Honda Activa EV : మార్కెట్‌లో హాట్ టాపిక్‌గా హోండా యాక్టివా ఈవీ.. దీని గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు
11 November 2024, 12:30 IST
- Honda Activa Electric Scooter : ఇప్పుడు ఆటోమెుబైల్ ప్రపంచంలో హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ హాట్ టాపిక్ అయింది. దీని రాకతో మిగతా ఈవీల మీద ప్రభావం చూపే అవకాశం ఉంది.
హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్
హోండా మోటార్ కంపెనీ త్వరలో భారతదేశంలో తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయబోతోంది. హోండా యాక్టివాను తీసుకువస్తుంది. భారత మార్కెట్లోకి విడుదల చేసే తేదీని కూడా నిర్ణయించారు. హోండా తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను నవంబర్ 27న భారత మార్కెట్లోకి పరిచయం చేయబోతోంది. ఈ మేరకు మీడియాకు ఆహ్వానం కూడా పంపారు. జనవరిలో జరగనున్న ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రపంచవ్యాప్తంగా అరంగేట్రం చేయగలదనే వార్తలు కూడా వస్తున్నాయి.
యాక్టివా ఈవీ ప్రస్తుతం ఆటోమొబైల్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా అయింది. అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యాక్టివా ఈవీ వెర్షన్ అని కంపెనీ ఇంకా చెప్పలేదు. అయితే ఇది దాదాపుగా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ అని మాత్రం చాలా మంది మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
ఈ ఎలక్ట్రిక్ టూ వీలర్ గురించి వివరాలు అందుబాటులో లేవు. దీని పనితీరు దాని 110సీసీ ఐసీఈకి సమానంగా ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇది యాక్టివా 110 ఎలక్ట్రిక్ వేరియంట్‌గా విడుదల అవుతుందని భావిస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటీ అంచనా ధర, ఫీచర్ల గురించి చూద్దాం..
హోండా యాక్టివా ఈవీ ప్రధాన ఫీచర్ బ్యాటరీ సైకిల్ సిస్టమ్. అంటే మీరు ఖాళీ బ్యాటరీని ఇచ్చి, డబ్బులు చెల్లించి పూర్తిగా ఛార్జ్ చేయబడిన బ్యాటరీని పొందవచ్చు. స్వాపబుల్ బ్యాటరీ అన్నమాట. హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 100 నుండి 150 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. ఇది మాత్రమే కాదు, పూర్తి డిజిటల్ టచ్‌స్క్రీన్ ఇన్‌స్ట్రుమెంటల్ కన్సోల్, కీలెస్ స్టార్ట్, స్టాప్ వంటి ఫీచర్లను కూడా హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఉండవచ్చు. దాని ఎక్స్-షోరూమ్ ధర లక్ష రూపాయల నుంచి రూ.1.20 లక్షల మధ్య ఉండవచ్చు.
హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటీ విక్రయాలు 2025లో ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది. మెుదటగా విడుదలయ్యేది భారత మార్కెట్లోనే. తర్వాత ఇండోనేషియా, జపాన్, యూరోపియన్ దేశాలలో ప్రారంభించవచ్చు. భారత మార్కెట్లోకి విడుదల చేసిన తర్వాత ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్లకు హోండా యాక్టివా ఈవీ గట్టి పోటీనిస్తుంది.