ITR filings: ఈ సంవత్సరం దాఖలైన ఐటీ రిటర్న్ లు 6.7 కోట్లు; ఒక్క చివరి రోజే 65 లక్షల రిటర్న్స్
ITR filings: 2023-24 అసెస్మెంట్ సంవత్సరానికి గానూ ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలుకు చివరి తేదీ జులై 31తో ముగిసింది. జులై 31 అర్ధరాత్రి 12 గంటల వరకు రికార్డు స్థాయిలో మొత్తం 6.7 కోట్ల ఐటీ రిటర్న్స్ దాఖలైనట్లు ఆదాయ పన్ను విభాగం వెల్లడించింది.
ITR filings: 2023-24 అసెస్మెంట్ సంవత్సరానికి గానూ ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలుకు చివరి తేదీ జులై 31తో ముగిసింది. జులై 31 అర్ధరాత్రి 12 గంటల వరకు రికార్డు స్థాయిలో మొత్తం 6.7 కోట్ల ఐటీ రిటర్న్స్ దాఖలైనట్లు ఆదాయ పన్ను విభాగం వెల్లడించింది. ఇది గత సంవత్సరం దాఖలైన ఐటీ రిటర్న్స్ కన్నా 16% ఎక్కువ అని తెలిపింది. గత సంవత్సరం 5.83 కోట్ల ఐటీఆర్ లు దాఖలయ్యాయని వివరించింది.
First timers ITR filings: ఫస్ట్ టైమర్స్ రికార్డ్..
ఈ సంవత్సరం తొలిసారి ఐటీ రిటర్న్స్ ను దాఖలు చేసిన వారి సంఖ్య కూడా రికార్డు సృష్టించింది. ఈ ఏడు భారీగా 53.67 లక్షల మంది తొలిసారి ఐటీఆర్ లను ఫైల్ చేశారని వెల్లడించింది. భారత్ లో టాక్స్ బేస్ పెరుగుతోందనడానికి ఇదే రుజువని పేర్కొంది. ఐటీఆర్ లను దాఖలు చేయాల్సిందిగా సోషల్ మీడియా సహా వివిధ మాధ్యమాల ద్వారా తాము చేసిన ప్రచారం ఫలించిందని ఐటీ విభాగం తెలిపింది.
Last day rush: చివరి రోజు పోటెత్తారు..
ఆదాయ పన్ను రిటర్న్స్ ను ఫైల్ చేయడానికి ఆఖరు తేదీ జులై 31 కాగా, ఈ గడువును పొడగిస్తారని చాలామంది భావించారు. దాంతో, తమ ఐటీఆర్ లను ఫైల్ చేయడంలో జాప్యం చేశారు. తమ ఐటీఆర్ లను ఫైల్ చేయకుండా, చివరి రోజు వరకు వెయిట్ చేశారు. ఇక వాయిదా ఉండదని స్పష్టమైన తరువాత, చివరి రోజైన జులై 31 న ఐటీఆర్ లను ఫైల్ చేయడం కోసం ఎగబడ్డారు. దాంతో, చివరి రోజు ఒక్క రోజే 64.33 లక్షల ఐటీఆర్ లు దాఖలయ్యాయి.
ITR Forms: ఏ ఫామ్ తో ఎంతమంది?
ఈ సంవత్సరం ఐటీఆర్ 1 ను 3.33 కోట్ల మంది ఫైల్ చేశారని ఐటీ విభాగం తెలిపింది. ఇది మొత్తం ఫైలింగ్స్ లో 49.18% అని తెలిపింది. ఐటీఆర్ 2ని 81.12 లక్షల మంది, ఐటీఆర్ 3 ని 75.40 లక్షల మంది, ఐటీఆర్ 4 ని 1.81 కోట్ల మంది, ఐటీఆర్ 5, 6, 7 లను కనిష్టంగా 6.40 లక్షల మంది ఫైల్ చేశారని వివరించింది. మొత్తం ఫైలింగ్స్ లో 46% ఆన్ లైన్ లో ద్వారా జరిగాయని వెల్లడించింది. ఐటీఆర్ లను ఫైల్ చేసిన వారు తప్పనిసరిగా ఈ వెరిఫికేషన్ చేసుకోవాలని ఆదాయ పన్ను విభాగం సూచిస్తోంది.