Bank Locker : బ్యాంకు లాకర్‌ను ఎలా ఎంచుకోవాలి? ఏ వస్తువులను భద్రపరచవచ్చు?
03 September 2024, 9:26 IST
- Bank Locker : ఇటీవలి కాలంలో బ్యాంకు లాకర్లపై జనాలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. విలువైన వస్తువులు ఇంట్లో పెట్టుకుంటే ఇబ్బందులు వస్తాయని ఆలోచిస్తున్నారు. దీంతో బ్యాంకు లాకర్లు తీసుకుని అందులో పెడుతున్నారు. అయితే బ్యాంకు లాకర్‌ను ఎలా ఎంచుకోవాలి? ఏ వస్తువులు పెట్టుకోవచ్చో చూద్దాం..
బ్యాంకు లాకర్
ఇంట్లో నగలు పెట్టుకోకుండా బ్యాంకు లాకర్ల వైపు మొగ్గు చూపుతున్నారు చాలా మంది. విలువైన వస్తువులను రక్షించడానికి బ్యాంక్ లాకర్లు సురక్షిత ప్రదేశాలుగా మారాయి. మీ వస్తువులకు ఉత్తమమైన లాకర్ ప్రొవైడర్‌ను ఎలా ఎంచుకోవాలి? లాకర్‌లో ఏ వస్తువులను ఉంచవచ్చు? వస్తువులను లాకర్‌లో ఉంచడానికి ఎలాంటి ఒప్పందాలు ఉన్నాయి?, 2024లో ఒకరి వస్తువులను లాకర్‌లో ఉంచడానికి నిబంధనలు ఏమిటి? తెలుసుకుందాం..
బ్యాంక్ లాకర్‌ను ఎలా ఎంచుకోవాలి?
మీ వస్తువులను భద్రపరచడానికి బ్యాంక్ లాకర్‌ను ఎంచుకునేటప్పుడు పరిగణించవలసిన అనేక కారణాలున్నాయి. ఉదాహరణకు అద్భుతమైన సేవకు పేరుగాంచిన బ్యాంకును ఎంచుకోండి. లేదా మీకు ఇప్పటికే ఖాతా ఉన్న బ్యాంకును ఎంచుకోవచ్చు. ఇది మీ లావాదేవీని సులభతరం చేస్తుంది. మీకు మరింత బ్యాంకింగ్ అనుభవాన్ని అందిస్తుంది.
బ్యాంక్ లాకర్లలో అనుమతించే వస్తువులు
వివిధ విలువైన వస్తువులను బ్యాంక్ లాకర్లలో ఉంచవచ్చు. సవరించిన నిబంధనల ప్రకారం ఆభరణాలు, రుణ పత్రాలు, స్థిరాస్తి పత్రాలు, జనన ధృవీకరణ పత్రం, వివాహ ధృవీకరణ పత్రం, బీమా పాలసీ, సేవింగ్స్ బాండ్లు, ఇతర వ్యక్తిగత వస్తువులు ఉంచుకోవచ్చు.
బ్యాంక్ షరతులు
బ్యాంక్ లాకర్ పొందడానికి మీరు తప్పనిసరిగా ఆ బ్యాంకులో సేవింగ్స్ ఖాతాను కలిగి ఉండాలి. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ వంటి గుర్తింపు, చిరునామా రుజువులు అవసరం. మీరు బ్యాంక్ లాకర్‌ను ఎంచుకున్నప్పుడు ఉపయోగ నిబంధనలు, షరతులతో కూడిన లాకర్ ఒప్పందాన్ని అందిస్తుంది. ఈ చట్టపరమైన పత్రంపై మీరు, బ్యాంక్ ప్రతినిధి సంతకం చేయాలి.
లాకర్ కేటాయింపు
లాకర్ లభ్యతను బట్టి మీ లాకర్ కోసం ప్రత్యేకమైన కీ అందిస్తారు. మీ దగ్గర ఒక కీ ఉంటుంది. అదేవిధంగా బ్యాంకుకు కూడా ఒక కీ ఉంటుందని గుర్తుంచుకోవాలి. కొన్నిసార్లు మీ లాకర్ కీ పోయినట్లయితే మరొక కీని ఉపయోగించుకోవచ్చు. బ్యాంక్ లాకర్‌ను ఉపయోగించడానికి సెక్యూరిటీ డిపాజిట్ అవసరం. ఆ తర్వాత మీరు బ్యాంక్ లాకర్‌ని ఉపయోగించనప్పుడు, కీని తిరిగి ఇచ్చేటప్పుడు ఈ సెక్యూరిటీ డిపాజిట్ మొత్తం మీకు ఇస్తారు. లాకర్‌ను అద్దెకు తీసుకునే ఖర్చు దాని స్థానం ఆధారంగా మారుతుంది. పరిమితులకు మించి లాకర్‌ను తరచుగా ఉపయోగిస్తుంటే అదనపు సేవా ఛార్జీలు వర్తించవచ్చు.
బ్యాంక్ లాకర్లు మెరుగైన భద్రతను అందిస్తాయి. ఏదైనా నష్టాల నుండి రక్షించడానికి అధిక విలువైన వస్తువులకు బీమా చేయవచ్చు. ఖాతాదారుడు మరణిస్తే లాకర్‌ను ఉపయోగించడానికి నామినీగా కుటుంబ సభ్యుడిని నియమించడం మంచిది. ఈ నియమాలు, మార్గదర్శకాలను అనుసరించి మీ బ్యాంక్ లాకర్ గురించి నిర్ణయాలు తీసుకోవచ్చు.