Cyient DLM : సైయెంట్ డీఎల్ఎంలో 14.5 శాతం వాటా విక్రయం.. 883.20 కోట్ల బ్లాక్ డీల్
21 August 2024, 10:48 IST
- Cyient DLM : సైయెంట్ డీఎల్ఎంలో 14.5 శాతం వాటాను ఓపెన్ మార్కెట్‌లో బ్లాక్ డీల్స్ ద్వారా విక్రయించేందుకు బోర్డ్ ఆమోదం తెలిపిందని ఐటీ కంపెనీ సైయెంట్ ప్రకటించింది. దీని ద్వారా 883.20 కోట్లు బ్లాక్ డీల్ ద్వారా రానున్నాయి.
సైయెంట్ కంపెనీ
సైయెంట్ డీఎల్ఎం 14.5 శాతం వాటాను బ్లాక్ డీల్ ద్వారా విక్రయానికి ఆమోదం పొందింది. హైదరాబాద్‌కు చెందిన ఐటీ కంపెనీ సైయెంట్.. ఈ మేరకు స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఈ విషయాన్ని తెలిపింది. సైయెంట్ డీల్‌లో 14.5 శాతం వాటాకు సమానమైన అంటే.. 1.2 కోట్ల షేర్లను ఆగస్టు 21న విక్రయించింది. ఒక్కో షేరు కనీస ధరను రూ.766గా నిర్ణయించారు. దీనితో సైయెంట్ కంపెనీకి రూ.883.20 కోట్లు సమకూరాయి. ఈ నిధులతో రుణ భారాన్ని తగ్గించుకోవాలని కంపెనీ యోచిస్తోంది. అంతేకాకుండా నిర్వహణ మూలధన అవసరాలకు వినయోగించుకోనుంది. ఈ బ్లాక్ డీల్ తర్వాత సెయెంట్ డీఎల్ఎంలో సైయెంట్ కంపెనీ వాటా 52.15 శాతానికి చేరుతుంది.
ఈ డీల్ తర్వాత ఎన్‌ఎస్‌ఈలో సైయెంట్ షేర్లు 6 శాతం పెరిగి రూ. 2,049.95కి చేరుకోగా, సైయెంట్ డీఎల్‌ఎమ్ 3 శాతం తగ్గి రూ.765కి చేరుకుంది. వాటా విక్రయం ద్వారా వచ్చే ఆదాయాన్ని మూలధన అవసరాలు, రుణ చెల్లింపుల కోసం ఉపయోగించుకునే ప్రణాళికలను కూడా సైయంట్ వెల్లడించింది. 'ఇటీవల ప్రారంభించిన సెమీకండక్టర్ వ్యాపారంలో కీలక పెట్టుబడులు, దాని వృద్ధి, కంపెనీ రుణాల విరమణ వంటి వాటితో సహా కంపెనీ మూలధన అవసరాలను తీర్చడానికి బ్లాక్ డీల్ ద్వారా వచ్చిన నిధులను కేటాయించడం మా ఉద్దేశం.' అని సైయంట్ పేర్కొంది.
రుణ చెల్లింపులతోపాటుగా పెట్టుబడులకు వచ్చే ఆదాయాన్ని ఉపయోగించేందుకు Cyient DLMలో వాటాను ఉపసంహరించుకోవాలని సైయెంట్ ప్రణాళిక వేసిందని ఓ బ్రోకరేజీ సంస్థ తెలిపింది. ఈ కంపెనీకి చెందిన DET వ్యాపారం (సెమీకండక్టర్ వర్టికల్) ప్రస్తుతం జూన్ చివరి నాటికి రూ.47 మిలియన్ల డాలర్ల రుణాన్ని కలిగి ఉందని బ్రోకరేజ్ పేర్కొంది, వాటా విక్రయం ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఉపయోగించి తిరిగి చెల్లించవచ్చు అని అభిప్రాయపడింది.
సైయెంట్ డీఎల్ఎం FY24కి రూ. 1,192 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. అదే కాలానికి సైయంట్ మొత్తం ఆదాయం రూ. 7,147 కోట్లు. సైయెంట్ డీఎల్ఎం నికర విలువ మార్చి 31, 2024 నాటికి రూ. 909 కోట్లుగా ఉంది. ఇది సైయంట్ మొత్తం నికర విలువ రూ.4,557 కోట్లలో 20 శాతం అన్నమాట.