Economic Survey : 'వాస్తవ జీడీపీ వృద్ధి 7శాతం'- లోక్‌సభ ముందుకు ఎకనామిక్ సర్వే
22 July 2024, 13:18 IST
- Economic Survey 2024 : 2023-2024 ఆర్థిక ఏడాదికి సంబంధించిన ఆర్థిక సర్వేని లోక్‌సభలో ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్. వాస్తవ జీడీపీ 6.5 నుంచి 7 శాతం వృద్ధి చెందుతుందని సర్వే పేర్కొంది
నిర్మలా సీతారామన్
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023-2024 ఆర్థిక సర్వేను సోమవారం ఉదయం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. 2024-25లో భారత వాస్తవ జీడీపీ 6.5 నుంచి 7 శాతం మధ్య వృద్ధి చెందుతుందని సర్వే పేర్కొంది. ఇది.. భారత జీడీపీపై అంతర్జాతీయ ద్రవ్య నిధి అంచనా 7 శాతానికి అనుగుణంగా ఉంది.
మార్కెట్ అంచనాలు ఎక్కువగా ఉన్నందున రిస్క్‌ని సమానంగా సమతుల్యం చేస్తూ, వాస్తవ జీడీపీ వృద్ధి రేటు 6.5-7 శాతంగా ఉంటుందని సర్వే అంచనా వేసింది.
ఎఫ్వై25లో భారత జీడీపీ 7.2శాతంగా ఉంటుందని, గతంలో చెప్పిన 7శాతాన్ని ఆర్బీఐ సవరించింది. గడిచిన మూడేళ్లల్లో భారత జీడీపీ 7శాతానికిపైగా వృద్ధిని నమోదుచేస్తూ వస్తోంది.
ఇక సేవల ద్రవ్యోల్బణం (సర్వీస్ ఇన్ఫ్లేషన్), బలమైన లేబర్ మార్కెట్ కారణంగా అనేక ఆసియా దేశాల్లో ప్రధాన ద్రవ్యోల్బణం స్థిరంగా ఉందని ఆర్థిక సర్వే పేర్కొంది. దేశంలో ఎఫ్వై24 ఆర్థిక ఏడాదిలో రీటైల్ ద్రవ్యోల్బణం 5.4శాతానికి దిగొచ్చిందని తెలిపింది. అంతర్జాతీయంగా ఉన్న సమస్యలు, సప్లై-చెయిన్ వ్యవస్థలో ఇబ్బందులు, వర్షాకాలంలో ప్రతికూల పరిస్థితులను పాలన, పాలసీలతో ద్రవ్యోల్బణాన్ని సమర్థవంతంగా ఎదుర్కోన్నట్టు వివరించింది.
దేశంలో నిత్యం పెరుగుతున్న శ్రామికశక్తిని దృష్టిలో పెట్టుకుని, వ్యవసాయేతర రంగాల్లో 2030 వరకు ఏటా సగటున 78.5 లక్షల ఉద్యోగాలను జనరేట్ చేయాల్సిన అవసరం ఉందని ఆర్థిక సర్వే నొక్కి చెప్పింది. అయితే ప్రస్తుతం భారత దేశంలో సర్వీస్ సెక్టార్లో ఎక్కువగా ఉద్యోగాల సృష్టి జరుగుతోందని, నిర్మాణ రంగంలో జాబ్ క్రియేషన్ పుంజుకుందని ఆర్థిక సర్వే తెలిపింది. మొండిబకాయిల కారణంగా వెనకపడిన తయారీ రంగం.. 2021-22లో పుంజుకుని, ఉద్యోగాల ఉత్పత్తి పరంగా మెరుగైన ప్రదర్శన చేస్తోందని వివరించింది.
సులభతర వాణిజ్యం..
ఎకనామిక్ సర్వేని ప్రవేశపెడుతూ దేశంలో సులభతర వాణిజ్యం కోసం అనేక చర్యలు చేపట్టినట్టు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. 63 నేరాలను డీక్రిమినలైజ్ చేసినట్టు వివరించారు. సులభతర వాణిజ్యంలో ఇది గొప్ప ఘనత అన్నారు. నిబంధనలు మరింత సరళతరం చేసి వ్యాపారలకు అనువైన పర్యావరణాన్ని ఏర్పాటు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యం అని స్పష్టం చేశారు.
ఆర్థిక సర్వే అంటే ఏంటి?
ఎకనామిక్ సర్వేను కేంద్ర ప్రభుత్వం ప్రతీ సంవత్సరం బడ్జెట్ సమావేశాల సమయంలో పార్లమెంటుకు సమర్పిస్తుంది. సాధారణంగా ఎకనమిక్ సర్వే అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఆర్థిక పరిస్థితిని సమీక్షిస్తుంది. అదే సమయంలో భారత ఆర్థిక వ్యవస్థకు స్వల్ప, మధ్యకాలిక అవకాశాలను కూడా వివరిస్తుంది. కేంద్ర బడ్జెట్ కు ముందు ఆర్థిక సర్వేను పార్లమెంటు పరిశీలన కోసం ప్రవేశపెడతారు. 1950-51లో తొలి ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. 1964 వరకు దీనిని కేంద్ర బడ్జెట్ తో పాటు ప్రవేశపెట్టేవారు. ఆ తర్వాత దానిని వేరు చేసి బడ్జెట్‌కు ముందురోజు ప్రవేశపెట్టడం ప్రారంభించారు.
ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వశాఖలోని ఎకనామిక్ డిపార్ట్మెంట్ ఈ ఎకనామిక్ సర్వేని రూపొందిస్తుంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందని చెబుతూ.. 2023లో ‘రికవరీ కంప్లీట్లీ’ అనే థీమ్‌తో ఆర్థిక సర్వేని ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్.
ఇక వర్షాకాల సమావేశాల్లో భాగంగా మంగళవారం ఉదయం లోక్‌సభలో 2024 బడ్జెట్‌ని నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు.