తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Big C Two Decades : రెండేళ్లలో 400 ఔట్ లెట్లు, రూ.1500 కోట్ల టర్నోవర్‌ టార్గెట్- సీఎండీ బాలు చౌదరి

Big C Two Decades : రెండేళ్లలో 400 ఔట్ లెట్లు, రూ.1500 కోట్ల టర్నోవర్‌ టార్గెట్- సీఎండీ బాలు చౌదరి

20 August 2023, 19:58 IST

google News
    • Big C Two Decades : రెండేళ్లలో బిగ్-సి ఔట్ లెట్ల సంఖ్యను 400లకు చేరుస్తామని ఆ సంస్థ ఫౌండర్, సీఎండీ బాలు చౌదరి తెలిపారు. బిగ్-సి రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ కార్యక్రమం నిర్వహించారు.
బిగ్-సి రెండు దశాబ్దాల వేడుక
బిగ్-సి రెండు దశాబ్దాల వేడుక

బిగ్-సి రెండు దశాబ్దాల వేడుక

Big C Two Decades : మల్టీ బ్రాండ్‌ మొబైల్స్‌ రిటైల్‌ చైన్‌ బిగ్‌ సి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1,500 కోట్ల టర్నోవర్‌ లక్ష్యంగా చేసుకుందని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. 2022-23లో కంపెనీ రూ.1,000 కోట్ల టర్నోవర్‌ సాధించిందని తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో బిగ్‌ సి 250 ఔట్‌లెట్లలో విక్రయాలు చేస్తుందన్నారు. రెండేళ్లలో వీటి సంఖ్యను 400లకు చేరుస్తామని బిగ్‌ సి ఫౌండర్, సీఎండీ ఎం.బాలు చౌదరి స్పష్టం చేశారు. ఇందుకు రూ .300 కోట్ల వరకు పెట్టుబడి పెడుతున్నామని చెప్పారు. బిగ్-సి రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జరుగుతున్న వేడుకల్లో భాగంగా బిగ్‌–సి బ్రాండ్‌ అంబాసిడర్, సినీ నటుడు మహేశ్‌ బాబుతో కలిసి సామ్‌సంగ్‌ నూతనంగా తయారు చేసిన ఫ్లిప్, ఫోల్డ్‌ ఫోన్లను ఆవిష్కరించారు. అనంతరం బిగ్‌-సి ఈడీ స్వప్న కుమార్‌, డైరెక్టర్లు బాలాజీ రెడ్డి, గౌతమ్ రెడ్డి, కైలాష్ తో కలిసి సీఎండీ బాలు చౌదరి ఆదివారం మీడియాతో మాట్లాడారు. 2002 డిసెంబర్‌ 23న బిగ్‌-సి ప్రారంభమైందని తెలిపారు. మొబైల్స్‌ రిటైల్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో తొలి స్థానంలో నిలిచి రెండు దశాబ్దాల ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తిచేశామన్నారు. మూడో దశాబ్దంలోనూ అగ్రస్థానాన్ని కొనసాగిస్తామని తెలిపారు. 3 కోట్ల మంది వినియోగదార్లను సొంతం చేసుకున్నామని, ఉద్యోగుల సంఖ్య ప్రస్తుతం ఉన్న 2,500 నుంచి రెండేళ్లలో 4,000లకు చేరుతుందన్నారు.

ఆ ఘనత మాదే

దేశంలో మొబైల్స్‌ రిటైల్‌ను ఆర్గనైజ్డ్ చేసిన ఘనత బిగ్ -సి దేనని సీఎండీ బాలు చౌదరి చెప్పారు. 2006 నుంచి బ్రాండ్‌ అంబాసిడర్లను నియమించుకుంటున్నామన్నారు. ఒక రిటైల్‌ కంపెనీ బ్రాండ్‌ అంబాసిడర్‌ను నియమించుకోవడం భారత్‌లో అదే తొలిసారి అన్నారు. అలాగే మొబైల్స్‌ను డిస్‌ప్లే చేయడం మాతోనే ప్రారంభం అయిందన్న ఆయన... టచ్‌ అండ్‌ ఫీల్‌ను సుసాధ్యం చేశామని స్పష్టంచేశారు. కొత్త మోడళ్లను ఎప్పటికప్పుడు కస్టమర్ల ముందు ఉంచుతున్నామని బాలు చౌదరి తెలిపారు. వినియోగదార్ల నమ్మకం, నాణ్యమైన సేవలు, ఉత్పత్తులు, మెరుగైన అనుభూతికి తోడు 2,500 మంది ఉద్యోగుల కృషి కారణంగా అగ్రస్థాయిలో నిలిచామన్నారు. మొబైల్స్‌ ఉన్నంత కాలం బిగ్‌–సి ప్రయాణం కొనసాగుతుందని తెలిపారు. ఒక్కో కుటుంబంలో మూడు తరాలకు సేవలు అందిస్తున్నామన్నారు.

రెండు గంటల్లో డెలివరీ

టెలికాం రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మొబైల్స్‌ తయారీ సంస్థలతో కలిసి కస్టమర్లకు ఆధునిక మోడళ్లను అందిస్తున్నామని సీఎండీ బాలు చౌదరి తెలిపారు. రాబోయే రోజుల్లో 5జీ కొత్త రికార్డులు నమోదు చేయనుందన్నారు. కరోనా మహమ్మారి తర్వాత మొబైల్స్‌ రిటైల్‌లో కన్సాలిడేషన్‌ జరిగిందన్నారు. ఆఫ్‌లైన్‌ వాటా ఏకంగా 65 శాతానికి చేరిందన్నారు. ఆన్‌లైన్‌ ప్రభావం బిగ్‌-సి పై పడలేదన్నారు. బిగ్‌–సి స్టోర్‌లో కొంటే ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయో కస్టమర్‌కు అవగాహన ఉందన్నారు. బిగ్‌-సి పోర్టల్‌లో మొబైల్‌ కొనుగోలు చేస్తే 2 గంటల్లో డెలివరీ ఇస్తున్నామన్నారు. బిగ్‌-సి కేంద్రాల్లో టీవీల విక్రయాలు పుంజుకున్నాయని ఆయన చెప్పారు.

తదుపరి వ్యాసం