ITR filing July 31 deadline: ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేయకపోతే ఏమవుతుంది?.. జైలు శిక్ష కూడానా..?
ITR filing July 31 deadline: 2022 -23 ఆర్థిక సంవత్సరానికి గానూ ఆదాయ పన్ను రిటర్న్స్ (ITR) దాఖలుకు లాస్ట్ డేట్ దగ్గర పడుతోంది. మరో వారం రోజలు మాత్రమే మిగిలి ఉంది. ఆలస్యం చేయకుండా ఐటీఆర్ లను దాఖలు చేయడం మంచిది. లేదంటే, అనవసరంగా ఇబ్బందులు పడే అవకాశముంది.
ITR filing July 31 deadline: 2022 -23 ఆర్థిక సంవత్సరానికి గానూ ఆదాయ పన్ను రిటర్న్స్ (ITR) ను దాఖలు చేయడానికి ఆఖరు తేదీ జులై 31. ఈ లాస్ట్ డేట్ ను, గతంలో మాదిరిగా, పొడిగించే అవకాశం లేదని ఆదాయ పన్ను అధికారులు చెబుతున్నారు. అందువల్ల జులై 31 లోపే, చివరి నిమిషం వరకు వాయిదా వేయకుండా, సాధ్యమైనంత త్వరగా ఐటీఆర్ లను దాఖలు చేయడం ఉత్తమం. లేదంటే, జరిమానాలే కాదు, జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉందని ఐటీ అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఇప్పటికే 4 కోట్ల మంది..
ఇప్పటివరకు సుమారు 4 కోట్లమంది భారతీయులు ఆదాయ పన్ను రిటర్న్స్ (ITR) ను దాఖలు చేశారు. మరికొంత మంది లాస్ట్ డేట్ ను పొడిగించే అవకాశముందని భావిస్తూ, ఐటీఆర్ లను సబ్మిట్ చేయడంలో జాప్యం చేస్తున్నారు. అయితే, లాస్ట్ డేట్ ను, గతంలో మాదిరిగా, పొడిగించే అవకాశం లేదని ఆదాయ పన్ను అధికారులు చెబుతున్నారు. అందువల్ల వెంటనే ఐటీఆర్ లను దాఖలు చేయడం మంచిదని సూచిస్తున్నారు. లేదంటే, జరిమానాలే కాదు, జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉందని ఐటీ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటివరకు 4 కోట్ల వరకు ఐటీఆర్ లు దాఖలైతే, వాటిలో 7% తొలిసారి ఐటీఆర్ లను దాఖలు చేసినవారున్నారని సీబీడీటీ చైర్ పర్సన్ నితిన్ గుప్తా తెలిపారు. సగానికి పైగా ఐటీఆర్ లను ప్రాసెస్ చేయడం ముగిసిందని, రూ. 80 లక్షల వరకు రీఫండ్స్ చేశామని వెల్లడించారు.
లాస్ట్ డేట్ లోపు ఐటీఆర్ దాఖలు చేయకపోతే?
ఒకవేళ, జులై 31 లోపు ఆదాయ పన్ను రిటర్న్స్ (ITR) ను దాఖలు చేయనట్లైతే.. ఏం జరుగుతుందన్న అనుమానాలు చాలా మందిలో ఉంటాయి. ఆదాయ పన్ను రిటర్న్స్ ను ఆఖరు తేదీ లోపు దాఖలు చేయనట్లైతే.. సాధారణంగా, కొంత జరిమానాతో, ఐటీఆర్ లను దాఖలు చేయడానికి మరి కొంత గడువు లభిస్తుంది. ఐటీ చట్టం 243 ఎఫ్ ప్రకారం.. ఐటీఆర్ ను దాఖలు చేస్తున్న వ్యక్తి వార్షిక ఆదాయం రూ. 5 లక్షల కన్నా ఎక్కువ ఉంటే ఈ జరిమానా రూ. 5 వేలు ఉంటుంది. అలాగే, ఆ వ్యక్తి వార్షిక ఆదాయం రూ. 5 లక్షల లోపు ఉంటే, జరిమానా రూ. 1000 గా ఉంటుంది.
జైలు శిక్ష కూడా ఉంటుందా?
అసాధారణ పరిస్థితుల్లో, డిసెంబర్ 31, 2023 లోపు ఐటీఆర్ దాఖలు చేయని వ్యక్తికి జైలు శిక్ష కూడా పడే అవకాశముంది. డిసెంబర్ 31, 2023 లోపు ఐటీఆర్ దాఖలు చేయని వేతన జీవులపై ప్రాసిక్యూషన్ ను ప్రారంభించే అధికారం ఐటీ చట్టం ప్రకారం భారత ప్రభుత్వానికి ఉంటుంది. సరైన కారణం లేకుండా, డిసెంబర్ 31, 2023 లోపు ఐటీఆర్ దాఖలు చేయనట్టైతే.. 6 నెలల నుంచి ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశముంది. అయితే, అసాధారణ పరిస్థితుల్లో, చెల్లించాల్సిన పన్ను మొత్తం అత్యధికంగా ఉన్న సమయాల్లో మాత్రమే ఐటీ శాఖ ఈ దిశగా చర్యలు తీసుకుంటుంది.