Instagram: ఇన్ స్టాగ్రామ్ లో మీ పోస్టులను ఇష్టమైన టైమ్ లో పబ్లిష్ అయ్యేలా షెడ్యూల్ చేసుకోవచ్చు. ఎలాగో ఇక్కడ తెలుసుకోండి
20 January 2024, 19:06 IST
Schedule Instagram posts: సాధారణంగా ఫేస్ బుక్, ట్విటర్, ఇన్ స్టా వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో పోస్ట్స్ పెడుతుంటాము. అయితే, వాటిని ముందే క్రియేట్ చేసుకుని, ఆ తరువాత మనం కోరుకున్న సమయంలో పోస్ట్ అయ్యేలా షెడ్యూల్ చేసుకోవచ్చు.
ప్రతీకాత్మక చిత్రం
Schedule Instagram posts: ఇన్ స్టా గ్రామ్ లో రీల్స్ ను పోస్ట్ చేయడం ద్వారా చాలా మందికి తమ ప్రతిభను ప్రదర్శించడానికి అవకాశం లభించింది. తమలో దాగి ఉన్న నటన, నృత్యం, గాన నైపుణ్యాలను ఇన్ స్టా వేదికగా చాలామంది ప్రపంచానికి తెలియజేశారు.
కొత్త ఫీచర్స్..
ఇన్ స్టా (Instagram) సహా దాదాపు అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ వినియోగదారులను ఆకర్షించడానికి ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ ను, కొత్త అప్ డేట్స్ ను పరిచయం చేస్తుంటాయి. ఇన్ స్టాలో అప్ డేట్ చేసిన షెడ్యూలింగ్ ఫీచర్ కూడా అలాంటిదే. ఈ ఫీచర్ తో తమ పోస్ట్ లను షెడ్యూల్ చేసుకునే అవకాశం ఇన్ స్టా గ్రామ్ వినియోగదారులకు లభిస్తుంది. దాంతో, వారికి సమయం శ్రమ రెండూ ఆదా అవుతాయి. అంతేకాదు, తక్కువ ఒత్తిడితో కంటెంట్ ను రూపొందించడానికి వారికి అవకాశం లభిస్తుంది. చాలా మంది కంటెంట్ క్రియేటర్లు స్వతంత్రంగా పనిచేస్తారు కాబట్టి, తమ పోస్ట్ లను షెడ్యూల్ చేయడం వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
ఎవరు షెడ్యూల్ చేయవచ్చు..?
ఈ ఫీచర్ సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లకు, ఇన్ స్టా గ్రామ్ ను ఉపయోగించే వ్యాపార వినియోగదారులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ఫీచర్ ప్రకారం, వ్యక్తులు రోజుకు 25 పోస్టుల వరకు ప్లాన్ చేయవచ్చు. షెడ్యూల్ చేయవచ్చు. 75 రోజుల ముందుగానే కంటెంట్ ను సిద్ధం చేసుకోవచ్చు. అయితే, బిజినెస్ ప్రొఫైల్స్ ఉన్న వినియోగదారులు మాత్రమే ఈ ఫీచర్ ను ఉపయోగించగలరు అన్న విషయం గుర్తుంచుకోవాలి. వ్యక్తిగత ప్రొఫైల్స్ ఉన్నవారికి ఈ కంటెంట్ ను షెడ్యూల్ చేసే ఫీచర్ అందుబాటులో లేదు.
ఎలా షెడ్యూల్ చేయాలి?
ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ లను షెడ్యూల్ చేయడానికి కింది స్టెప్స్ ఫాలో కావాలి.
- ముందుగా ఇన్ స్టాగ్రామ్ ఓపెన్ చేసి, ఆ పై ప్లస్ ఐకాన్ ను ఎంచుకోండి. అక్కడ నుండి, మీ కంటెంట్ ను సృష్టించడానికి పోస్ట్ లేదా రీల్ ఎంచుకోండి.
- అవసరమైన సవరణలు చేసిన తర్వాత, స్క్రీన్ దిగువకు నావిగేట్ చేయండి. అక్కడ కనిపించే అడ్వాన్స్ డ్ సెట్టింగ్స్ పై ట్యాప్ చేయండి.
- స్విచ్ ను టాగ్లింగ్ చేయడం ద్వారా షెడ్యూల్ ఫీచర్ ను యాక్టివేట్ చేయండి.
- మీ పోస్ట్ ఏ రోజు, ఏ సమయంలో పబ్లిష్ కావాలో ఆ తేదీని, ఆ సమయాన్ని ఎంపిక చేయండి.
- బ్యాక్ బటన్ నొక్కడం ద్వారా మునుపటి స్క్రీన్ కు తిరిగి రండి.
- చివరగా, షేర్ ఆప్షన్ ను క్లిక్ చేసి మీ పోస్ట్ ను షెడ్యూల్ చేయండి.
ఎలా మార్పులు చేయాలి?
- మీ షెడ్యూల్ చేసిన పోస్టుల్లో ఏవైనా మార్పులు చేయాలనుకుంటే, ముందుగా, మీ ఇన్ స్టా గ్రామ్ ప్రొఫైల్ ను యాక్సెస్ చేయండి.
- ఎగువ కుడి మూలలో ఉన్న మెను చిహ్నంపై ట్యాప్ చేయండి.
- మార్పులు చేయాలనుకుంటున్న షెడ్యూల్డ్ కంటెంట్ వైపు నావిగేట్ చేయండి.
- ఆపై సంబంధిత పోస్ట్ లేదా రీల్ పక్కన ఉన్న మూడు చుక్కలను ఎంచుకోండి.
- అవసరమైన మార్పులు చేయండి. అవసరమనుకుంటే, రీషెడ్యూల్ కూడా చేయవచ్చు.