Hyundai IPO: మొత్తానికి, మూడో రోజుకి ఫుల్ గా సబ్ స్క్రైబ్ అయిన హ్యుందాయ్ ఐపీఓ; షేర్స్ అలాట్మెంట్ రేపే
17 October 2024, 19:53 IST
Hyundai IPO: భారతదేశంలో అతి పెద్ద ఐపీఓగా గుర్తింపు పొందిన హ్యుందాయ్ ఐపీఓపై ఇన్వెస్టర్లు అంతగా ఆసక్తి చూపలేదు. మూడో రోజు నాటికి కానీ, ఈ ఐపీఓ ఫుల్ గా సబ్ స్క్రైబ్ కాలేదు. అదికూడా, రిటైలర్స్ వాటా 48 శాతమే సబ్ స్క్రైబ్ కావడం విశేషం. హ్యుందాయ్ ఐపీఓ షేర్స్ అలాట్మెంట్ అక్టోబర్ 18, శుక్రవారం జరుగుతుంది.
మూడో రోజుకి ఫుల్ గా సబ్ స్క్రైబ్ అయిన హ్యుందాయ్ ఐపీఓ
Hyundai IPO: హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ ఐపీఓ 2024 అక్టోబర్ 17 బిడ్డింగ్ మూడవ రోజున పూర్తిగా సబ్స్క్రైబ్ అయింది. ఎల్ఐసీ రూ.21,000 కోట్ల ఐపీఓను అధిగమించిన అతిపెద్ద ఐపీఓగా హ్యుందాయ్ ఐపీఓ నిలిచింది. అయితే, ఈ ఐపీఓకు ఇన్వెస్టర్ల నుంచి పెద్దగా స్పందన లభించలేదు.
మూడో రోజుకి ఫుల్ గా సబ్ స్క్రిప్షన్
రూ.27,870 కోట్ల విలువైన హ్యుందాయ్ ఐపీఓ (IPO) లో గురువారం మధ్యాహం 1:21 గంటల సమయానికి 9,97,69,810 షేర్లకు గానూ, 14,07,68,187 షేర్లకు బిడ్లు వచ్చాయి. ఇది మొత్తంగా 1.41 రెట్లు అధిక సబ్ స్క్రిప్షన్. క్వాలిఫైడ్ ఇన్ స్టిట్యూషనల్ బయ్యర్స్ (QIB) కోటా 3.88 రెట్లు అధికంగా సబ్ స్క్రైబ్ కాగా, రిటైల్ ఇన్వెస్టర్ల వాటాలో 44 శాతం మాత్రమే సబ్ స్క్రైబ్ అయింది. సోమవారం కంపెనీ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.8,315 కోట్లు సమీకరించింది.
హ్యుందాయ్ ఐపీఓ వివరాలు
హ్యుందాయ్ ఇండియా ఐపీఓ (Hyundai IPO)లో ఒక్కో ఈక్విటీ షేరు ధర రూ.1,865-1,960గా నిర్ణయించారు. ఇష్యూ తర్వాత దీని మార్కెట్ విలువ సుమారు రూ.1.6 లక్షల కోట్లు లేదా సుమారు 19 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. ఐపీఓ (Hyundai IPO) ద్వారా కంపెనీ ఎలాంటి ఆదాయాన్ని తీసుకోనప్పటికీ, తమ షేర్లను లిస్టింగ్ చేయడం వల్ల విజిబిలిటీ, బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందని, షేర్లకు పబ్లిక్ మార్కెట్ ఏర్పడుతుందని పేర్కొంది. 2003 నాటి మారుతి సుజుకి లిస్టింగ్ తర్వాత గత రెండు దశాబ్దాల్లో ఇదే తొలి ఆటో ఐపీఓ కావడం గమనార్హం. హ్యుందాయ్ భారతదేశంలో రెండవ అతిపెద్ద వాహన తయారీదారు. హ్యుందాయ్ భారత్ లో కార్యకలాపాలను 1996 లో ప్రారంభించింది. ఇప్పుడు వివిధ సెగ్మెంట్లలో 13 మోడళ్లను కలిగి ఉంది.