటీఆర్ ఫైల్ చేశారు సరే.. ఈ - వెరిఫై చేశారా? లేదా?.. చేయకపోతే మీ ఐటీఆర్ చెల్లదు.. రీఫండ్ రాదు..
02 August 2023, 14:24 IST
ITR e-verify: ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలుకు ఆఖరు తేదీ ముగిసింది. లాస్ట్ డేట్ అయిన జులై 31 నాటికి సుమారు 6.7 కోట్ల ఐటీఆర్ లు ఫైల్ అయ్యాయి. అయితే, ఐటీఆర్ ఫైల్ చేయగానే సరిపోదు. ఆ తరువాత దాన్ని ఈ - వెరిఫై చేయాలి. లేదంటే, ఆ ఐటీఆర్ చెల్లదు. రీఫండ్ కూడా రాదు.
ప్రతీకాత్మక చిత్రం
Income tax news: ఐటీఆర్ (ITR) లను ఫైల్ చేసిన తరువాత వాటిని ఈ - వెరిఫై చేయాల్సి ఉంటుంది. అప్పుడే ఆదాయ పన్ను విభాగం వాటిని ప్రాసెస్ చేస్తుంది. ఆ తరువాతనే, ఏదైనా రీఫండ్ రావాల్సి ఉంటే, ఆ మొత్తాన్ని మీ బ్యాంక్ ఖాతాకు పంపిస్తుంది. అందువల్ల, ఐటీఆర్ ఫైల్ చేసిన 30 రోజుల్లోపు కచ్చితంగా ఈ - వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ - వెరిఫై చేయని ఐటీఆర్ లు చెల్లవన్న విషయం గుర్తుంచుకోవాలి.
Steps to e-verify ITR: ఈ - వెరిఫై చేయడం ఎలా?
`ఈ - వెరిఫై చేయడం చాలా సులువు. అందుకు మీరు ఐటీ విభాగం వెబ్ సైట్ లోకి ఈ - వెరిఫై ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తరువాత ఆధార్ ఓటీపీ ద్వారా కానీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, బ్యాంక్ ఖాతా ద్వారా కానీ, డీ మ్యాట్ ఖాతా ద్వారా కానీ, డిజిటల్ సిగ్నేచర్ ద్వారా కానీ ఈ- వెరిఫై ప్రాసెస్ ను పూర్తి చేయవచ్చు. లేదా హార్డ్ కాపీని బెంగళూరులోని సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్ కు పంపించడం ద్వారా ఆఫ్ లైన్ వెరిఫికేషన్ కూడా చేసుకోవచ్చు.
- ఆదాయ పన్ను శాఖ వెబ్ సైట్ లోకి మీ క్రెడెన్షియల్స్ ద్వారా లాగిన్ కావాలి.
- ఆ వెబ్ సైట్ లో ఈ - వెరిఫై ఆప్షన్ ఎంచుకోవాలి.
- ‘ఈ వెరిఫై’ కింద మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి. ఆల్రెడీ ఈవీసీ ఉందనే ఒక ఆప్షన్, ఈవీసీని జనరేట్ చేయమనే మరో ఆప్షన్, ఆధార్ ఓటీపీతో వెరిఫై చేయాలనే మరో ఆప్షన్ ఉంటాయి. వాటిలో ఒక ఆప్షన్ ఎంచుకోవాలి.
- ఆధార్ ఓటీపీ తో ఈ వెరిఫై చేసుకోవడం చాలా ఈజీ.
- ఆ ఆప్షన్ ఎంచుకుంటే మీ ఆధార్ తో రిజిస్టర్ అయి ఉన్నమొబైల్ నంబర్ కు ఒక ఓటీపీ వస్తుంది.
- ఆ ఓటీపీని వెబ్ సైట్ లోని నిర్ధారిత బాక్స్ ల్లో ఎంటర్ చేయాలి. దాంతో మీ ఈ వెరిఫికేషన్ పూర్తవుతుంది.
- అనంతరం, మీ ఈ వెరిఫై పూర్తయినట్లుగా ఒక అకనాలెడ్జ్ మెంట్ వస్తుంది.